'సీఎంల్లో ఉత్తమ అవకాశవాది చంద్రబాబే'
విజయవాడ: దేశ ముఖ్యమంత్రుల్లో ఉత్తమ అవకాశవాది అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబే అర్హుడని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, తదనంతర పరిణామాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ధ్వజమెత్తారు. 'చలో వెలగపూడి-ప్రశ్నిద్దాం రండి' పేరుతో గురువారం ప్రజాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలని రఘువీరా కోరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సర్కస్ కంపెనీని తలపిస్తోందని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సీఎం చంద్రబాబులు రోజుకోమాట, పూటకో ఉత్తర్వులిస్తున్నారన్నారు. మోదీ పిచ్చి తుగ్లక్ పాలనలో చంద్రబాబు ప్రధాన భాగస్వామి అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సర్కస్ కంపెనీ పెట్టుకుంటే మంచిదని సూచించారు.
నోట్ల రద్దుపై బాబు యూ టర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. హోదా విషయంలో కూడా బాబు ఇదే తీరును ప్రదర్శించారన్నారు. మంగళవారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశంలో ఎవరూ తన మాట వినడంలేదని బాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ విధంగా చెబితే రాష్ట్రంలో పాలన ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. బాబు రెండున్నర ఏళ్ల పాలనలో పూర్తిగా అవినీతిమైందన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల అవినీతి పాలన వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు బాబు మాట వినడం లేదన్నారు.