శారదకు నారాయణ బుజ్జగింపు
► పత్రికలకెక్కొద్దని ఒత్తిడి
► సమస్య పరిష్కారం కాకపోతే
► సీఎంను కలవాల్సిందేనని చైర్పర్సన్ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణకు మున్సిపల్ చైర్పర్సన్ శారదకు మధ్య అంతర్గత విభేదాలపై మంత్రి నారాయణ స్పందించారు. నెల్లూరులో మాదిరిగా ఇద్దరూ పత్రికలకెక్కకుండా కట్టడి చేయగలిగారు. సమస్యను తాను పరిష్కరిస్తానని మున్సిపల్ చైర్‌పర్సన్‌ను బుజ్జగించారు. మున్సిపాలిటీలో సర్వం తానై వ్యహరించాలనీ, చైర్పర్సన్ జాన్తానై అనేలా ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై చైర్పర్సన్ కొంత కాలంగా రగిలిపోతున్నారు. చైర్పర్సన్ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే కోపంతో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ కమిటీల ఏర్పాటు విషయంలో తన ఇంట్లోనే తన సమక్షంలోనే ఆమెను మరో కౌన్సిలర్‌తో తిట్టించారు.
ఈ సంఘటనతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మరింత దూరం పెరిగింది. ఎమ్మెల్యే వ్యవహారం సీఎం దగ్గరే తేల్చుకోవాలని చైర్‌పర్సన్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారమంతా ఆదివారం సాక్షిలో ‘ఇక తేల్చుకోవాల్సిందే’ శీర్షికన ప్రచురితమైంది. అసలే నెల్లూరు వివాదంతో సతమతమవుతున్న మంత్రి నారాయణ ఇది పెద్ద సమస్యగా మారకుండా కట్టడి చేయడానికి రంగంలోకి దిగా రు.
విదేశీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణ, చైర్పర్సన్ శారదతో మాట్లాడారు. ఇబ్బం దులు ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామనీ, ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ప్రకటించాలని చైర్‌పర్సన్‌కు సూ చించారు. అయిష్టంగానే ఆమె విలేకరుల సమావేశం పెట్టి ఎమ్మెల్యేతో తనకు గొడవలు లేవని చెప్పారు. మరో 15 రోజుల్లో మంత్రి ఈ సమస్యను పరిష్కరించక పోతే తాము మాత్రం సీఎంను కలవాల్సిందేనని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.