లయను కాపాడండి
కాచిగూడ: ఆ చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు అప్పొసొప్పో చేసి రూ.6 లక్షలకు పైగా ఖర్చు చేశారు. మరో రూ.16 లక్షలు ఖర్చు చేస్తే పాప ప్రాణం నిలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లి గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన పి.కృష్ణస్వామి, కల్పన దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు లయ(6)కు చిన్నతనంలోనే అరుదైన వ్యాధికి గురైంది. ఆమెకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేందుకు తమ దగ్గర డబ్బులు లేవని గురువారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిరుపేదలమైన తాము కూతురుని ఎలా కాపాడుకోవాలో తెలియక దాతల సహాయం కోసం వచ్చినట్లు చెప్పారు.
రోజురోజుకీ పాప ఆరోగ్యం క్షీణిస్తోందని ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు తెలిపారన్నారు. వెంటనే చికిత్స చేయాలని అందుకు రూ.16 లక్షలు ఖర్చు అవుతాయన్నారు. తమ కుమారుడు సాయితేజ(4) బోన్ మ్యారోతీసి పాపకు సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పారని, దాతలు డబ్బులు సమకూరిస్తే పాప బతుకుతుందని వేడుకున్నారు. ఇప్పటికే ఇంట్లోని వస్తువులు, బంగారం, పుస్తెలతాడు అమ్మి రూ.6 లక్షల వరకు ఖర్చు చేశామని, తమకు సహాయం చేసే వారు 9676541393, 9100785185 నంబర్లలో సంప్రదించాలని వారు కోరారు.