chalamesvar
-
అభిశంసనే సమాధానం కాదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) అభిశంసన అన్ని సమస్యలకు పరిష్కారం కాదని.. వ్యవస్థను సరిచేయటమే సరైన మార్గమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఢిల్లీలో శనివారం ‘ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనాలకు కేసులు కేటాయించటంలో సీజేఐ పాత్రకు సంబంధించిన పలు ప్రశ్నలకూ చలమేశ్వర్ సమాధానమిచ్చారు. ‘రోస్టర్‌పై సంపూర్ణాధికారం సీజేఐదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం ధర్మాసనాలను ఏర్పాటుచేయటం సీజేఐకి ఉన్న అధికారం. అయితే ఇది అధికారాన్ని అనుభవించేందుకు మాత్రమే కాదు. ప్రజా సమస్యలకు సరైన పరిష్కారాలిచ్చేందుకు కూడా దోహదపడాలి. అలాగని అభిశంసన సరైన సమాధానం కాదు. పరిష్కారం వెతకాలి కానీ.. తొలగింపు సరికాదు’ అని చలమేశ్వర్ తెలిపారు. జనవరి 12న ప్రెస్‌మీట్ పెట్టి సీజేఐపై బహిరంగ విమర్శలు చేసిన నలుగురిలో జస్టిస్ చలమేశ్వర్ ఒకరన్న విషయం విదితమే. హార్వర్డ్ క్లబ్ ఆఫ్ ఇండియా (అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివిన భారతీయులు ఏర్పాటుచేసుకున్న క్లబ్) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్.. జస్టిస్ చలమేశ్వర్‌కు కొంతకాలంగా న్యాయవ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లపై పలు ప్రశ్నలు సంధించారు. అయితే ‘ప్రభుత్వానికి మేలు చేసే ఉద్దేశంతోనే సీజేఐ ధర్మాసనాలను ఏర్పాటుచేస్తున్నారా? తను కోరుకున్న తీర్పులు ఇప్పించుకునేందుకే సీజేఐ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా?’ అనే ప్రశ్నలపై స్పందించేందుకు చలమేశ్వర్ నిరాకరించారు. ‘జస్టిస్ సీఎస్ కర్ణన్‌పై వెల్లడించిన తీర్పులోనూ మేం (జస్టిస్ గొగోయ్‌తో కలిసి).. వ్యవస్థను సరైన దార్లో పెట్టాల్సిన మెకానిజం గురించే పేర్కొన్నాం’ అని అన్నారు. కొలీజియంలో నలుగురు సీనియర్ న్యాయమూర్తులకు సీజేఐతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయన్న వ్యాఖ్యలపై చలమేశ్వర్ విభేదించారు. ‘మేం మా వ్యక్తిగత ఆస్తుల కోసం పోరాడటం లేదు. సంస్థాగత అంశాలపైనే భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నాం. దీనర్థం మేం ఒకరినొకరం విమర్శించుకుంటామని కాదు’ అని తెలిపారు. జూన్ 22న తన రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పదవులూ ఆశించటం లేదన్నారు. విపక్ష పార్టీలు అభిశంసనకోసం సంతకాల సేకరణ చేపడుతున్నాయన్న వార్తల నేపథ్యంలో చలమేశ్వర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ చలమేశ్వర్
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె. చలమేశ్వర్ తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్రావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు వేర్వేరుగా ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, ఆ తర్వాత వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.