పునాదిరాయి వేసిన చోటే!
అదృష్టం తలకిందులైతే.. పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సి వస్తుంది. గోవాకు చెందిన ఓ మాజీ మంత్రిగారికీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితే దాపురించింది. ఓ జైలు నిర్మాణానికి ఐదేళ్ల క్రితం స్వయంగా తన చేతులతోనే పునాది రాయి వేసిన ఆయన ఇప్పుడు అదే జైలులో ఊచలు లెక్కిస్తున్నారు!
గోవా ప్రజా పనుల శాఖ మాజీ మంత్రి చర్చిల్ అలెమావో ఇటీవల లూయిస్ బెర్గర్ లంచం కేసులో అరెస్టయ్యారు. క్రైమ్ బ్రాంచ్ లాకప్‌లో ఏడు రోజులు గడిపిన తర్వాత బెయిల్ పిటిషన్‌ను పెండింగ్‌లో పెట్టిన కోర్టు ఆయనకు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కొత్తగా నిర్మించిన కోల్వాలే జైలుకు తరలించారు.
ఈ ఏడాది మే 30నే ప్రారంభమైన ఈ జైలుకు ఖైదీగా వచ్చిన తొలి రాజకీయ నాయకుడు కూడా ఈయనే! అన్నట్టూ.. తాను పునాదిరాయి వేసిన ఈ జైలులో సౌకర్యాలన్నీ బాగున్నాయని అలెమావో సంతృప్తి వ్యక్తం చేశారట!