కష్టపడితే ఉన్నతంగా ఎదగొచ్చు
ఏలూరు (సెంట్రల్) : కష్టపడి పనిచేస్తే అత్యున్నతస్థాయికి వెళ్లడం కష్టంకాదని బాబూ జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ ప్రపంచానికి చాటి చెప్పారని, వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడే తత్వాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ 110వ జయంతి సందర్భంగా స్థానిక 38వ డివిజన్ లంకపేటలో ఆయన విగ్రహానికి కోటేశ్వరరావు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మేయర్ నూర్జహాన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ దేశంకోసం నాటి నాయకులు ఎన్నో త్యాగాలు చేశారని, అందువల్లే ప్రపంచ దేశాలలో మనదేశం నేడు అగ్రరాజ్యానికి దీటుగా నిలబడిందని అన్నారు. కార్యక్రమంలో కో-ఆప్షన్ సభ్యుడు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడివాడ రామ చంద్రకిషోర్, కమిషనర్ వై.సాయి శ్రీకాంత్, కార్పొరేటర్లు నిర్మలకమారి, రాయి విమలదేవి, జిజ్జువరపు ప్రతాప్‌కుమార్, దళిత సంఘం నాయకులు మున్నుల జాన్ గురునా«థ్ పాల్గొన్నారు.