పురాణగాథల సమన్వయహారం ‘శ్రీసుబ్రహ్మణ్య స్వామి చరిత్ర’
– ఘనంగా గ్రంథ సమీక్షా సమావేశం
– పాల్గొన్న సాహితీ దిగ్గజాలు
రాజమహేంద్రవరం కల్చరల్ : ‘‘కుమారస్వామి జననం గురించి వివిధ పురాËణాలు, కావ్యాలలో స్వల్ప వైరుద్ధ్యాలు ఉన్నాయి. ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి ‘ శ్రీ సుబ్రహ్మణ్య చరిత్ర’ గ్రంథంలో ఈ వైరుద్ధ్యాలకు చక్కని సమన్వయం సాధించారు. అన్ని విధాలా మణి ‘సమన్వయచక్రవర్తి బిరుదానికి అర్హుడు.’’ అని రామాయణ రత్నాకర డాక్టర్ కేసాప్రగడ సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం శ్యామలానగర్ రామాలయం సెంటర్లో వక్కలంక శ్రీరామచంద్రమూర్తి గృహంలో శ్రీగాయత్రీ సత్సంగం ఆధ్వర్యంలో జరిగిన గ్రంథ సమీక్షా సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. కొన్ని వేదమంత్రాలను స్వరయుక్తంగా చదవడానికి దంతాలు అడ్డువస్తాయని అందుకనే సుబ్రహ్మణ్యస్వామి నాగేంద్రుడిగా అవతరించి వేదమంత్ర స్వరాన్ని కాపాడారని అన్నారు. గ్రంథంలో అనేక ఉపయుక్తమైన మంత్రాలను, శ్లోకాలను రచయిత పొందుపరిచారని, ఇందులో పేర్కొన్న షష్టీస్తోత్రం చదివితే, శిశువులకు బాలారిష్టాలు తొలగిపోతాయని ఆయన అన్నారు. సభకు అధ్యక్షత వహించిన భాగవత విరించి డాక్టర్ టి.వి.నారాయణరావు మాట్లాడుతూ ‘షణ్మత’ (6) స్థాపకుడైన ఆదిశంకరులు‘ పంచాయతన’(5) పూజలను ఎలా ప్రవేశపెట్టారని మనకు ఒక సందేహం రావచ్చు, పూజ సమయంలో వెలిగించే దీపమే సుబ్రహ్మణ్య స్వామి అని ఆయన వివరించారు. గణపతి, కుమారస్వాములు పుత్ర తత్త్వాన్ని తెలియజేస్తే, శివపార్వతులు మాతాపితరుల తత్త్వాన్ని లోకానికి తెలియజేస్తున్నారని అన్నారు. కుమారస్వామిని ఆరాధిస్తే, శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఆరాధించిన ఫలితం లభిస్తుందన్నారు. పాత్రికేయుడు వీఎస్ఎస్ కృష్ణకుమార్ స్వాగత వచనాలు పలికారు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత చింతలపాటి శర్మ, అవధాన అష్టాపద తాతా సందీప్, శతావధాన విశారద ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూపలు గ్రంథకర్తను అభినందించారు. డాక్టర్ బీవీఎస్ మూర్తి, ఎర్రాప్రగడ రామకృష్ణ, పెమ్మరాజు గోపాలకృష్ణ, ఓరుగంటి గురుప్రసాద శర్మ, పలువురు సాహితీవేత్తలు హాజరయ్యారు.