ఆనంద్ వైపే మొగ్గు
పెంటేల హరికృష్ణ
ఈసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో హోరాహోరీ సమరం ఖాయం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రధాన గేమ్‌ల తర్వాత స్కోరు 6-6తో సమానమై టై బ్రేక్‌కు దారి తీసే అవకాశం ఉంది. ర్యాపిడ్‌లో ఇద్దరికీ పట్టుంది. ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంపిక చేయాలంటే నేను ఆనంద్వైపే మొగ్గు చూపుతాను. ర్యాపిడ్‌తో పాటు బ్లిట్జ్ టైబ్రేక్‌లోనూ ఆనంద్ మెరుగ్గా ఆడతాడు. కాబట్టి ఆనంద్‌కే ఎక్కువ అవకాశం ఉంది. కీలకమైన వివిధ అంశాల్లో ఈ ఇద్దరి బలాబలాను విశ్లేషిద్దాం...
ఓపెనింగ్స్
గత గేమ్‌ల్లో క్రామ్నిక్, తపలోవ్, గెల్ఫాండ్లతో తలపడినప్పుడు ఆనంద్ చాలా భిన్నమైన శైలిని కనబర్చాడు. అయితే అతని వ్యూహంలోని సాధారణ పద్ధతి ఏదో ఒక ఆయుధాన్ని ఎంచుకోవడం, దాన్ని లోతుగా విశ్లేషించడం. ‘హిట్ అండ్ రన్’ పాలసీని బాగా పాటిస్తాడు. ఈ గేమ్‌లో ఎక్కువ షిఫ్టింగ్ లేకుండా తన సొంత శైలికి కట్టుబడి ఆడతాడని అనుకుంటున్నా. ఓపెనింగ్ ప్రకారం చూసుకుంటే కార్ల్సెన్ కంటే చాలా మెరుగ్గా సిద్ధమయ్యాడు. ఆశ్చర్యకరమైన ఎత్తులతో ప్రత్యర్థిని షాక్‌లోకి నెట్టడం కార్ల్సెన్ ప్రత్యేకత. మొత్తం మీద ఇందులో ఆనంద్‌దే పైచేయి.
బలహీనతలు
కార్ల్సెన్ చాలా అరుదుగా తప్పిదాలు చేస్తాడు. అతను మరింత తెలివైన వాడని ఈ టోర్నీలో కచ్చితంగా నిరూపితమవుతుంది. ఆనంద్ కొన్ని ప్రపంచ చాంపియన్‌షిప్ గేమ్‌లు ఆడాడు. తపలోవ్, గెల్ఫాండ్‌తో జరిగిన గేమ్‌ల్లో వెనుకబడినా పుంజుకున్నాడు. ఇలాంటి పరిణామాలను చూస్తే ఇద్దరిలో ఆనందే బలమైన ఆటగాడిగా నిలవనున్నాడు.
శక్తి సామర్థ్యాలు
ఆనంద్ కంటే కార్ల్సెన్ యువకుడు కాబట్టి అతనిలోనే శక్తి సామర్థ్యాలు అధికం. 12 గేమ్‌ల్లో షార్ట్ మ్యాచ్‌లు చాలా ప్రధానం కానున్నాయి. అన్ని గేమ్‌ల్లో గట్టి పోటీ తప్పకపోవచ్చు.
శైలి
ఆనంద్ శైలి సహజంగా, సులువుగా ఉంటుంది. ప్రారంభక సన్నాహకాలు చాలా లోతుగా ఉంటాయి. వ్యూహాత్మకంగా అతను చాలా క్లిష్టంగా ఉంటాడు. చాలా ఏళ్ల నుంచి మంచి డిఫెండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నైట్స్‌తో ఆడటంలో అతను దిగ్గజ ఆటగాడు. ఎండ్గేమ్స్లో మంచి డిఫెండర్.
కార్ల్సెన్ శైలి కూడా సహజంగా, సులువుగానే ఉంటుంది. అయితే ఓపెనింగ్ చాలా విశాలంగా ఉండటంతో అందులో డెప్త్ కొరవడింది. అతని శైలిని, గెలవాలన్న కృషిని కార్పోవ్‌తో పోల్చవచ్చు. ఎండ్గేమ్లో అతని టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది. బిషప్తో చాలా మెరుగైన ఆటతీరును కనబరుస్తాడు. రెండు విరుద్ధమైన ఆటతీరులు ఓ గొప్ప గేమ్‌కు దారితీస్తాయని నా ఉద్దేశం. దీని కోసం వేచి చూడాల్సిందే.
(ఈ వ్యాసాన్ని ఛిజ్ఛిటట.ఛిౌఝ ఇంగ్లిష్‌లో చదవొచ్చు)