అరటిపండు లంబా లంబా!
కామెడీ సీన్ - చంటబ్బాయ్
‘ఆంధ్రవీణ’ పత్రిక కార్యాలయం... ఎడిటర్ బిజీగా ఉన్నాడు. పానకంలో పుడకలా వాగ్దేవి ఎంటరయింది.
వాగ్దేవి: నమస్కారమండీ ఎడిటర్‌గారూ!
ఎడిటర్: నమస్కారం...ఎవరమ్మా..?
వాగ్దేవి: ఈ వారం మన ‘ఆంధ్ర వీణ’ ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ ‘చెత్త బతుకులు’ నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవీణ మా ఇంటికి రాగానే నేను ముందు చద వాలి అంటే నేను ముందు చదవాలి అంటూ మా వారూ నేను పోట్లాడుకుంటాం. డయానా రెటీనా ప్రకటన మీ పత్రికకే హైలైట్.
ఎడిటర్: నీ పేరేంటమ్మా?
వాగ్దేవి: వాగ్దేవి అండీ? రెండేళ్ల క్రితం నా రెండు ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి. గుర్తు లేదూ..?
ఎడిటర్: ఆ...ఆ...గుర్తులేకేం? కేవలం ఆ రెండు ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10 వేలకు పడిపోయింది. నువ్వే నా తల్లీ! ఏం కావాలి..?
శ్రీలక్ష్మి బ్యాగ్‌లోంచి కవర్ తీసి చేతికి అందించబోయింది. వెంటనే ఎడిటర్ భయపడి చేతులు వెనక్కి తీసుకుంటూ
ఎడిటర్: ఏమిటది?
వాగ్దేవి: నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను, మచ్చుకు కొన్ని కవితలు వినిపిస్తాను వినండి.
‘‘ఆకాశం రంగు నీలంగా ఎందుకుంటుంది?
ఎర్రగా ఉంటే బాగుండదు గనక.
రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది?
నీలంగా ఉంటే బాగుండదు గనక.
మల్లె తెల్లగా ఎందుకుంటుంది?
నల్లగా ఉంటే బాగుండదు గనక.’’
ఎడిటర్ ఈ కవితలు వింటూ అసహనంతో...
ఎడిటర్: ‘‘ఇవి విన్నాక కూడా ఎందుకు బతుకున్నాను?
నాకు చావు రాలేదు గనక.’’
వెంటనే శ్రీలక్ష్మి ఆయన చేతిల్లో పెన్ను లాక్కొని రాస్తూ...
శ్రీలక్ష్మి: చాలా బాగుందండీ, ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను ఇవి మీ పత్రికలో వేయించండి
ఎడిటర్ పెన్నూ, కవర్ లాక్కొని...
ఎడిటర్: వీటిని ఇక్కడే ఉంచుతాను. మేమిక పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక నీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజయ్యేసరికి మేము ఏ ఆఫ్రికాకో, అండమాన్‌కో పారిపోతాం. వీటిని ఇక్కడే ఉంచుతామమ్మా!
వాగ్దేవి: చాలా థ్యాంక్స్. ఇకపోతే...
అంటూ బ్యాగ్‌లోంచి ఓ కవర్ బయటకి తీసింది.
ఎడిటర్: ఎవరు పోతేనమ్మా! నేనా?
శ్రీలక్ష్మి కవర్‌ను టేబుల్ మీద పెట్టింది.
శ్రీలక్ష్మి: ఇవి కాస్త తినండి!
ఎడిటర్: ఎందుకమ్మా? పోవడానికా?
వాగ్దేవి: నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండీ. వంటా వార్పూ శీర్షికన మీరు దీన్ని ప్రచురించాలి. ‘అరటి పండు లంబా లంబా’ అని దీనికి పేరు పెట్టాను. వెంటనే ఎడిటర్ గుసగుసగా
ఎడిటర్: (నెమ్మదిగా )ఎడిటర్ బొంద బొంద అనకపోయావేం అనుకుని పైకి ‘‘అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్లీ తినడం ఎందుకు రిస్క్. జీవితం మీద ఆశ ఉన్నవాడిని ఇది ఇక్కడే ఉంచమ్మా’’
వాగ్దేవి: వస్తానండీ. వచ్చేసారి ఇంకొన్ని కవితలు, స్వీట్లు తెస్తాను
ఎడిటర్: ఈ సారి వచ్చే ముందు చెబితే ఆ రోజు సెలవు పెట్టుకుంటాను.
వాగ్దేవి: అబ్బా సెలవు పెట్టి వినాల్సిన అవసరం లేదండీ? ఆఫీసులోనే వినచ్చు.
(ఈ ఎపిసోడ్ ‘చంటబ్బాయ్’ సినిమాలోనిది. జంధ్యాల మార్కు కామెడీకి నిలువుటద్దం. ఎడిటర్‌గా పొట్టిప్రసాద్, వాగ్దేవిగా శ్రీలక్ష్మి నటన ఆద్యంత చమత్కారభరితంగా ఉంటుంది.)
నిర్వహణ: శశాంక్ బూరుగు