బాబ్బాబు.. మా జాబు!
కాంట్రాక్టు అధ్యాపకుల విషయంలో వెనక్కు తగ్గని ప్రభుత్వం
ఆందోళన బాటలో కాంట్రాక్టు అధ్యాపకులు
రోడ్డున పడనున్న 300 మంది లెక్చరర్లు
ఈనెల 21న చలో గుంటూరుకు పిలుపు
నిడదవోలు: బాబు కావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే కొత్తజాబుల మాట ఎలా ఉన్నా ఉన్న జాబులు ఊడిపోతున్నాయి. చాలీచాలని జీతాలతో 17 ఏళ్లుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏకీకృత సర్వీసు పేరిట వీరిని తొలగించేందుకు సర్కారు కుట్ర పన్నడంతో జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు అందోళన చెందులున్నారు. ఈనెల 21న ’చలో గుంటూరు’ పేరుతో ఉన్నత విద్యా శాఖ కమిషనరేట్ ముట్టడి కార్యాక్రమానికి కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం ఇప్పటికే పిలుపు నిచ్చింది.
జీఓ నంబర్ 223 అమలు చేయాలని డిమాండ్
223 జీఓ ప్రకారం ఏకీకృత సర్వీసుల నుంచి జూనియర్ అధ్యాపకులను మినహాయించి మిగిలిన డైట్ కళాశాలల అధ్యాపకులు, డీవైఈఓ, ఎంఈఓ పొస్టులను భర్తీ చేసుకోవాలని కోరుతున్నారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలబెట్లుకోవాలని జూనియర్ అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. జీఓ నం.3 కూడా కనీస వేతనం ఇవ్వాలని చెబుతోంది. దీనిపై కాంట్రాక్టు అధ్యాపకులు 2016 డిసెంబర్ నుంచి 33 రోజుల పాటు సమ్మె చేశారు. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ కనీస వేతనం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రస్తుతం నెలకు రూ.37 వేల కనీస వేతనాన్ని ఇస్తోంది. అయితే ఇక్కడ మాత్రం కేవలం రూ.18 వేలు మాత్రమే ఇస్తూ తమ శ్రమను దోచుకుంటున్నారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనలో 300 మంది అధ్యాపకులు
ఏకీకృత పర్వీసుల పేరుతో కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తే జిల్లాలో 300 మంది అధ్యాపకులు రోడ్డున పడనున్నారు. వీరిలో 32 ప్రభుత్వ జూనియర్ కలాశాలల్లో 240 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 12 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 60 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత కోసం పోరాటం చేస్తే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీసేని తమను నడిరోడ్డు మీద నిలబెట్టేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపిస్తున్నారు.
2000లో నియామకం..
జిల్లాలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యా బోధన చేసేందుకు 2000 సంవత్సరంలో అప్పటి టీడీడీ ప్రభుత్వం వీరిని నియమించింది. మొదట్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రారంభంలో ఏడు నెలలకు ఒక్కసారి జీతాలు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు 4,500 ఇచ్చేవారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంట్రాక్టు అధ్యాపకుల వేతనం నెలకు 7,500 రూపాయలకు పెంచుతూ జీఓ జారీ చేశారు. 2010 నవంబర్లో విద్యార్థి, ప్రజాసంఘాల మద్దతుతో చేపట్టిన ఉద్యమంతో వేతనాన్ని రూ.18 వేలకు పెంచేలా చేయడంలో విజయం సాధించారు.
తగిన గుణపాఠం చెబుతాం
గోపే శ్యాంకుమార్, జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు
కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తే రాబోయో ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతాం. అధ్యాపక వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న మా ఉద్యోగాలు తీసేస్తే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న మాకు ప్రస్తుతం కుటుంబ పోషణే కష్టంగా ఉంటోంది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం.