channels stopping
-
‘సాక్షి ప్రసారాల నిలిపివేత అనైతికం’
నెల్లూరు: రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అనైతిక చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్రసారాల నిలిపివేతను అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించాలన్నారు. ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని మధు డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో నియంత పాలన: వైఎస్సార్సీపీ
విజయనగరం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియంత పాలన కొనసాగిస్తున్నాడని వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. గరివిడిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, సాక్షి చానల్ వాస్తవాలను తెలియజేస్తున్నందువల్లే టీడీపీ నాయకులు ఎంఎస్ఓలపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రసారాలు నిలిపివేశారన్నారు. చానల్ ప్రసారాలు నిలిపివేసినంత మాత్రాన ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు ప్రజలకు తెలియవనుకోవడం అవివేకమని తెలిపారు. భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు పనితీరుపై రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, ఆయన అనుచరులకు వంత పాడే చానళ్లు, పత్రికలకు లబ్ధి చేకూరడం కోసమే సాక్షిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. పత్రికలు, టీవీ చానళ్లపై వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపులు చేపట్టడం తగదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి టీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. విస్తృతస్థాయి సమావేశం విజయవాడలో వైఎస్సార్సీపీ విస్తృస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ కొనిసి కృష్ణంనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ మీసాల విశ్వేశ్వరరావు, పొన్నాడ వెంకటరమణ, ముల్లు రాంబాబు, తాటిగూడ పీఏసీఎస్ అధ్యక్షుడు యడ్ల అప్పారావు, వలిరెడ్డి లక్ష్మణ, ఎలకల అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
సాక్షిపై ఆంక్షలకు వ్యతిరేకంగా ధర్నాలు
విజయవాడ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఏపీలో పలు ప్రాంతాల్లో శనివారం జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు. అనంతరం టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని కోరుతూ డీఆర్వో నూర్ బాషా ఖాసిమ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు రామకృష్ణ, సురేష్, బ్రహ్మం, మీసాల శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయుల ధర్నా నిర్వహించారు. వీరికి వైఎస్సార్సీపీ, లోక్‌సత్తా, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విశాఖ జిల్లా చోడవరంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు ధర్నా చేశారు. సాక్షి టీవీతోపాటు నిలిపివేసిన ఇతర టీవీ చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని, మీడియా స్వేచ్ఛను కాలరాయొద్దంటూ కోరుతూ నాయకులు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. -
'న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యూస్ చానళ్లను నియంత్రించడం సరికాదని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ...తుని ఘటనను అడ్డుపెట్టుకుని బాబు సర్కార్ కాపు సామాజిక వర్గాన్ని భయబ్రాంతులకు గురి చేస్తోందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిష్కారించాలని శైలజానాథ్ సూచించారు. ముద్రగడ అంగీకరిస్తే తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని మంత్రి నారాయణ చెప్పడం బ్లాక్ మెయిలింగ్‌ను తలపిస్తోందన్నారు. మంత్రి నారాయణ కార్పొరేట్ కాలేజీల సీట్ల వ్యవహారంపై విచారణకు సిద్ధమేనా?? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు.. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు తేడాలున్నాయని శైలజానాథ్ ఆరోపించారు. ఏపీలోని పలు జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేసిన విషయం తెలిసిందే.