అభ్యర్థులపై చార్జ్‌షీట్ పడిందో.. ఇక అంతే!
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీస్వీకారం చేసిన వెంటనే జేఎస్ ఖేహర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అభ్యర్థులపై దృష్టిసారించేందుకు సిద్ధమయ్యారు. కళింకిత అభ్యర్థులకు ఎన్నికల్లో పోటీకి అనుమతి ఇవ్వాలా? లేదా ? అనే అంశంపై చర్చించడానికి రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేసే అప్లికేషన్‌ను ఖేహర్ పరిశీలించనున్నట్టు తెలిపారు. ఐదుగురు జడ్జిలతో వెంటనే రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు చేయాలనే అప్లికేషన్ గురువారం సీజేఐ ముందుకు తీసుకెళ్లినట్టు బీజేపీ సభ్యుడు అశ్వినీ ఉపాధ్యాయ తెలిపారు. ఈ విషయాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణలోకి తీసుకుంటానని, త్వరలోనే రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ ఖేహర్ చెప్పారు. అదేవిధంగా ఛార్జ్ షీట్ అభ్యర్థులను ఎన్నికల్లో పోటీచేయకుండా డిబార్ చేసే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కూడా సీజేఐ పరిశీలించనున్నట్టు ఉపాధ్యాయ పేర్కొన్నారు.
ఉపాధ్యాయ తరుఫున ఈ అప్లికేషన్‌ను మాజీ అడిషినల్ సొలిసిటర్ జనరల్ వికాస్ సింగ్, సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్, సీజేఐ ముందుకు తీసుకెళ్లారు. ఈ పిటిషన్లో 33 శాతం సభ్యులు నేరచరిత్ర కలిగిఉన్నట్టు ఉపాధ్యాయ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం ప్రతేడాది ఈ క్రిమినల్ కేసులు మరింత పెరుగుతున్నాయని తెలిసింది. గోస్వామి కమిటీ, వోహ్రా కమిటీ, క్రిష్ణమూర్తి కమిటీ, ఇంద్రజీత్ గుప్తా కమిటీ, జస్టిస్ జీవన్ రెడ్డి కమిషన్, జస్టిస్ వెంకట్చాలయ్య కమిషన్, ఎన్నికల, లా కమిషన్లు నేరచరిత్రులకు, కళంకితులకు రాజకీయాల్లో స్థానం ఉండకూడదని సిఫార్సు చేశాయి. కానీ ఇప్పటివరకు ఆ సిఫారసులు అమలు కాలేదు. ఇది ఏ ఒక్కరినో టార్గెట్ చేసి తీసుకురావడం లేదని, ముఖ్యమైన ఎన్నికల సంస్కరణలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నామని ఉపాధ్యాయ తెలిపారు. వారంలోగా రాజ్యాంగ బెంచ్‌ను సీజేఐ ఏర్పాటుచేయనున్నారు.