విజయవంతంగా పృథ్వీ-2 పరీక్ష
బాలాసోర్: అణ్వాయుధాలను మోసుకుపోగల పృథ్వీ-2 క్షిపణిని శుక్రవారం రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలంపై 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఒడిశాలోని చాందీపూర్ కేంద్రం నుంచి దీన్ని పరీక్షించి చూశారు. పృథ్వీ-2 క్షిపణి 1,000 కేజీల వరకు వార్హెడ్లను మోసుకుపోగలదని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్రేంజ్(ఐటీఆర్) డెరైక్టర్ ప్రసాద్ తెలిపారు. దీన్ని పూర్తిస్థాయిలో పరీక్షించామని, నిర్ణీత లక్ష్యాలను చేరినట్లు చెప్పారు. ఉదయం 9.45గంటలకు మొబైల్ లాంచర్ నుంచి క్షిపణిని ప్రయోగించగా.. దాని ప్రయాణ మార్గాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ రాడార్లు, ఒడిశా తీరం వెంబడి ఏర్పాటు చేసిన ఎలక్ట్రో ట్రాకింగ్ సిస్టం, టెలిమెట్రీ స్టేషన్లు అనుక్షణం పరిశీలించాయని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. పృథ్వీ-2ను 2003లో సైన్యంలోకి ప్రవేశపెట్టారు. క్షిపణి సన్నద్ధతను తెలుసుకోవడంతోపాటు, వ్యూహాత్మక పోరాట దళం(ఎస్ఎఫ్సీ) శిక్షణలో భాగంగా అప్పుడప్పుడు ఇలాంటి పరీక్షలను నిర్వహిస్తూ ఉంటారు. చివరిసారిగా ఈ ఏడాది జనవరి 4న పృథ్వి-2 పరీక్ష జరిగింది.