పెద్ద ఉద్యోగి..చిన్న బుద్ధులు
భాగ్యనగర్‌కాలనీ: ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన ఓ వ్యక్తి ఓ సంస్థలో చెక్కులు దొంగలించి కటకటాలపాలయ్యాడు. అతనికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సోమవారం కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు... ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామానికి చెందిన బెజవాడ బ్రహ్మయ్య (55) గతంలో ఐడీపీఎల్ బ్యాంక్ జనరల్ మేనేజర్‌గా, ఎన్‌ఐఎఫ్‌ఎంలో, నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజింగ్ ఆఫ్ ఇండియాలో మేనేజర్‌గా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ప్రొఫెసర్‌గా, ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. ప్రస్తుతం మూసాపేటలోని సైబర్హోమ్స్లో చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. అయితే సైబర్హోమ్స్లోని ఓ కస్టమర్ ఫ్లాట్ బుక్ చేసుకుని అందుకు సంబంధించి రూ.11లక్షలకు చెక్కులను బ్రహ్మయ్యకు ఇచ్చాడు.
అతను వాటిని సంస్థ అకౌంట్లో జమ చేయకుండా దొంగలించి యూసఫ్‌గూడలోని ఆంధ్రబ్యాంక్‌లో తన స్నేహితుడైన రవీందర్‌బాబు పేరుతో సైబర్ హోమ్స్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో జమ చేశాడు. వచ్చిన డబ్బును ఇద్దరూ సమానంగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే చెక్కులు ఇచ్చిన రహీమోద్దీన్ ఫ్లాట్ కోసం సైబర్‌హోమ్స్ నిర్వాహకులను అడగగా తమకు డబ్బులు చెల్లించలేదనడంతో అతను అవాక్కయ్యాడు. దీనిపై అనుమానం వచ్చిన సంస్థ యాజమాన్యం బ్రహ్మయ్యపై ఫిర్యాదు చేయడం తో అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారించగా చేసిన నేరం అంగీకరించాడు. దీంతో అతని స్నేహితుడు రవీందర్బాబును కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకుని ఖాతాలను సీజ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.