దోపిడీదార్ల భరతం పడతా | Malkhan Singh is now fighting Dhawraha | Sakshi
Sakshi News home page

దోపిడీదార్ల భరతం పడతా

Published Sat, May 4 2019 5:46 AM | Last Updated on Sat, May 4 2019 5:49 AM

Malkhan Singh is now fighting Dhawraha - Sakshi

బందిపోటు మంచివాడిగా మారి ఒకప్పుడు అసహ్యించుకున్న ప్రజల చేతే పూజలు చేయించుకునే ఇతివృత్తంతో అనేక సినిమాలు వచ్చాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ధౌరహ్రా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మల్కన్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కథ కూడా అలాంటిదే .  దోపిడీ దొంగలు, హంతకులకు  ఆలవాలమైన మధ్య ప్రదేశ్‌లోని చంబల్‌లోయ పేరు వింటేనే అప్పట్లో ప్రజలు గడగడ వణికిపోయే వారు. అలాంటి చంబల్‌ లోయకే నాయకుడైన మల్కన్‌ 70వ దశకంలో ప్రజలనే కాక ప్రభుత్వాలకు  కూడా నిద్ర పట్టకుండా చేశాడు.అనేక హత్యలు, దోపిడీలు చేసిన మల్కన్‌ను పట్టిచ్చిన వారికి ప్రభుత్వం 70 వేల రూపాయల నజరానా కూడా ప్రకటించింది. అయితే, మల్కన్‌ను పట్టించడానికి కాదు కదా ఆయన ఆచూకీ చెప్పడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు.


ఆయనంతట ఆయనే అనుచరులతో సహా లొంగిపోయి జన జీవన స్రవంతిలోకి వచ్చారు.ఆనాటి దోపిడీ దొంగ ఇప్పుడు సమాజంలో ఉండే దోపిడీగాళ్ల భరతం పట్టడానికి ఎన్నికల బరిలో దిగానని చెబుతున్నారు. బుర్ర మీసాలు, గిరజాల జట్టుతో,అమెరికా తయారీ తుపాకీని భుజాన వేసుకుని 76 ఏళ్ల వయసులో కూడా బలిష్టంగా ఉన్న  ఆరడుగుల  ఈ మాజీ దొంగ దోపిడీల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత తీసుకుంటానని చెబుతున్నారు. తననెవరైనా బందిపోటు అంటే మండిపడే మల్కన్‌ తనను తాను తిరుగుబాటు దారుడిగా చెప్పుకుంటారు.‘నేను బందిపోటును కాను.ఆత్మగౌరవ పరిరక్షణ, ఆత్మ రక్షణ కోసం తుపాకీ పట్టే తిరుగుబాటుదారుడిని. నిజమైన దోపిడీ దొంగలెవరో నాకు తెలుసు. వాళ్లతో ఎలా వ్యవహరించాలో కూడా బాగా తెలుసు.’అంటున్నారు మల్కన్‌.

బందిపోటు అయిన మీకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే ‘ఇక్కడ ఎవరూ ఎవరికీ అన్యాయం చేయడానికి వీల్లేదు. అలా నేను చూస్తాను. నన్ను ఎన్నుకుంటేనే వాళ్లకి ఆ మంచి జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. పేదలు, మహిళలపై అత్యాచారాలు చేసే వారికి, వాళ్లకు అన్యాయం చేసే వారికి వ్యతిరేకంగా పోరాడుతానని మల్కన్‌ చెబుతున్నారు.15 ఏళ్ల పాటు చంబల్‌ లోయను ఏలిన తాను లోయలో కుల మత ప్రసక్తి లేకుండా అందరి బాగోగులు చూశానని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను తప్పకుండా గెలుస్తానని అంటున్నారు. ఇక్కడి వాతావరణం నాకు అనుకూలంగా ఉంది. ఇక్కడ మా పార్టీ కూడా బలంగా ఉంది. నియోజకవర్గంలో వెళ్లినచోటల్లా నాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాబట్టి కచ్చితంగా గెలుస్తాను’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. 17 ఏళ్లకే మల్కన్‌ను(1964) పోలీసులు ఆయుధ చట్టం కింద అరెస్టు చేశారు.మల్కన్‌ ముఠా అంటే చంబల్‌ లోయలో అందరికీ హడల్‌.

ఆ ముఠా పై 94 కేసులుండేవి. వాటిలో 18 దోపిడీలు, 28 కిడ్నాప్‌లు, 17 హత్యలు ఉన్నాయి. పలు దఫాల చర్చల తర్వాత 1982లో అప్పటి మధ్య ప్రదేశ్‌ సీఎం అర్జున్‌ సింగ్‌ సమక్షంలో మల్కన్‌ లొంగిపోయారు. శివపురిలో స్థిరపడ్డారు. ఇప్పటికీ చాలా మంది  మల్కన్‌ను రాబిన్‌హుడ్‌గా అభిమానిస్తుంటారు. 2009లో మల్కన్‌ ధౌరహ్రా నియోజకవర్గంలో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి జితిన్‌ ప్రసాద్‌ తరఫున ప్రచారం చేసి ఆయన గెలుపునకు దోహదపడ్డారు. ఈ సారి టికెట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారని, అందుకే జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌ బబ్బర్‌లను కలుసుకున్నానని చెప్పారు. అయితే, వారు టికెట్‌ ఇవ్వకపోవడంతో ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. ఈ నియోజకవర్గంలో మే 6వ తేదీన పోలింగు జరుగుతుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి జితిన్‌ ప్రసాద్, బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ, బీఎస్పీ అభ్యర్థి అర్షద్‌ ఇలియాస్‌ సిద్ధిఖిలతో మల్కన్‌ తలపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement