ఉస్మానియా ఉద్రిక్తం
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిరసన వెల్లువ
* ఉద్రిక్తతకు దారి తీసిన చలో అసెంబ్లీ ర్యాలీ
* పోలీసులపై రాళ్ళు రువ్విన ఆందోళనకారులు
* లాఠీచార్జి...ఐదుగురికి గాయాలు
* నిరుద్యోగ జేఏసీ నేతలు అరెస్టు, విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మరోసారి ఉద్రిక్తతకు నెలవైంది. కాంట్రాక్టు ఉద్యోగులక్రమబద్ధీకరణ అంశంతో క్యాంపస్ భగ్గుమంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర అలజడి రేపింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. వలయాలను చేధించుకుని ముందుకు దూసుకు వ స్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు.
ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో మరికొంత మంది ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి గన్ పార్కు వ ద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ... అసెంబ్లీ వైపు దూసుకేళ్లేందుకు యత్నించారు. వారిని పోలీ సులు అడ్డుకుని దొరికిన వారిని దొరికినట్లే చితకబాదారు. 12 మందిని అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.
ఎన్సీసీ గేటు వద్ద...
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు ఇంటర్నల్ పరీక్షలను, తరగతులను బహిష్కరించారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి ఉదయం 11 గంటలకు ర్యాలీగా బయలుదేరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్సీసీ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం అప్రజస్వామికమని ఆరోపిస్తూ ఎన్సీసీ గేటు వద్దే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
అదే సమయంలో కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా, ప్రతిగా పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో జేఏసీ చైర్మన్ కళ్యాణ్, టీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కిరణ్‌గౌడ్, జేఏసీ అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి, వీరబాబు, సోలంకి శ్రీనివాస్ గాయపడ్డారు. మరోవైపు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతరాయ్తో పాటు భీంరావ్నాయక్, రాము, బొప్పని ఈశ్వర్, శ్రీకాంత్, మల్లేష్, కమలాకర్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, తిరుపతి, రాజారమేష్ తదితరులను చితకబాది అరెస్ట్ చేశారు. షహనాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రాత్రి పొద్దుపోయిన తర్వాత విడిచిపెట్టినట్టు తెలిసింది.
అరెస్టుకు నిరసనగా నేడూ ధర్నాలు
కేసీఆర్ అనుసరిస్తున్న అణిచివేత ధోరణులకు నిరసనగా మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపపట్టాలని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు మంగళవారం వివిధ పార్టీల నేతలను సంప్రదించనునట్లు చెప్పారు. డిసెంబరు మొదటి వారంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనునట్లు అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి తెలిపారు.