త్వరలో 'చలో హైదరాబాద్': కోదండరాం
త్వరలో టి.జేఏసీ ఆధ్వర్యంలో 'చలో హైదరాబాద్'ను నిర్వహిస్తామని ఆ జేఏసీ కన్వీనర్ ప్రొ.కోదండరాం తెలిపారు. గురువారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 4 - 7 తేదీల మధ్యలో చలో అసెంబ్లీ నిర్వహిస్తామన్నారు. చలో అసెంబ్లీ అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. శాంతిని ప్రతిబింబించే విధంగా చలో 'హైదరాబాద్' కార్యక్రమం ఉంటుందని కోదండరాం వివరించారు.
ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కోదండరాం నిప్పులుచెరిగారు. సీఎం కిరణ్ తెలంగాణ ప్రజలను హైదరాబాద్లో ఉండనివ్వడని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రజలను కాందిశీకులుగా మారుస్తాడని కోదండరాం ఆరోపించారు. కిరణ్ చేసే వ్యాఖ్యలకు అర్థం పర్థం ఉండదని అన్నారు. విభజనను అడ్డుకోవడానికి టి.ఎమ్మెల్యేలను కొంటామని సీమాంధ్రులంటున్నారని ఆయన గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాలోని భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే అని కోదండరాం స్ఫష్టం చేశారు.