Chandi Prasad Bhatt
-
పర్యావరణ గాంధేయుడు
యూపీఏ ప్రభుత్వం గద్దెదిగుతూ తీసుకొన్న ఏకైక మంచి నిర్ణయం అంటూ అనేక మంది ప్రశంసిస్తున్నారు.. యాభై సంవత్సరాల ఆ ఉద్యమ రూపానికి ఈ అవార్డు దక్కడం హర్షణీయమని మరికొందరంటున్నారు. ఆయనకు ‘గాంధీ శాంతి పురస్కారం’ ప్రదానం చేయడం గాంధేయవాదానికే పురస్కారం అనే ప్రశంసలూ వినిపిస్తున్నాయి. ఈ విధంగా నేటి తరానికి పునఃపరిచయమవుతున్నారు చండీప్రసాద్ భట్. దశాబ్దాల క్రితమే పర్యావరణ వేత్తగా పేరు తెచ్చుకొని... ఆ పేరుతో పనిలేకుండా తన మటుకు తాను హిమాలయపర్వత సానువుల్లో ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతూ ఉన్న చండీప్రసాద్ను ‘గాంధీ పీస్ ప్రైజ్’ వరించింది. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న ఆయన... ఇప్పటికే రామన్ మెగసేసే, పద్మభూషణ్ అవార్డులను అందుకొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన ముఖ్యమైన సామాజిక ఉద్యమాల్లో ఒకటి ‘చిప్కో’ ఉద్యమం. చరిత్రలో అంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఉద్యమం అది. చెట్లను కాపాడుకోవడానికి వాటిని కౌగిలించుకొని, తమను నరికిన తర్వాతే వాటిని నరకాలంటూ హిమాలయ పర్వత సానువుల్లోని ప్రజలు చేసిన ఉద్యమం అది. అలాంటి ఉద్యమానికి అండదండగా నిలిచిన వ్యక్తుల్లో చండీప్రసాద్ భట్ ముఖ్యులు. సుందర్‌లాల్ బహుగుణ వంటి వారితో కలిసి గ్రామీణ ప్రాంత ప్రజల్లో స్ఫూర్తి నింపారాయన. రిషికేష్ - బదరీనాథ్ ప్రాంతంలో బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న చండీప్రసాద్‌కు అప్పటి సోషలిస్టు నేత జయప్రకాశ్‌నారాయణ్ అంటే అభిమానం. ఆయన ప్రసంగాలు విని స్ఫూర్తి పొందిన భట్... తన జీవితాన్ని సమాజ శ్రేయస్సుకే అంకితమివ్వాలని భావించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో భాగమైన గోపీశ్వర్ ప్రాంతంలో ప్రజాశ్రేయస్సును లక్ష్యంగా చేసుకొని 1964లో దషోలి గ్రామస్వరాజ్ సంఘ్‌ను స్థాపించారు. పండ్లతోటలు, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, అడవులు-సహజవనరుల పరిరక్షణే లక్ష్యంగా అటవీ ప్రాంత ప్రజల్లో అవగాహన నింపడమే ఆ సంస్థ లక్ష్యం. ప్రశాంతంగా ఉన్న గోపీశ్వర్ ప్రాంతాన్ని 1970లో అలకనందా వరదలు ముంచెత్తడంతో జనజీవితం అతలాకుతలం అయ్యింది. చరిత్రలో ఎన్నడూ కలగనంత నష్టం జరిగింది. ప్రభుత్వం దాన్ని ప్రకృతి విపత్తుగా ప్రకటించింది. అయితే దషోలీ గ్రామ్ స్వరాజ్ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు. అది ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పదం వల్ల జరిగిన తప్పు అంటూ వాదించారు. సహజంగా తన దారిన వెళ్లాల్సిన అలకనందా నదికి అభివృద్ధి పేరుతో జరిగిన విఘాతమే వరదలకు కారణమని వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వం వారి వాదనను పట్టించుకోలేదు. దాంతో దషోలీ గ్రామ్స్వరాజ్ మండల్ రంగంలోకి దిగింది. వరదలు ఎందుకు వచ్చాయో ప్రజలకు తెలియజెప్పింది. చెట్లను కాపాడుకోవాలని ఉద్బోధించింది. ప్రభుత్వానికి ఆ విషయం అర్థం కాలేదు కానీ, ప్రజలకు మాత్రం బాగా అర్థమైంది. అందుకు రుజువే చిప్కో ఉద్యమం. 1980 నాటికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యాపార అవసరాల కోసం చెట్లను నరకడాన్ని పూర్తిగా నిషేధించడంతో చిప్కో ఉద్యమం విజయవంతం అయ్యింది. చండీప్రసాద్ సేవకు గానూ 1984లో ఆసియా నోబెల్ప్రైజ్గా పేరు పొందిన ‘రామన్ మెగసేసే’ అవార్డు దక్కింది. భట్ సేవలను భారత ప్రభుత్వం ఆలస్యంగానైనా గుర్తించి, 2005లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఈ యేడు మార్చిలో ‘గాంధీ శాంతి బహుమతి’ని ప్రకటించింది. జూలై 15వ తేదీన ఆయనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేసింది. ప్రస్తుతం భట్ వయసు 80 యేళ్లు. ఇప్పటికీ ఆయన గోపేశ్వర్ ప్రాంతంలో, రిషికేష్ పక్కన ఉన్న పర్వత సానువుల్లో తిరుగుతూ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. అడవులను, ప్రకృతి సంపదను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారు. జీవితాంతం ఇలా పర్యావరణ పరిరక్షకుడిగానే కొనసాగుతానంటాడు ఈ అసమాన సేవకుడు! - బి. జీవన్‌రెడ్డి -
చండీ ప్రసాద్‌భట్‌కు గాంధీశాంతి బహుమతి ప్రదానం
న్యూఢిల్లీ: ప్రముఖ పర్యావరణవేత్త చండీ ప్రసాద్‌భట్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు ప్రతిష్టాత్మక గాంధీశాంతి బహుమతి ప్రదానం చేశారు. గాంధీ సిద్ధాంతాల ప్రచారానికి అవిరళ కృషిచేసిన భట్‌ను 2013 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మహాత్మా గాంధీ 125వ జయంతి సందర్భంగా 1994లో అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు జాతిపిత గౌరవార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటుచేశారు. గాంధీ పద్ధతులు, అహింసా సిద్ధాంతాలతో సామాజిక మార్పునకు కృషి చేసినవారికి ఈ అవార్డును అందజేస్తారు. 1934లో గఢ్వాల్లో ఒక రైతు కుటుంబంలో చండీ ప్రసాద్ భట్ చిప్కో ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలచి, గడ్వాల్లో అంతరిచిపోతున్న అటవీ సంపదను కాపాడేందుకు నడుంబిగించారు. బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో భట్ ఒకసారి జయప్రకాష్ నారాయణ్ ప్రసంగాన్ని విని, వెంటనే ఉద్యోగానికి స్వస్తిచెప్పి సమాజ సేవకు అంకితమయ్యారు. 1964లో ‘దశౌలి గ్రామ్ స్వరాజ్య సంఘ్’ను భట్ ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా వివిధ సహకార సంఘాలను ‘స్వరాజ్య సంఘ్’ నిర్వహించింది. 1973 ఏప్రిల్‌లో మండల్ అనే గ్రామంలో భట్ నాయకత్వంలో కొంతమంది గ్రామీణులు చెట్లను నరికివేయడాన్ని నిరోధించారు. అలా ‘చిప్కో ఆందోళన్’కు అంకురార్పణ జరిగింది. మైదాన ప్రాంతాల్లోని కర్మాగారాలకు కలపను వేలం వేయడాన్ని నిలిపివేయాలన్న డిమాండ్‌తో పుట్టుకొచ్చిన రైతు ఉద్యమం అది. మండల్ గ్రామంలో రైతుల విజయం ఆధునిక భారతీయ పర్యావరణోద్యమ సంస్థాపక సంఘటనగా చరిత్రలో నిలిచింది. ఆ తరువాత భట్ చెట్ల పెంపకం శిబిరాలను నిర్వహించారు. కొండలపై దేశవాళీ మొక్కలను పెంచడంపై గ్రామీణులకు ప్రేరణ కల్గించారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఉత్తరాఖండ్ గ్రామీణ ప్రజల అభ్యున్నతికి ఎటువంటి ప్రచార పటాటోపాలకు పోకుండా, నిరంతరమూ కృషి చేస్తూ వస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు భట్ అద్వితీయమైన కృషి చేశారు. గతంలో గాంధీ శాంతి బహుమతిని అందుకున్నవారు: 2005 - దక్షిణాఫ్రికా క్రైస్తవ మతాచార్యుడు డెస్మాండ్ టూటూ 2004 – కోరెట్టా స్కాట్ కింగ్ (అమెరికా పౌర హక్కుల నాయకుడు కీర్తిశేషుడు డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సతీమణి) 2003 – వక్లావ్ హావెల్ మాజీ చెకోస్లోవేకియా అధ్యక్షుడు (చెక్ రిపబ్లిక్ తొలి అధ్యక్షుడు కూడా) 2002 – భారతీయ సంస్కృతి అభివృద్ధి పై పనిచేసే భారతీయ విద్యా భవన్ 2001 – ఐరిష్ శాంతి ఉద్యమకారుడు జాన్ హుమ్. 2000 – ‘నల్ల సూరీడు’ నెల్సన్ మండేలా - గ్రామీణ్ బ్యాంకు (సంయుక్త విజేత), బంగ్లాదేశ్ కు చెందిన ముహమ్మద్ యూనుస్ ఈ బ్యాంకును స్థాపించారు. 1999 – మురళిధర్ దేవిదాస్ అమ్టే (బాబా అమ్టే) 1998 – రామకృష్ణ మిషన్,ఇండియా 1997 – డాక్టర్ గెర్హార్డ్ ఫిస్చేర్ (మాజీ జర్మన్ డిప్లోమాట్) 1996 – సామాజిక సేవకుడు డాక్టర్ ఏ.టీ.అరియరత్నే (శ్రీలంక) 1995 – ఆఫ్రికా స్వాతంత్రోద్యమ నాయకుడు డాక్టర్ జూలియస్ కే. న్యరేరే (మాజీ టాంజానియా అధ్యక్షుడు) - శిసూర్య -
చండీ ప్రసాద్ భట్‌కు గాంధీ శాంతి బహుమతి
-
గాంధీ శాంతి బహుమతి ప్రదానం నేడు
న్యూఢిల్లీ: పర్యావరణవేత్త చండీ ప్రసాద్ భట్‌కు ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ప్రదానం చేయనున్నారు. గాంధీ సిద్ధాంతాల ప్రచారానికి అవిరళ కృషిచేసిన భట్‌ను 2013 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గాంధీ 125వ జయంతి సందర్భంగా 1995లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. గాంధీ పద్ధతులు, అహింసా సిద్ధాంతాలతో సామాజిక మార్పునకు కృషి చేసినవారికి ఈ అవార్డును అందిస్తారు.