పీఆర్ డీఈఈపై ఏసీబీ పంజా
చేర్యాల: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.85 వేలు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూరపాటి చంద్రప్రకాశ్‌ను అధికారులు వలపన్ని పట్టుకున్నారు. డీఎస్పీ ప్రతాప్‌కుమార్ కథనం ప్రకారం.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప«థకం ద్వారా 2016లో రూ.74 లక్షలతో మంజూరైన చేర్యాల, రోళ్లబండ బీటీ రోడ్డు నిర్మాణ పనులను జనగామకు చెందిన ఈడీఆర్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది.
పనుల నిర్వహణకు సంబంధించి చేర్యాలకు చెందిన ఎంఏ రహమాన్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. 2017 ఫిబ్రవరిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉంది. నిర్ణీత కాలంలో కాంట్రా క్టరు 90 శాతం పనులు పూర్తి చేశాడు. పనుల నాణ్యతపై ఢిల్లీకి చెందిన నేషనల్ క్వాలిటీ కంట్రోల్ బృందం క్షుణ్ణంగా విచారణ జరిపింది. ఈ పనుల్లో కొన్ని లోటుపాట్లను సవరించుకోవాలని సూచించింది. ఆ మేరకు కూడా కాంట్రాక్టరు చర్యలు తీసుకున్నాడు.
రోడ్డు పనులు పూర్తి కావడంతో బిల్లు మంజూరు కోసం కాంట్రాక్టరు రహమాన్.. డీఈఈ చంద్రప్రకాశ్‌ను కలిశాడు. బిల్లు మంజూరు చేయాలంటే రూ.1.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో రూ.85 వేలు ఇస్తానని రహమాన్ ఒప్పం దం కుదుర్చుకున్నాడు. ఆపై రహమాన్ ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం చేర్యాలలోని డీఈఈ చంద్రప్రకాశ్ ఇంటి సమీపంలో మాటువేసిన అధికారులు.. రహమాన్ రూ.85 వేలు ఇస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. దాడుల్లో ఏసీబీ ఎస్ఐలు బి.గంగాధర్, సీహెచ్ మురళీమోహన్, రఘునందన్ పాల్గొన్నారు.
1064కు ఫోన్ చేయండి
అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తప్పవని డీఎస్పీ ప్రతాప్‌కుమార్ హెచ్చరించారు. ప్రజలు ఫిర్యాదుంటే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని సూచించారు.