ఆ స్కూల్ లో ముగ్గురే విద్యార్థులు!
చండూరు (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా చండూరు మండలంలో అనేక పాఠశాలల్లో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే...ఇదే మండలం చండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని లకినేనిగూడెం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ముగ్గురే విద్యార్ధులకు ఒక టీచర్ విధులు నిర్వహిస్తున్నాడు. విద్యా సంవత్సరం ఆరంభంలో 20 మంది విద్యార్ధులు ఉండగా రాను రాను విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్ధులు మిగలగా నాలుగు నెలలుగా పాఠశాల వారితోనూ నడుస్తుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదు.
ఒక్కో రోజు ఆ ముగ్గురు విద్యార్ధులు కూడా ఉండరు. టీచర్ వచ్చి పోవాల్సిందే. కాగా పాఠశాల నడపాలంటే కనీసం 25 మంది విద్యార్ధులు ఉండాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నా మండల శాఖ అధికారులు పట్టించుకోవడంలో విఫలమయ్యారు. విద్యార్ధులు లేని పాఠశాల నుండి ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలకు డిప్యూటేషన్ వేయాల్సి ఉంది. కానీ అధికారులలో చలనం లేదు.
ఇప్పటికే మండలంలో....
మండలంలో ఇప్పటికే ఆరు బడులు విద్యార్ధులు లేక మూత పడుతూ వస్తున్నాయి. తాస్కానిగూడెం, తిమ్మారెడ్డిగూడెం, చొప్పరివారిగూడెం, కుమ్మందానిగూడెం,ధర్మతండ, తేరట్‌పల్లి(ఎస్సీ కాలనీ) లోని బడులకు అధికారులు తాళం వేశారు. చివరగా లకినేనిగూడెం ప్రాథమిక పాఠశాల సైతం మూత బడుల ఖాతాలో చేరనుంది.