Chanduru
-
వెరైటీ 'అవ్వ'.. 30 ఏళ్లుగా చాయ్‌తోనే
చండూరు: ఉదయం టిఫిన్.. మధ్యాహ్నం.. రాత్రి భోజనం.. మూడు పూటలా తింటున్నా.. మధ్యలో స్నాక్స్ అని.. ఏవేవో లాగించే రోజులివి. కానీ ఓ వృద్ధురాలు 30 ఏళ్లుగా భోజనం చేయకుండా కేవలం చాయ్ తాగుతూ కాలం వెళ్లదీస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి గ్రామానికి చెందిన కొండూరి సుగుణమ్మ (60)కు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మృతి చెందారు. సుగుణమ్మకు 30 ఏళ్ల వయసున్నప్పుడు కడుపులో నొప్పి రావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స జరిగిన కొన్నిరోజుల తర్వాత అన్నం తింటే జీర్ణం కాక వాంతులయ్యాయి. దాంతో ఇక అన్నంపై విరక్తి పెంచుకున్న ఆమె.. కేవలం చాయ్ తాగడం మొదలు పెట్టింది. క్రమేణా అదే అలవాటుగా మార్చుకుంది. ఇప్పటికీ సుగుణమ్మ రోజూ ఒకేసారి చాయ్ చేసుకోవడం.. ప్లాస్క్‌లో నింపుతుంది. ఆకలేసినప్పుడల్లా చాయ్ తాగుతూ క్షుద్బాధ తీర్చుకుంటుంది. అప్పుడప్పుడు చాయ్‌లో మరమరాలు వేసుకుంటుంది. సుగుణమ్మ కూతురికి పెళ్లికాగా, కుమారుడు వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. -
చండూరు: ఎట్టకేలకు మూడోకన్ను
సాక్షి, చండూరు : చండూరు మున్సిపాలిటీ కేంద్రం ఎట్టకేలకు మూడో కన్ను తెరిచింది. దొంగతనాలకు, అరాచకాలకు ఇక చెక్ పడనుంది. ప్రతి చిన్న సంఘటనను సైతం ఇట్టే గుర్తుపట్టే అవకాశం ఉంది. గతంలో సీసీ కెమెరాలు లేక పోవడంతో పట్టణంలో అనేక చోరీలు చోటు చేసుకున్నాయి. పోలీసుల చొరవతో సీసీ కెమెరాలను పట్టణంలో ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేశారు. దీంతో ఇక ముందు చోరీలు ఉండవని, ఒక వేళ జరిగినా ఇట్టే గుర్తించే అవకాశం ఉందని పోలీసులు చెపుతున్నారు. పట్టణంలో... బోడంగిపర్తి గ్రామానికి చెందిన మంచికంటి ట్రస్ట్ అందించిన 12 కెమెరాలను బిగించారు. పట్టణంలో ముఖ్య కూడలి సెంటర్లో నాలుగు, ఎస్బీఐ ఏరియాలో రెండు, మరో ఆరు కెమెరాలను జనం రద్దీగా ఉండే స్థలాలో బిగించారు. కెమెరాలతో పట్టణ ప్రజలు నిర్భయంగా ఉండే అవకాశం ఉంది. గతంలో ... చండూరు పట్టణంలో గతంలో అనేక చోరీలు చోటుచేసుకున్నాయి. ప్రతి శుక్రవారం సంత రోజు ఒక్కటి, రెండు గొలుసు చోరీలు జరుగుతునే ఉండేవి. అనేక మంది మహిళలు సంతకు రావడానికి జంకే వారు. కొంత మంది రాత్రి సమయాలలో బయట తిరుగుతూ అలజడులు సృష్టించే వారు. దీంతో ప్రజలు రాత్రి అయ్యిందో బయటకు రావడానికి జంకే వారు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటుతో ఆ భయం లేకుండా పోయింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పట్టణంలో మంచికంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఇక చోరీలకు చెక్ పడనుంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. సీసీ కెమెరాలతో ఇబ్బందులు తప్పనున్నాయి. – సైదులు, ఎస్ఐ -
రైతుల అభివృద్ధే కేసీఆర్ ధ్యేయం
చండూరు : రైతుల అబివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నాంపల్లి, చండూరు, మర్రిగూడెం మండలాలకు చెందిన 50 మందికి సబ్సీడీ ట్రాక్టర్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంటామనే మాట నేటికీ తప్పలేదన్నారు. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సబ్సీడీపై ట్రాక్టర్లను అందిస్తున్నామన్నారు. రైతులు సబ్సీడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులకు దళారి వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి రైతు పండించిన ధాన్యానికి ధర వారే నిర్ణయించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అధికారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయన్నారు. రానున్న కాలంలో మునుగోడును మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ తోకల వెంకన్న, ఎంపీడీఓ శైలజ, తహసీల్దార్ మహేందర్ రెడ్డి, ఏడీఏ నాగమణి, ఏఓలు మల్లేశం, రెతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బొమ్మరబోయిన వెంకన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకన్న, కోడి వెంకన్న పాల్గొన్నారు. -
ఆ స్కూల్ లో ముగ్గురే విద్యార్థులు!
చండూరు (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా చండూరు మండలంలో అనేక పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే...ఇదే మండలం చండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లకినేనిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురే విద్యార్ధులకు ఒక టీచర్ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యా సంవత్సరం ఆరంభంలో 20 మంది విద్యార్ధులు ఉండగా రాను రాను విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్ధులు మిగలగా నాలుగు నెలలుగా పాఠశాల వారితోనూ నడుస్తుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఒక్కో రోజు ఆ ముగ్గురు విద్యార్ధులు కూడా ఉండరు. టీచర్ వచ్చి పోవాల్సిందే. కాగా పాఠశాల నడపాలంటే కనీసం 25 మంది విద్యార్ధులు ఉండాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నా మండల శాఖ అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారు. విద్యార్ధులు లేని పాఠశాల నుండి ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలకు డిప్యూటేషన్ వేయాల్సి ఉంది. కానీ అధికారులలో చలనం లేదు. ఇప్పటికే మండలంలో.... మండలంలో ఇప్పటికే ఆరు బడులు విద్యార్ధులు లేక మూత పడుతూ వస్తున్నాయి. తాస్కానిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, చొప్పరివారిగూడెం, కుమ్మందానిగూడెం,ధర్మతండ, తేరట్పల్లి(ఎస్సీ కాలనీ) లోని బడులకు అధికారులు తాళం వేశారు. చివరగా లకినేనిగూడెం ప్రాథమిక పాఠశాల సైతం మూత బడుల ఖాతాలో చేరనుంది.