అదృశ్యమైన బాలిక తండ్రి ఆత్మహత్య
పోలీసుల వేధింపులతోనే అంటున్న మృతుడి అన్న
గూడూరు: వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ శివారు చర్లతండాలో అదృశ్యమైన బాలిక కవిత తండ్రి బోడ రవి(34) గురువారం తన పంట చేను సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. కూతురు అదృశ్యమైందన్న అవమానభారంతోనే తన తమ్ముడు రవి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి అన్న మంగీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, మీడియూకు మాత్రం తన తమ్ముడు పోలీసుల బెదిరింపులకు భయపడి ఉరివేసుకున్నాడని చెప్పడం గమనార్హం. చర్లతండాకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బోడ కవిత 2 నెలల క్రితం కనిపించకుండాపోగా, ఈనెల 11న ఆ బాలిక తండ్రి రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు అనుమానితులను విచారిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సంపేట డీఎస్సీ మురళీధర్ బుధవారం రవిని గూడూరు పోలీస్ స్టేషన్కు పిలిపించి వివరాలు అడిగారు. అనంతరం చర్లతండా వాసులతోపాటు, బాలిక తల్లి, చెల్లిని కూడా డీఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవిని బుధవారం రాత్రి ఇంటికి పంపారు. కూతురు అదృశ్యంతో మానసిక క్షోభకు గురైన రవి.. తాను కూడా చనిపోతానని కుటుంబ సభ్యులతో అన్నాడని తండావాసులు చెపుతున్నారు.
కాగా, గురువారం ఉదయం చర్లతండాలోని రవి ఇంటికి వెళ్లిన ఇద్దరు పోలీసులు ‘నీ కూతురు అదృశ్య విషయం నీకు తెలుసని తండావాసులు చెబుతున్నారు. ఈ రోజు మా సార్లు నిన్ను స్టేషన్కు పిలిచి వాయిస్తారు (కొడతారని).. కవిత ఎక్కడుందో చెప్పు’ అని అడిగి వెళ్లారని తన తమ్ముడు రవి అందరికీ చెప్పి భయకంపితుడయ్యూడని రవి అన్న బోడ మంగీలాల్ సంఘటనా స్థలంలో మీడియా ప్రతినిధులకు చెప్పాడు.
బాలిక నోట్బుక్లో ఓ విద్యార్థి సంఘ నాయకుడి సెల్ నంబర్ కూడా రాసి ఉన్నదని, అతనికి బాలిక అదృశ్యం విషయం తెలుసునని, పోలీసులు అతన్ని అడగడం లేదని మంగీలాల్ అన్నారు. కాగా, అదృశ్యమైన బాలిక తండ్రి రవి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ జాన్వెస్లీ, నర్సంపేట డీఎస్పీ మురళీధర్ గూడూరు ఆస్పత్రికి చేరుకుని రవి మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసులను పంపామని, తొందరలోనే ఈ కేసును ఛేదిస్తామని మృతుడి బంధువులతో అన్నారు.