భోపాల్ : యూపీ, మధ్యప్రదేశ్‌ల్లో విస్తరించిన చంబల్ లోయలో 1970 ప్రాంతాల్లో ఆయన పేరు చెబితే ఎవరికైనా వెన్నులో వణుకుపుట్టేది. హత్యలు, కిడ్నాప్‌లు, హత్యాయత్నం కేసులను ఎదుర్కొన్న ఈ మాజీ బందిపోటు ఇప్పుడు సమాజంలో డెకాయిట్లకు వ్యతిరేకంగా పోరాడే రెబెల్‌గా మారానని చెబుతున్నారు. బందిపోట్ల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కవచంలా ఉంటానంటూ ఎన్నికల బరిలో దిగాడు. బందిపోటుగా చంబల్ లోయను వణికించిన 76 ఏళ్ల మల్కాన్ సింగ్ రాజ్‌పుట్ ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్ధిగా దరుహ్ర స్ధానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్నికల్లో తన విజయం ఖాయమని, తమ పార్టీ ఆ ప్రాంతంలో బలంగా ఉందని, ప్రచారంలో తానెక్కడికి వెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని మల్కాన్ సింగ్ చెబుతున్నారు.
తనను 17 ఏళ్ల వయసులోనే ఆయుధ చట్టం కింద పోలీసులు 1964లో అరెస్ట్ చేశారని, తాను నిత్యం సామాన్య ప్రజల పట్ల పోరాడతానని, వారిని బందిపోట్ల నుంచి కాపాడతానని ఆయన చెప్పుకొచ్చారు. పేదలు, మహిళలను వేధించే వారికి వ్యతిరేకంగా తాను నిలబడతానని హామీ ఇచ్చారు. ఒక డెకాయిట్‌కు ప్రజలు ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించగా, తాను ప్రజలకు రక్షణగా ఉంటానని ఇక్కడ ఎవరికీ ఏ ఒక్కరూ అన్యాయం చేయలేరని, ప్రజలకు వారి ప్రతినిధిగా తన నుంచి అందరూ లబ్ధి పొందవచ్చని చెప్పారు.
తాను బందిపోటును కాదని, కేవలం ఆత్మ గౌరవం, ఆత్మరక్షణ కోసమే తుపాకీని చేతబట్టానని చెప్పుకున్నారు. తనకు నిజమైన బందిపోట్లు ఎవరో తెలుసుననీ, వారిని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలుసని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్‌లో వేరొక స్ధానం కాకుండా దరుహ్రనే ఎందుకు ఎంచుకున్నారని అడగ్గా, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని, ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తుండగా తానెందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు.
కాగా మల్కాన్ ఆయన గ్యాంగ్‌పై చంబల్‌లో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ వంటి కేసులు సహా మొత్తం 94 పోలీసు కేసులున్నాయి. 1982లో అప్పటి మధ్యప్రదేశ్ సీఎం అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయిన తర్వాత మల్కాన్ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో స్ధిరపడ్డారు. 76 ఏళ్ల వయసులో ఆరు అడుగుల పైగా ఎత్తుతో గంభీరంగా కనిపించే మల్కాన్ తన కాన్వాయ్‌తో దరుహ్ర రహదారుల దుమ్ముదులుపుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2009లో ఇదే నియోజకవర‍్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి జితిన్ ప్రసాద విజయానికి మల్కాన్ కృషి చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఈసారి తనకు బందా టికెట్ ఇస్తానని నమ్మబలికి మోసం చేసిందని మల్కాన్ ఆరోపించారు. ఇక దరుహ్ర నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి జితిన్ ప్రసాద, బీజేపీ అభ్యర్ధి రేఖా వర్మ, బీఎస్పీ కూటమి అభ్యర్ధి అర్షద్ ఇలియాస్ సిద్ధిఖిలతో చతుర్ముఖ పోరులో చెమటోడుస్తున్నారు. దిగ్గజ అభ్యర్ధులను ఢీ కొని మాజీ డెకాయిట్ ఎంతమేర రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment