Real Lady Singam IPS Preeti Chandra Inspirational Journey In Telugu - Sakshi
Sakshi News home page

IPS Preeti Chandra: చంబల్‌ను గడగడలాడించింది.. ఆమె నిజంగానే శివంగి!

Published Tue, Oct 5 2021 8:34 AM | Last Updated on Tue, Oct 5 2021 1:25 PM

Rajasthan Lady Singham IPS Preeti Chandra Inspirational Journey Telugu - Sakshi

చంబల్‌లోయ అంటే మహా మహా పోలీస్‌ ఆఫీసర్లు కూడా ‘వద్దు సార్‌’ అంటారు పోస్టింగ్‌. ప్రీతి చంద్ర అక్కడ పోస్టింగ్‌ తీసుకుంది. సరిగ్గా మూడు నెలలు. బందిపోట్లు గడగడలాడారు. ‘దీని వెనుక పెద్దవాళ్లున్నారు’ అని కొన్ని కేసుల జోలికి రారు ఆఫీసర్లు. కాని ప్రీతి చంద్ర పెద్దవాళ్లు ఉన్న కేసుల్నే గట్టిగా పట్టుకుంటుంది. కటకటాల వెనక్కు తోస్తుంది. అందుకే ఆమెను రాజస్థాన్‌లో అందరూ లేడీ సింగం అని పిలుస్తారు. ఆమె శివంగి. నిజంగానే.

అది 2020, మే నెల. లాక్‌డౌన్‌ నడుస్తోంది. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ వెస్ట్‌ కమిషనర్‌గా విధుల్లో ఉన్న ప్రీతి చంద్ర పెట్రోలింగ్‌లో ఉంది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కగా ఒక కారు ఆగింది. అందులో గర్భిణీ ఉంది. ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఆమెను కల్యాణ్‌పూర్‌ నుంచి జోద్‌పూర్‌కు కాన్పు కోసం తీసుకుని వస్తుంటే మధ్యలో నొప్పులు తీవ్రమయ్యాయి. ఇంకా సిటీకి దూరముంది. ప్రీతి చంద్ర వెంటనే రంగంలో దిగింది. గర్భిణిని సౌకర్యం కోసం తన ఇన్నోవా బ్యాక్‌సీట్‌లోకి మార్పించింది. దగ్గర్లోనే ఉన్న టెంట్‌ హాల్‌ను తెరిపించి షామియానా తెరలను చుట్టూ పోలీసులు పట్టుకుని నిలబడేలా చాటు ఏర్పాటు చేసింది.

ఒక టీమ్‌ను డాక్టర్‌ కోసం పంపించి తనతో ఉన్న మహిళా కానిస్టేబుల్స్‌ను కాన్పు పనిలో సాయం పట్టమంది. డాక్టరు వచ్చేలోపే కాన్పు జరిగిపోయింది. తల్లీబిడ్డా క్షేమం. కాని ప్రీతి చంద్ర సకాలంలో స్పందించకపోతే ప్రమాదం జరిగి ఉండేది. ఆ తల్లికి ప్రీతి చంద్ర అంటే ఎంతో కృతజ్ఞత ఏర్పడింది. తన కూతురికి ఆమె పేరే పెట్టుకుంది– ప్రీతి అని.

చంబల్‌ను గడగడలాడించింది!
2019లో ప్రీతి చంద్రాను కరోలి జిల్లాకు ఎస్‌పిగా వేశారు. కరోలీ జిల్లాలో చంబల్‌లోయ ఒక భాగం వస్తుంది. ఆ జిల్లాకు ఎస్‌.పి కావడం అంటే బందిపోట్ల తలనొప్పిని తెచ్చి పెట్టుకోవడమే. కాని ప్రీతి చంద్ర చార్జ్‌ తీసుకున్న మూడు నెలల్లోనే చంబల్‌ను గడగడలాడించింది. మగ ఆఫీసర్లు వెళ్లడానికి జంకే లోయలోని ప్రాంతాలను సందర్శించింది. వారంలో ఒకసారి చంబల్‌ లో క్యాంప్‌ చేసింది. సరిగ్గా మూడు నెలల్లో పదిమంది పేరుమోసిన బందిపోట్లను అరెస్ట్‌ చేసింది. వారికి ఇన్‌ఫార్మర్లుగా పని చేసేవారిని లోపల వేసింది. ఆ దెబ్బకు ఆ ప్రాంతంలోని బందిపోట్లు పరార్‌ అయ్యారు. కొందరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ప్రీతి చంద్రను అందరూ ‘లేడీ సింగం’ అని పిలవసాగారు.

స్కూల్‌ టీచర్‌ నుంచి ఐపీఎస్‌ దాకా
ప్రీతి చంద్ర రాజస్థాన్‌లో 2008 ఐ.పి.ఎస్‌ బ్యాచ్‌ ఆఫీసర్‌. ఆమెది సీకర్‌ జిల్లాలోని కుందన్‌ అనే చిన్న ఊరు. తండ్రి బి.ఎస్‌.ఎఫ్‌లో పని చేసేవాడు. తల్లి నిరక్షరాస్యురాలు. ‘మా అమ్మ జీవితంలో పెన్సిల్‌ కూడా పట్టుకుని ఎరగదు. కాని నన్ను, నా చెల్లెల్ని, మా తమ్ముణ్ణి బాగా చదివించాలని పట్టు బట్టింది. నేను ఐ.పి.ఎస్‌ అవడానికి ఆమే కారణం’ అంటుంది ప్రీతి. జైపూర్‌లో ఎం.ఏ, ఎం.ఫిల్‌ చేసిన ప్రీతి కొన్నాళ్లు స్కూల్‌లో పాఠాలు చెప్పింది. మరికొన్నాళ్లు జర్నలిస్ట్‌గా పని చేసింది. నిజానికి జర్నలిస్టుగానే ఎదగాలని అనుకుందిగాని యు.పి.ఎస్‌.సి రాసి ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే ఐ.పి.ఎస్‌ అయ్యింది.

ప్రీతి చంద్ర ఇప్పుడు బికనీర్‌కి ఎస్‌.పిగా ఉంది. బికనీర్‌కి ప్రథమ మహిళా ఎస్‌.పి ఆమె. ‘ఈ జిల్లా ఏర్పడి చాలా కాలం అయ్యింది. నా కంటే ముందు చాలామంది మహిళా అధికారులు ఉన్నారు. ఇన్నాళ్లకు ఒక మహిళకు అవకాశం ఇచ్చారు. వ్యవస్థలో మహిళలకు అవకాశం ఇవ్వడం సంకుచితత్వం ఉంది. అలాగే మహిళలు కూడా బాధ్యతను స్వీకరించడం లో వెనుకంజ వేయడం మానాలి’ అంటుందామె.

చదవండి: ఆమె చేయని మంచి ప‌ని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!!  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement