మాట, బాట మార్చుతున్న మోదీ
త్రికాలం
నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మహర్జాతకుడు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాజకీయరంగంలో అంచలంచలుగా ఎదిగి శిఖరాగ్రంలో నిలిచిన మోదీకి స్వయంకృషితో పాటు అదృష్టం కలసి వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచారక్ స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా భీష్మాచార్యుడు అద్వానీ ఆశీస్సులతో మోదీ రాజకీయ సోపానం అధిరోహించడంలో ఆశ్చర్యం లేదు. అద్వానీ చాలా మంది యువనాయకులకు ఆపాటి అవకాశాలు ప్రసాదించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ పదవి స్వీకరించిన కొద్ది మాసాలకే సంభవించిన సంక్షోభం నుంచి కోలుకున్న తీరు మాత్రం అద్వితీయం.
ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికీ ఇన్ని ఒడిదుడుకులు ఎదురై ఉండవు. ఇంతటి ఘనవిజయం లభించి ఉండదు. గోధ్రా అనంతరం మతకలహాలలో ‘రాజధర్మం’ నెరవేర్చలేదంటూ మోదీని నాటి ప్రధాని వాజపేయి ఆక్షేపించడమే కాకుండా పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలన్నీ ఆయనను వెలివేశాయి. వీసా నిరాకరించాయి. ఆయన మంత్రివర్గ సహచరులు కేసులలో నిందితులుగా బోనెక్కవలసి వచ్చింది. ఒక మహిళా మంత్రికి జైలు శిక్ష అమలు జరుగుతోంది. మరో మంత్రి అమిత్ షా జైలుకు వెళ్లడం ఖామయంటూ న్యాయ నిపుణులు బల్ల గుద్ది చెప్పారు. అనేక మంది ఉన్నతాధికారులు జైలుపాలైనారు. అటు వంటి స్థితి నుంచి భాజపా ప్రధాని అభ్యర్థిగా నియుక్తుడు కావడం, దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన జరపడం, అధ్భుతమైన రీతిలో ఎన్నికల ప్రచారం చేయడం, మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీ (భాజపా)కి లోక్‌సభలో మెజారిటీ సాధించడం మోదీ పేరుతో నమోదైన ఘన చరిత్ర. అధఃపాతాళం నుంచి హిమాలయ పర్వతం స్థాయికి మోదీ అమాంతంగా పెరిగిన తీరు అపూర్వమైనది.
విదేశీయానాల పరంపర
అరుదైన విజయం సాధించి అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రధానిగా మోదీ జయాపజయాలను సమీక్షించినప్పుడు మిశ్రమానుభూతి కలుగుతుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నా మార్కులు ఇవ్వడం అన్యా యమైతే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నూటికి నూరు మార్కులు ఇవ్వడం మితిమీరిన ఔదార్యం. మోదీ దేశంలో సాధించిన ఘనకార్యాలకంటే విదేశీ పర్యటనలలో సాధించిన ఫలితాలే గణనీయమైనవి. పన్నెండు మాసాలలో పద్దెనిమిది దేశాలు పర్యటించి 52 రోజులు దేశం వెలుపలే గడిపిన మోదీ తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు.
మోదీ విదేశీయానాల ఖర్చు రూ. 317 కోట్లు. విదేశీ పర్యటనలలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మోదీని ప్రపంచ దేశాధినేతలు స్వాగతించారు. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ను పూర్వపక్షం చేసే విధంగా మోదీ పర్యటనలు సాగాయి. మన్మోహన్‌సింగ్‌కు ఒక ఆర్థికవేత్తగా ఇతర దేశాల అధ్యక్షులూ, ప్రధానులూ గౌరవిస్తే మోదీని ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన ప్రజానా యకుడిగా ఆదరించారు. విదేశీ పర్యటనల ఫలితంగా ప్రధాని దేశానికి ఎటు వంటి ప్రయోజనం సమకూర్చారో కాలక్రమంలో కానీ తేలదు. తక్షణం ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదు.
కలసివచ్చిన అదృష్టం
జాతీయ స్థాయిలో మోదీకి కలసి వచ్చిన అంశాలు అనేకం. అమెరికా దౌత్య విధానం కారణంగా, సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిని ఇబ్బడిముబ్బడిగా పెంచిన ఫలితంగా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్‌కు గొప్ప మేలు జరిగింది. ఆర్థిక పురోగతి నిరాఘాటంగా సాగుతోంది. ద్రవ్యోల్బణం తగ్గింది. బ్యాంకు రుణాల రేట్టు తగ్గాయి. రూపాయి దాదాపు నిలకడగా ఉంది. ద్రవ్యలోటు తగ్గింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయి. ప్రభుత్వ స్థాయిలో అవినీతి అంతగా కనిపించడం లేదు. సర్కారు గణాంకాల ప్రకారం దేశ ప్రగతి రేటు 7.5 శాతం వరకూ ఉండవచ్చు. అంటే ఇది చైనా ప్రస్తుత ప్రగతి రేటు కంటే అధికం.
ప్రపంచంలో ఈ రోజు అత్యంత వేగంగా పెరుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. ఆశించినంత మేరకు కాకపోయినా మొత్తం మీద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నాయి. మోదీ పరివారంలో కొందరు ఉన్మత్త ప్రకటనలు చేసినప్పటికీ, వారిని ఆయన పూర్తిగా అదుపులో పెట్టలేకపోయి నప్పటికీ, అభ్యంతరకరమైన వ్యాఖ్యలను సకాలంలో ఖండించడం ద్వారా తాను రాజనీతిజ్ఞుడుగా స్థాయిని పెంచుకోగలనని అప్పు డప్పుడు నమ్మకం కలిగించగలిగారు. పేద ప్రజలకు వంటగ్యాస్‌పైన సబ్సిడీ, చౌక రేషన్ ఇవ్వడానికి బదులు నేరుగా నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. పనితీరును మెరుగు పరచడం ద్వారా వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వం సానుకూలమనే సంకేతాలు పంపగలిగారు. కేంద్ర ప్రభుత్వో ద్యోగులు సకాలంలో కార్యాలయాలకు హాజరు కావాలనీ, రోజుకు కనీసం ఎనిమిది గంటల పనిచేసి తీరాలనీ నిబంధనలు విధించి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పెద్ద మూల్యమే చెల్లించారు.
ప్రభుత్వం క్రమశిక్షణతో పని చేస్తు న్నట్టు ఒక అభిప్రాయం జనసామాన్యంలో కలిగింది. కానీ సంవత్సర కాలంలో మోదీ మార్కు సంస్కరణ కానీ, పథకం కానీ చెప్పుకోవడానికి లేదు. ప్రతి రోజూ ఐదారుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ వ్యవ సాయరంగాన్ని ఆదుకోవాలన్న ఆరాటం లేదు. అసాధారణమైన చొరవ ప్రదర్శించకుండానే కొన్ని మంచి ఫలితాలు కనిపించడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ విపణిలో చమురు ధరల భారీ పతనం. అందుకు దామాషాగా దేశంలో పెట్రోలు ఉత్పత్తుల ధరలు తగ్గించకుండా సబ్సిడీలకు గణనీయంగా కోత విధించారు.
యూపీఏ ప్రభుత్వాలూ, అంతకు ముందు పీవీ, వాజపేయి ప్రభుత్వాలూ వేసిన పునాదులు పటిష్ఠమైనవి కనుకనే నేటి ఆర్థిక విజయాలు సుసాధ్యం అవుతున్నాయి. ఆర్థిక సంస్కరణల విషయంలో మోదీ ఇప్పటికీ నత్తనడకే నడుస్తున్నారనీ, ముందు రాజకీయంగా స్థిరపడిన తర్వాతనే సంస్కరణల జోలికి వెళ్ళాలనే తప్పుడు అంచనాతో పని చేస్తున్నారనీ ‘ఎకనమిస్ట్’ వంటి మితవాద మీడియాతో పాటు కార్పొరేట్ రంగ ప్రము ఖులూ, ఆర్థిక విశ్లేషకులూ ఆక్షేపిస్తున్నారు. భూసేకరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకపోవడం ఇన్ఫ్రా రంగం (మౌలిక వసతుల నిర్మాణరంగం) అభివృద్ధికి అంతరాయం కలిగిస్తున్నదంటూ హెచ్చరిస్తున్నారు.
పట్టువిడుపులు తెలిసిన నేత
మోదీ బయటికి కనిపించినంత మొండి కాదు. లక్ష్య సాధన కోసం పట్టువి డుపులు అవసరమనే స్పృహ కలిగినవాడు. వాజపేయి నుంచి సంయమనం నేర్చుకోవలసిన అవసరం గమనించాడు. చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగి పోయింది. సమయం మించిపోతున్నదని మోదీకి తెలుసు. రెండవ తరం ఆర్థిక సంస్కరణలను వాయిదా వేసినట్లయితే ఆశించిన స్థాయిలో సంపద సృష్టిం చడం, భారత్‌ను అమెరికా, చైనాల సరసన మూడవ ఆర్థిక శక్తిగా నిలపడం సాధ్యం కాదనీ తెలుసు. కానీ 245 స్థానాలున్న రాజ్యసభలో భాజపాకి 47 మాత్రమే ఉన్నాయనీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 68 ఉన్నాయనీ, ఈ అంకెల తూకం మారే వరకూ సంస్కరణల బిల్లులకు ఆమోదం లభించదనీ స్పష్టంగా తెలుసు.
2013 నాటి భూసేకరణ చట్టానికి సవరణలు తీసుకురావడం విష యంలో మోదీకి రెండో ఆలోచన లేదు. రైతులకు అన్యాయం జరుగుతుందనే సంకోచం లేదు. కాంగ్రెస్‌కు ఒక ఆయుధం అందిస్తున్నామనే వెరపు లేదు. రాజ్యసభలో బలం ఎట్లా పెంచుకోవాలన్నదే మోదీ ఆరాటం. అందుకే ఇద్దరు బలమైన మహిళా నాయకులతో రాజీకి సిద్ధమైనాడు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికలలో, మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్‌ను గంగలో కలిసేస్తానంటూ అమిత్ షా గర్జించినప్పటి ఆలోచన మారిపోయింది. వ్యూహాత్మకంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని ప్రసన్నం చేసుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో ఒకే వేదిక నుంచి మాట్లాడమే కాకుండా రెండుసార్లు మమతాతో మోదీ ప్రత్యేకంగా ముఖాముఖి సమాలోచనలు జరిపారు.
పశ్చిమ బెంగాల్ కోసం కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజి సాధించాలని మమతా దీదీ వ్యూహం. తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉన్న 12 రాజ్యసభ స్థానాలను వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించాలని మోదీ సంకల్పం. ప్రతిపక్షాలను ఓడించడానికి కేవలం దీదీ మద్దతు మాత్రమే చాలదు. దక్షిణాది అమ్మ సహకారం కూడా కావాలి. అందుకే ఏఐఏడిఎంకే అధినేత నిర్దోషి అంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే మోదీ నుంచి జయలలితకు శుభాభినందనలు ఫోన్ ద్వారా అందాయి. భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామిలో మునుపటి జోరు కనిపించలేదు. తగ్గవలసిందిగా స్వామికి మోదీ ఆదేశం అందిందనే అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఆ భరోసాతోనే జయ శనివారంనాడు అయిదో విడత ముఖ్య మంత్రిగా ప్రమాణం చేశారు. మోదీ మిత్రుడు, అగ్రశ్రేణి తమిళ నటుడు రజనీ కాంత్‌తో పాటు ఇళయరాజా సైతం జయ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం వెనుక చాలా కథ ఉంది.
ఏఐఏడిఎంకేకి రాజ్యసభలో 11 సీట్లున్నాయి. పశ్చిమబెంగాల్లో, తమిళనాడులో భాజపాను విస్తరించాలనే ఆలోచనను తాత్కాలికంగా పక్కన పెట్టి రెండు రాష్ట్రాలలోని అధికార పార్టీలతో స్నేహం చేయడమే ప్రాప్తకాలజ్ఞత అని గ్రహించగల వివేకం మోదీకి ఉన్నది. అసాధ్యమైన లక్ష్యాలు సాధించాలన్న మొండిపట్టుకు స్వస్తి చెప్పి వాస్తవిక దృష్టితో, వాజపేయి స్ఫూర్తితో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడిపించాలన్న స్పృహ మోదీ తాజా కార్యాచరణలో స్పష్టంగా కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ, శివ సేన, అకాలీదళ్ వంటి మిత్రపక్షాలతో పాటు జయ, మమత, వీలైతే మాయా వతిని సుముఖం చేసుకుంటే భూసేకరణ బిల్లును సులభంగా గట్టెక్కిం చవచ్చుననే చాణక్యం మోదీది.
బహుశా మోదీ రెండో సంవత్సరాన్ని సంస్క రణల బాటలో ఉన్న అవ రోధాలను అధిగమించడంకోసం వినియోగిస్తారు కాబోలు. ఒక్కడి వల్ల, ఒకే పార్టీ వల్ల భిన్నత్వంలో ఏకత్వం సాధించడం, భారత్ వంటి వైవిధ్యభరితమైన దేశాన్ని పాలించడం వీలు కాదనీ, భావసారూప్యం గల శక్తుల అవకాశవాద కలయిక ద్వారానే అది సాధ్యమనీ గ్రహించిన మోదీ తన పంథా మార్చుకుంటున్న దృశ్యం రెండో సంవత్సరం ప్రారంభంలో కనిపిస్తున్నది.