భారీ అగ్ని ప్రమాదం
చందన బ్రదర్స్‌లో మంటలు
వస్త్రాలు, నగలు దగ్ధం
రూ.10 కోట్ల వరకు నష్టం
గాంధీరోడ్డులో కలకలం
నగరంలోని గాంధీ రోడ్డు సమీపంలోని తీర్థకట్ట వీధిలోని చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షోరూం గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం, మిగిలిన రెండు అంతస్తుల్లో దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోజువారీ దినచర్యలో భాగంగా బుధవారం రాత్రి 10.10 గంటలకు షోరూంను మూత వేసి నిర్వాహకులు, సిబ్బంది వెళ్లిపోయారు. కొద్ది నిమిషాల్లోనే విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. షాపు ముందే ఉన్న సెక్యూరిటీ గార్డు మంటలు అదుపు చేయలేకపోయాడు. ఈ రోడ్డుపై సమీపంలో ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అప్పటికే షోరూంలోని మూడు అంతస్తుల్లోనూ మంటలు వ్యాపించాయి. మంటలు, పొగలతో చుట్టుపక్కల జనం బెంబేలెత్తిపోయారు. విషయం తెలియగానే చుట్టు పక్కల జనం షాపు వద్ద గుమికూడారు. పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను అక్కడి నుంచి పంపించి వేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తిరుమల, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు ప్రాంతాల నుంచి ఆరు అగ్నిమాపక వాహనాలను రప్పించారు. దుకాణం షట్టర్ తెరుచుకోకపోవడంతో మంటలను అదుపు చేయడానికి చాలా కష్టమైంది. దీంతో జేసీబీతో షట్టర్‌ను ధ్వంసం చేశారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న దుకాణం మేనేజర్లు విశ్వేశ్వరరావు, శ్యామ్ మాట్లాడుతూ పండుగలు రానుండడంతో 200 బేళ్లు వస్త్రాలు తెచ్చి ఉంచినట్లు తెలిపారు. బంగారం సుమారు 20 నుంచి 30 కేజీల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 10 కోట్ల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని పేర్కొన్నారు.