
శేఖర్‌రెడ్డి.. చంద్రబాబు బినామి: ఏపీసీసీ చీఫ్ రఘువీరా
విజయవాడ: అక్రమ ఆస్తుల వ్యవహారంలో పట్టుబడిన టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు బినామీ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆంధ్రరత్న భవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చెన్నైలో చంద్రబాబుకు చాలా మంది ఆప్తులు ఉన్నప్పటికీ వారిని కాదని బినామీ కాబట్టే శేఖర్ రెడ్డికి టీటీడీ పదవి ఇచ్చారని అన్నారు.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కష్టాలకు నిరసనగా ‘ప్రశ్నిద్దాం రండి’ పేరుతో తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 23న చలో వెలగపూడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు రఘువీరారెడ్డి తెలిపారు. తాత్కాలిక సచివాలయానికి సమీపంలో ఈ నిరసన కార్యక్రమం ఉంటుందని, అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
సామాన్యుల ఇళ్లలో డబ్బులు లేక పెళ్లిళ్లు వాయిదా పడుతుంటే, మరోపక్క బీజేపీ నాయకుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ప్రజలు రోడ్లపై నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని వాపోయారు. పాత పెద్ద నోట్ల రద్దు తన వలనే అని చెప్పుకుంటున్న చంద్రబాబు 2 వేల రూపాయల నోట్లు రద్దు చేయాలని ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.