'సైకిల్ తొక్కండి...లేకపోతే లావైపోతారు'
రాయదుర్గం (హైదరాబాద్) : 'సైకిల్ తొక్కండి.. చాలా మంచిది..లేకపోతే లావైపోతారని...' సినీ హీరో మహేష్‌బాబు సూచించారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో'చక్ దే ఇండియా రైడ్'ను సినీ నటుడు జగపతిబాబు, దర్శకుడు కొరటాల శివతో కలిసి జెండా ఊపి రాయదుర్గంలోని హెచ్‌బీసీ సైక్లింగ్ స్టేషన్ వద్ద మహేష్‌బాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సైకిల్ తొక్కాలని కోరారు. సైక్లింగ్ ఎంతో ఆరోగ్యకరమని, పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. ఇండిపెండెన్స్‌డే అంటే తనకెంతో ఇష్టమని, ప్రతిసారీ ఉత్సాహంగా జరుపుకుంటానని, ఈ సారి శ్రీమంతుడు విజయంతో మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికే ఈ కార్యక్రమానికి వచ్చినట్లు వివరించారు.
సైకిల్ ఎంతో పాపులర్ అయింది : జగపతిబాబు
'శ్రీమంతుడు' సినిమాలో తాను చార్టర్ ప్లేన్‌లో దిగానని, కానీ హీరో మహేష్‌బాబు సైకిల్‌పై వచ్చాడని... దీంతో విలువైన చార్టర్ ప్లేన్ కన్నా సాధారణ సైకిల్ ఎంతో పాపులర్ అయిందని సినీ నటుడు జగపతిబాబు పేర్కొన్నారు. శ్రీమంతుడు సినిమాలో తండ్రీకొడుకులుగా జగపతిబాబు, మహేష్‌బాబులు నటించిన విషయం తెలిసిందే.
ట్రాఫిక్ జామ్...
కాగా 'చక్ దే ఇండియా రైడ్'ను జెండా ఊపి ప్రారంభించేందుకు వచ్చిన మహేష్‌బాబు, జగపతిబాబును చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలిరావటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. సినీ నటులు వెళ్లేంత వరకు ట్రాఫిక్ పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.