బీజేపీకిలోకి ముగ్గురు కౌన్సిలర్లు.. ఆసక్తికరంగా చండీగఢ్ రాజకీయాలు
చండీగఢ్: బీజేపీకి భారీ షాక్ తగిలింది. చంఢీగఢ్ మేయర్ పదవికి ఆ పార్టీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై నేడు(సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోంకర్ రజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి బీజేపీ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో మోసాలకు పాల్పడిందని ఆప్, కాంగ్రెస్‌లు ఆరోపిస్తున్నాయి. జనవరి 30న జరిగిన ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కుల్దీప్ కమార్‌ను ఓడించి మేయర్‌గా గెలుపొందారు. బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్ ఆప్‌కు సంబంధించి ఉమ్మడి అభ్యర్ధి కుల్దీప్ సింగ్‌కు 12 ఓట్లు సాధించారు. అయితే ఆప్ అభ్యర్థికి వచ్చిన 8 ఓట్లు చెల్లవని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఆప్ కౌన్సిలర్ ఒకరు సుప్రీంను ఆశ్రయించారు.
చదవండి: Kejriwal: ఈడీ విచారణకు ఆరో‘సారీ’!
రిటర్నింగ్ అధికారిపై సుప్రీం కోర్టు మండిపాటు
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 5న విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎన్నికల అధికారిపై తీవ్ర స్థాయిలో మండిపడింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసినట్లు వీడియో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది.
'ఎన్నికల నిర్వహణ తీరు ఇదేనా? ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఇది ప్రజాస్వామ్యం హత్యే. ఆయనపై విచారణ జరపాలి' అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల బ్యాలెట్ పేపర్లు, వీడియోగ్రఫీని భద్రపరచాలని పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా హజరు కావాలని చెప్పి, తదుపరి విచారణను ఫిబ్రవరి 19కు వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా ఆప్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేశారు. పూనవ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం కాషాయ కండువా కప్పుకున్నారు. మొతం 35 మంది సభ్యులున్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 14 మంది కౌన్సిలర్లు ఉండగా తాజా చేరికలతో ఆ సంఖ్య 17కు చేరింది. వీరికి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ కౌన్సిలర్ మద్దతు కూడా ఉంది. అంతేగాక బీజేపీ చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్‌కు కూడా ఎక్స్ ఆఫీషియోగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. దీంతో బీజేపీకి మద్దతు సంఖ్య మొత్తం 19కి చేరింది. ఇక ఆప్‌కు 10 మంది కౌన్సిలర్లు ఉండా కాంగ్రెస్‌కు ఏడుగురు ఉన్నారు.