మాత్రలు మింగి సీఎస్పీ ఆత్మహత్య
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్: తనను విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో జీరోమాస్ సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న సీఎస్పీ ఒకరు మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం కొత్తగూడెం మండలంలోని సుజాతనగర్ పంచాయతీ వేపలగడ్డలో చోటు చేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. సుజాతనగర్ పంచాయతీలోని వేపలగడ్డ గ్రామానికి చెందిన చాపల కోటమ్మ (30) 2010 సంవత్సరం ఆగస్టు 13 తేది నుంచి కొత్తగూడెం మండలంలో జీరోమాస్ సంస్థలో సీఎస్పీగా (కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్) విధులు నిర్వహిస్తోంది.
ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆమె ప్రతీ నెల ఉపాధి కూలీలకు వేతనాలు, వృద్ధులు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇటీవల కూలీలకు వేతనాలు చెల్లించడంతో జాప్యం జరుగుతుండడంతో జిల్లాలో జీరోమాస్ సంస్థను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో ఆ సంస్థలో పని చేస్తున్న సీఎస్పీలను విధుల నుంచి తొలగించారు. అందులో భాగంగా తన ఉద్యోగం కూడా పోవడంతో కోటమ్మ కొద్ది రోజులుగా మనస్తాపంతో ఉంది. శనివారం ఆమె ఇంట్లో ఉన్న మాత్రలు మింగింది. స్థానికులు ఆమెను గమనించి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
అనాథలైన ఇద్దరు చిన్నారులు..
మృతురాలు కోటమ్మకు ఇద్దరు కుమారులు సాయి, నవీన్ ఉన్నారు. కోటమ్మ భర్త ఆరు నెలల క్రితం తలలో రక్తం గడ్డకట్టి మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి ఆమె కుమారులను పోషిస్తోంది. ప్రస్తుతం ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలిద్దరు అనాథలయ్యారు. కోటమ్మ మృతదేహానికి ఎస్సై పంచనామా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. జీరోమాస్ సంస్థ నుంచి బండ ప్రశాంత్, భారతి, సులోచన, స్వరూప, విఘేశ్వరి, లక్ష్మీకాంత, పాల్వంచ సీఎస్పీలు విజయలక్ష్మి, వెంకటరమణ, అరుణ, రోజామేరీ, గీతా, సరిత తదితరులు, వైఎస్సార్సీపీ నాయకులు కందుల సుధాకర్‌రెడ్డిలు కోటమ్మ మృతదేహాన్ని సందర్శించారు.