chambal valley
-
IPS Preeti Chandra: చంబల్‌ను గడగడలాడించింది.. ఆమె నిజంగానే శివంగి!
చంబల్‌లోయ అంటే మహా మహా పోలీస్ ఆఫీసర్లు కూడా ‘వద్దు సార్’ అంటారు పోస్టింగ్. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్ తీసుకుంది. సరిగ్గా మూడు నెలలు. బందిపోట్లు గడగడలాడారు. ‘దీని వెనుక పెద్దవాళ్లున్నారు’ అని కొన్ని కేసుల జోలికి రారు ఆఫీసర్లు. కాని ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది. కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్‌లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. ఆమె శివంగి. నిజంగానే. అది 2020, మే నెల. లాక్డౌన్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని జోద్పూర్ వెస్ట్ కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్‌లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కారు ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను కల్యాణ్‌పూర్ నుంచి జోద్‌పూర్‌కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరముంది. ప్రీతి చంద్ర వెంటనే రంగంలో దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్సీట్లోకి మార్పించింది. దగ్గర్లోనే ఉన్న టెంట్ హాల్‌ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది. ఒక టీమ్‌ను డాక్టర్ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టరు వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లీబిడ్డా క్షేమం. కాని ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది– ప్రీతి అని. చంబల్‌ను గడగడలాడించింది! 2019లో ప్రీతి చంద్రాను కరోలి జిల్లాకు ఎస్పిగా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్‌లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్.పి కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే. కాని ప్రీతి చంద్ర చార్జ్ తీసుకున్న మూడు నెలల్లోనే చంబల్‌ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్ లో క్యాంప్ చేసింది. సరిగ్గా మూడు నెలల్లో పదిమంది పేరుమోసిన బందిపోట్లను అరెస్ట్ చేసింది. వారికి ఇన్ఫార్మర్లుగా పని చేసేవారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరార్ అయ్యారు. కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ ‘లేడీ సింగం’ అని పిలవసాగారు. స్కూల్ టీచర్ నుంచి ఐపీఎస్ దాకా ప్రీతి చంద్ర రాజస్థాన్‌లో 2008 ఐ.పి.ఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఆమెది సీకర్ జిల్లాలోని కుందన్ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్.ఎఫ్‌లో పని చేసేవాడు. తల్లి నిరక్షరాస్యురాలు. ‘మా అమ్మ జీవితంలో పెన్సిల్ కూడా పట్టుకుని ఎరగదు. కాని నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టు బట్టింది. నేను ఐ.పి.ఎస్ అవడానికి ఆమే కారణం’ అంటుంది ప్రీతి. జైపూర్‌లో ఎం.ఏ, ఎం.ఫిల్ చేసిన ప్రీతి కొన్నాళ్లు స్కూల్లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్లు జర్నలిస్ట్‌గా పని చేసింది. నిజానికి జర్నలిస్టుగానే ఎదగాలని అనుకుందిగాని యు.పి.ఎస్.సి రాసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఐ.పి.ఎస్ అయ్యింది. ప్రీతి చంద్ర ఇప్పుడు బికనీర్‌కి ఎస్.పిగా ఉంది. బికనీర్‌కి ప్రథమ మహిళా ఎస్.పి ఆమె. ‘ఈ జిల్లా ఏర్పడి చాలా కాలం అయ్యింది. నా కంటే ముందు చాలామంది మహిళా అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. వ్యవస్థలో మహిళలకు అవకాశం ఇవ్వడం సంకుచితత్వం ఉంది. అలాగే మహిళలు కూడా బాధ్యతను స్వీకరించడం లో వెనుకంజ వేయడం మానాలి’ అంటుందామె. చదవండి: ఆమె చేయని మంచి పని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!! -
హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..
సిమ్లా: ఉత్తర భారతంలో ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు ఆకస్మిక వరదలు కొన్ని ప్రాంతాలను కకావికలం చేసాయి. కొండ ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై, రహదారులు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చంబా వ్యాలీలో ఆకస్మికంగా వరద రావడంతో స్థానిక జనం ఉలిక్కిపడ్డారు. ఉన్నపళంగా వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా జులాఖడీ, ముగ్లా, కరియన్, హర్దాస్పురాల్లో పరిస్థితి దారుణంగా మారింది. చంబా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. రోడ్లపై వరదనీరు నిండడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి. మరోవైపు వర్షం కూడా ప్రారంభమై ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వరద ఆగడం లేదు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టి, రోడ్లపై వరదనీటిని తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా చంబా లోయలో ఇదే సమస్య ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిపై తేలాడుతున్నాయి. వరద తగ్గిన చోట వాహనలు బురదలో కూరుకుపోయాయి. దీంతో వాహన యాజమానులు లబోదిబోమంటున్నారు. వందలాదిమంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సహాయక చర్యల కోసం బుల్డోజర్లను వినియోగిస్తున్నారు. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇంటి సామానంతా వరదనీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా చంబా వ్యాలీలో అపారనష్టం జరిగింది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటించారు. పరిస్థితిని సమీక్షించి, నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల వెంట తామున్నామంటూ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. -
దోపిడీదార్ల భరతం పడతా
బందిపోటు మంచివాడిగా మారి ఒకప్పుడు అసహ్యించుకున్న ప్రజల చేతే పూజలు చేయించుకునే ఇతివృత్తంతో అనేక సినిమాలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మల్కన్ సింగ్ రాజ్‌పుత్ కథ కూడా అలాంటిదే . దోపిడీ దొంగలు, హంతకులకు ఆలవాలమైన మధ్య ప్రదేశ్‌లోని చంబల్‌లోయ పేరు వింటేనే అప్పట్లో ప్రజలు గడగడ వణికిపోయే వారు. అలాంటి చంబల్ లోయకే నాయకుడైన మల్కన్ 70వ దశకంలో ప్రజలనే కాక ప్రభుత్వాలకు కూడా నిద్ర పట్టకుండా చేశాడు.అనేక హత్యలు, దోపిడీలు చేసిన మల్కన్‌ను పట్టిచ్చిన వారికి ప్రభుత్వం 70 వేల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అయితే, మల్కన్‌ను పట్టించడానికి కాదు కదా ఆయన ఆచూకీ చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆయనంతట ఆయనే అనుచరులతో సహా లొంగిపోయి జన జీవన స్రవంతిలోకి వచ్చారు.ఆనాటి దోపిడీ దొంగ ఇప్పుడు సమాజంలో ఉండే దోపిడీగాళ్ల భరతం పట్టడానికి ఎన్నికల బరిలో దిగానని చెబుతున్నారు. బుర్ర మీసాలు, గిరజాల జట్టుతో,అమెరికా తయారీ తుపాకీని భుజాన వేసుకుని 76 ఏళ్ల వయసులో కూడా బలిష్టంగా ఉన్న ఆరడుగుల ఈ మాజీ దొంగ దోపిడీల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. తననెవరైనా బందిపోటు అంటే మండిపడే మల్కన్ తనను తాను తిరుగుబాటు దారుడిగా చెప్పుకుంటారు.‘నేను బందిపోటును కాను.ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మ రక్షణ కోసం తుపాకీ పట్టే తిరుగుబాటుదారుడిని. నిజమైన దోపిడీ దొంగలెవరో నాకు తెలుసు. వాళ్లతో ఎలా వ్యవహరించాలో కూడా బాగా తెలుసు.’అంటున్నారు మల్కన్. బందిపోటు అయిన మీకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే ‘ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడానికి వీల్లేదు. అలా నేను చూస్తాను. నన్ను ఎన్నుకుంటేనే వాళ్లకి ఆ మంచి జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. పేదలు, మహిళలపై అత్యాచారాలు చేసే వారికి, వాళ్లకు అన్యాయం చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతానని మల్కన్ చెబుతున్నారు.15 ఏళ్ల పాటు చంబల్ లోయను ఏలిన తాను లోయలో కుల మత ప్రసక్తి లేకుండా అందరి బాగోగులు చూశానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని అంటున్నారు. ఇక్కడి వాతావరణం నాకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మా పార్టీ కూడా బలంగా ఉంది. నియోజకవర్గంలో వెళ్లినచోటల్లా నాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాబట్టి కచ్చితంగా గెలుస్తాను’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. 17 ఏళ్లకే మల్కన్‌ను(1964) పోలీసులు ఆయుధ చట్టం కింద అరెస్టు చేశారు.మల్కన్ ముఠా అంటే చంబల్ లోయలో అందరికీ హడల్. ఆ ముఠా పై 94 కేసులుండేవి. వాటిలో 18 దోపిడీలు, 28 కిడ్నాప్‌లు, 17 హత్యలు ఉన్నాయి. పలు దఫాల చర్చల తర్వాత 1982లో అప్పటి మధ్య ప్రదేశ్ సీఎం అర్జున్ సింగ్ సమక్షంలో మల్కన్ లొంగిపోయారు. శివపురిలో స్థిరపడ్డారు. ఇప్పటికీ చాలా మంది మల్కన్‌ను రాబిన్‌హుడ్‌గా అభిమానిస్తుంటారు. 2009లో మల్కన్ ధౌరహ్రా నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జితిన్ ప్రసాద్ తరఫున ప్రచారం చేసి ఆయన గెలుపునకు దోహదపడ్డారు. ఈ సారి టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని, అందుకే జ్యోతిరాదిత్య సింధియా, రాజ్ బబ్బర్‌లను కలుసుకున్నానని చెప్పారు. అయితే, వారు టికెట్ ఇవ్వకపోవడంతో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ నియోజకవర్గంలో మే 6వ తేదీన పోలింగు జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి జితిన్ ప్రసాద్, బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ, బీఎస్పీ అభ్యర్థి అర్షద్ ఇలియాస్ సిద్ధిఖిలతో మల్కన్ తలపడుతున్నారు. -
అప్పట్లో బందిపోటు..ఇప్పుడు బ్యాలెట్ బరిలో..
భోపాల్ : యూపీ, మధ్యప్రదేశ్‌ల్లో విస్తరించిన చంబల్ లోయలో 1970 ప్రాంతాల్లో ఆయన పేరు చెబితే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టేది. హత్యలు, కిడ్నాప్‌లు, హత్యాయత్నం కేసులను ఎదుర్కొన్న ఈ మాజీ బందిపోటు ఇప్పుడు సమాజంలో డెకాయిట్లకు వ్యతిరేకంగా పోరాడే రెబెల్‌గా మారానని చెబుతున్నారు. బందిపోట్ల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కవచంలా ఉంటానంటూ ఎన్నికల బరిలో దిగాడు. బందిపోటుగా చంబల్ లోయను వణికించిన 76 ఏళ్ల మల్కాన్ సింగ్ రాజ్పుట్ ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధిగా దరుహ్ర స్ధానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల్లో తన విజయం ఖాయమని, తమ పార్టీ ఆ ప్రాంతంలో బలంగా ఉందని, ప్రచారంలో తానెక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మల్కాన్ సింగ్ చెబుతున్నారు. తనను 17 ఏళ్ల వయసులోనే ఆయుధ చట్టం కింద పోలీసులు 1964లో అరెస్ట్ చేశారని, తాను నిత్యం సామాన్య ప్రజల పట్ల పోరాడతానని, వారిని బందిపోట్ల నుంచి కాపాడతానని ఆయన చెప్పుకొచ్చారు. పేదలు, మహిళలను వేధించే వారికి వ్యతిరేకంగా తాను నిలబడతానని హామీ ఇచ్చారు. ఒక డెకాయిట్‌కు ప్రజలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించగా, తాను ప్రజలకు రక్షణగా ఉంటానని ఇక్కడ ఎవరికీ ఏ ఒక్కరూ అన్యాయం చేయలేరని, ప్రజలకు వారి ప్రతినిధిగా తన నుంచి అందరూ లబ్ధి పొందవచ్చని చెప్పారు. తాను బందిపోటును కాదని, కేవలం ఆత్మ గౌరవం, ఆత్మరక్షణ కోసమే తుపాకీని చేతబట్టానని చెప్పుకున్నారు. తనకు నిజమైన బందిపోట్లు ఎవరో తెలుసుననీ, వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్‌లో వేరొక స్ధానం కాకుండా దరుహ్రనే ఎందుకు ఎంచుకున్నారని అడగ్గా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తుండగా తానెందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. కాగా మల్కాన్ ఆయన గ్యాంగ్‌పై చంబల్‌లో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు సహా మొత్తం 94 పోలీసు కేసులున్నాయి. 1982లో అప్పటి మధ్యప్రదేశ్ సీఎం అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయిన తర్వాత మల్కాన్ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో స్ధిరపడ్డారు. 76 ఏళ్ల వయసులో ఆరు అడుగుల పైగా ఎత్తుతో గంభీరంగా కనిపించే మల్కాన్ తన కాన్వాయ్‌తో దరుహ్ర రహదారుల దుమ్ముదులుపుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2009లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి జితిన్ ప్రసాద విజయానికి మల్కాన్ కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి తనకు బందా టికెట్ ఇస్తానని నమ్మబలికి మోసం చేసిందని మల్కాన్ ఆరోపించారు. ఇక దరుహ్ర నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి జితిన్ ప్రసాద, బీజేపీ అభ్యర్ధి రేఖా వర్మ, బీఎస్పీ కూటమి అభ్యర్ధి అర్షద్ ఇలియాస్ సిద్ధిఖిలతో చతుర్ముఖ పోరులో చెమటోడుస్తున్నారు. దిగ్గజ అభ్యర్ధులను ఢీ కొని మాజీ డెకాయిట్ ఎంతమేర రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. -
ఫూలన్ దేవి తల్లికి ఎంత కష్టం!
చంబల్ లోయ ప్రాంతాన్ని గడగడ వణికించిన దొంగల రాణి.. ఫూలన్ దేవి. ఆమె పేరు వింటే చాలు.. భూస్వాముల వెన్నులో వణుకు పుట్టేది. 1980 ప్రాంతాలలో ఆమెను పట్టుకోవాలన్నా పోలీసులు కూడా భయపడేవారు. అలాంటి ఫూలన్ దేవి ఎంత డబ్బు కూడబెట్టిందో అనుకుంటాం కదూ. కానీ, ఇప్పుడు ఆమె తల్లి మాత్రం తిండికి కూడా గతి లేక అల్లాడుతున్నారు. ఫూలన్ దేవి తల్లి మూలాదేవికి ఇప్పుడు 70 ఏళ్ల వయసుంది. ఫూలన్ దేవి బందిపోటుగా ఉన్నప్పుడు మూలాదేవి బయటకు వచ్చారంటే చాలు.. జనం వంగి వంగి సలాములు చేసేవారు. ఆమెను చూసేందుకే పెద్దసంఖ్యలో వచ్చేవారు. కానీ ఇప్పుడు కేవలం ఆ జ్ఞాపకాలతోనే ఆమె బతకాల్సి వస్తోంది. గత సంవత్సరం కరువు ప్రాంతాలపై సర్వే చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు మూలాదేవి, ఆమె కూతురు రామ్‌కలీ (ఫూలన్ చెల్లెలు) కనిపించారు. ఇద్దరూ కూడా కరువుతో దాదాపు చావుకు దగ్గరగా ఉన్నారు. అప్పటికి వాళ్లింట్లో కొద్దిపాటి గోధుమ పిండి, పావుకిలో ఉల్లిపాయలు తప్ప ఏమీ లేవు. 17 ఏళ్ల క్రితం ఎంపీగా కూడా పనిచేసిన ఒక మహిళ కుటుంబ సభ్యులు ఇంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారంటే ఆ ప్రతినిధులు నమ్మలేకపోయారు. షేఖ్‌పూర్ గుఢా గ్రామం శివార్లలో వారికి మూడు బిఘాల భూమి ఉంది. కానీ ఇప్పుడు రామ్‌కలీ ఉపాధి హామీ పనులు దొరికితే వాటికి వెళ్లి నెలకు రూ. 300-400 వరకు తెస్తుంది. అక్కడ అంతకంటే ఎక్కువ పని దొరకడంలేదు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు తమ వద్దకు వస్తారని, వాళ్లు తనను స్టేజి మీద చూపించి, తనకు రూ. 200 ఇస్తారని రామ్‌కలీ చెప్పారు. కానీ తర్వాతి కాలంలో వేరే అభ్యర్థుల నుంచి తనకు బెదిరింపులు రావడంతో అది కూడా మానేశానన్నారు. ఫూలన్ దేవి 1983లో పోలీసులకు లొంగిపోయారు. ఆమెపై 48 కేసులు ఉన్నాయి. వాటన్నింటినీ ఆ తర్వాత ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం కొట్టేసింది. 1994లో ఆమె జైలు నుంచి విడుదలై, రెండేళ్ల తర్వాత మీర్జాపూర్ ఎంపీగా గెలిచారు. 1999లో మరోసారి కూడా నెగ్గారు గానీ, 2001 జూలై 25వ తేదీన ఆమె అధికారిక నివాసం వద్దే కాల్పుల్లో చనిపోయారు. ఫూలన్ హత్య తర్వాత తమ భూమిని ఠాకూర్లు లాగేసుకున్నారని, అప్పటి నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని మూలాదేవి చెప్పారు. తన చిన్న కూతురికి పార్టీ టికెట్ ఇస్తామని ములాయం చెప్పారు గానీ, తర్వాత ఏమీ జరగలేదన్నారు. ఫూలన్ సొంత గ్రామం బుందేల్‌ఖండ్ ప్రాంతంలోకి వస్తుంది. అక్కడి నాయకులు తాము వాళ్లకు సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు గానీ.. వాస్తవంలో చూస్తే అవేమీ కనిపించడంలేదు.