'ఆప్'లో మల్కాజిగిరి చిచ్చు!
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి రాజకీయపార్టీల్లో చిచ్చు రేపుతోంది. మల్కాజిగిరి చిచ్చు టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలకే పరిమితం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి కూడా చుట్టుకుంది. అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత కలహాలు ఆపార్టీని బజారును పడేశాయి. తొలుత చందనా చక్రవర్తిని అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దాంతో చందనా చక్రవర్తి ప్రచార కార్యకలాపాలకు ఏర్పాట్లు చేసుకుంది.
అయితే అనూహ్యంగా మల్కాజిగిరి లోకసభ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు మనవడు ఎన్ వీ సుధా కిరణ్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పోటి నుంచి తప్పుకునేందుకు చందనా చక్రవర్తి నిర్ణయం తీసుకుంది. చందనా నిర్ణయంతో పార్టీలో గందరగోళానికి దారి తీసింది. చందనా వర్గం ఆందోళన చేపట్టి.. పార్టీ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. కార్యకర్తల నిరసన తో మేల్కొన్న పార్టీ అధినాయకత్వం నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగింది.
మల్కాజిగిరి సీటును సొంతం చేసుకున్న సుధా కిరణ్ ఆసీటుపై నెలకొన్న వివాదంపై స్పందించారు. 'పార్టీ ఆరంభం నుంచే ఆమ్ ఆద్మీ పార్టీతో కొనసాగుతున్నాను. సభ్యత్వం కూడా తీసుకున్నాను. పార్టీ అభ్యున్నతి కోసం నిర్విరామంగా పనిచేస్తున్నాను. నేను పార్టీ అభ్యర్ధిగా పోటి చేయడానికి కూడా ఆసక్తి చూపలేదు. పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దాంతో పోటీకి సిద్ధమయ్యాను' అని సుధా కిరణ్ తెలిపారు. పీవీ కుటుంబమంతా కాంగ్రెస్ కు విధేయులుగా ఉంటే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ లో ఎందుకు చేరారనే ప్రశ్నకు 'పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం' అని పీవీ కుమార్తే శారదా దేవి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, గత కొద్దికాలంగా పార్టీకి సేవలందిస్తున్న వారిని కాదని, పార్టీకి సంబంధం లేని వారికి టికెట్ ఎలా కేటాయిస్తారని, మల్కాజిగిరి టికెట్ ఆమెకే కేటాయించాలని పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట చందనా చక్రవర్తి మద్దతుదారులు ధర్నా చేపట్టారు. సంబంధం లేని వారికి టికెట్ కేటాయిస్తే పార్టీ ఎలా మనగడ సాధిస్తుందని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పార్టీ అంతర్గత కలహాలకు సామాజిక సమస్యలపై పోరాటం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువేమి కాదు అని ప్రజలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.