Chakkiligintha
-
చాలా ఉద్వేగంగా ఉంది!
‘‘వేమారెడ్డిగారు ఈ చిత్రకథ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. షూటింగ్ చేసినప్పుడు, విడుదలకు సిద్ధమయ్యాక అదే ఫీలింగ్ ఉంది. వేమారెడ్డిగారికి పెద్ద హీరోల నుంచి ఫోన్స్ వస్తున్నాయని విన్నాను. ఆనందంగా ఉంది’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డి దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, రెహానా జంటగా సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మించిన ‘చక్కిలిగింత’. డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంతో సుమంత్ అశ్విన్ హ్యాట్రిక్ సాధించడం ఖాయం’’ అని చెప్పారు. నరసింహాచారి మాట్లాడుతూ -‘‘నా జీవితంలో వచ్చిన మంచి మార్పులన్నీ డిసెంబర్ 5న జరిగినవే. ఇప్పుడీ చిత్రం అదే తేదీన విడుదల కానుంది. మిక్కీ జె. మేయర్ స్వర పరచిన పాటలకు ఆదరణ లభించినట్లుగానే, ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. వేమారెడ్డి మాట్లాడుతూ -‘‘ఈ కథ వినగానే ఎమ్మెస్ రాజుగారు అంగీకరించారు. అలాగే, నైజాం ఏరియాలో విడుదల చేస్తానని మొదట్నుంచీ ‘దిల్’ రాజుగారు అనేవారు’’ అన్నారు. ఈ చిత్రం తర్వాత మరిన్ని అవకాశాలొస్తాయనే నమ్మకముందని మాటల రచయిత జయంత్ అన్నారు. -
సుమంత్ అశ్విన్‌కి మంచి భవిష్యత్తు ఉంది : ప్రభాస్
‘‘నాకు ‘వర్షం’ వంటి విజయవంతమైన చిత్రం ఇచ్చారు ఎమ్మెస్ రాజుగారు. ఆ సినిమా అప్పుడు సుమంత్ అశ్విన్ చిన్నవాడు. ఇప్పుడు హీరో అయ్యాడు. తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి’’ అని ప్రభాస్ చెప్పారు. ఇలవల ఫిలింస్ సమర్పణలో రచయిత వేమారెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ, సీహెచ్. నరసింహాచారి, నరసింహారెడ్డి ఇలవల నిర్మిస్తున్న చిత్రం ‘చక్కిలిగింత’. సుమంత్ అశ్విన్, రెహానా నాయకా నాయికలు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో అతిథిగా పాల్గొన్న ప్రభాస్ సీడీని ఆవిష్కరించి దర్శకుడు సుకుమార్‌కి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘దిల్’ రాజు, సంస్థ లోగోను సుకుమార్, సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ - ‘‘ప్రభాస్ నా ఫేవరెట్ హీరో. ‘వర్షం’ సినిమాలో ప్రభాస్ జీప్ ఎత్తే సన్నివేశం, ఇంట్రడక్షన్ సీన్ తీసినప్పుడు లొకేషన్లోనే ఉన్నాను. హీరో అంటే ఇలా ఉండాలనుకున్నాను. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నాది చాలా మంచి పాత్ర’’ అన్నారు. మంచి కథ కావడంతో చక్కని స్వరాలివ్వగలిగానని మిక్కీ చెప్పారు. దర్శకునిగా తనకిది తొలి చిత్రమనీ, అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలని వేమారెడ్డి అన్నారు. ఈ చిత్రంలో నటించడంపట్ల రెహానా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో ఎమ్మెస్ రాజు, బీవీయస్‌యన్ ప్రసాద్, మారుతి తదితరులు పాల్గొన్నారు. -
‘చక్కిలిగింత’ఆడియో ఆవిష్కరణ