Charles de Gaulle airport
-
18 ఏళ్లుగా ఎయిర్‌పోర్ట్‌లోనే.. అక్కడే తుదిశ్వాస
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్బర్గ్ ‘ది టర్మినల్’ హిట్ సినిమాకు స్ఫూర్తి అయిన ఇతని పేరు మెహ్రాన్ కరిమి నసీరి. ఇరాన్‌లోని మస్జీద్ సులేమాన్ సిటీలో పుట్టాడు. బ్రిటన్‌లో స్థిరపడాలనుకున్నాడు. అందుకు బ్రిటన్ నిరాకరించింది. బ్రిటన్‌లో భాగమైన స్కాట్లాండ్ తన తల్లి స్వస్థలం గనుక తనకు బ్రిటన్‌లో నివసించే హక్కుందని వాదించినా లాభంలేకపోయింది. ఆ సమయానికి పారిస్‌లోని చార్లెస్ డిగాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన మెహ్రాన్ అక్కడే ఆగిపోయాడు. ఇక దాన్నే తన స్థిరనివాసంగా మార్చుకున్నాడు. ఏకంగా 18 ఏళ్లు అక్కడే గడిపాడు! అనారోగ్యంతో కొన్నేళ్లు బయటికెళ్లినా ఇటీవల మళ్లీ తిరిగొచ్చి ఎయిర్‌పోర్ట్‌లోనే నివసిస్తున్నాడు. శనివారం తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు. అలా... ఎన్నో ఏళ్లుగా గడపిన విమానాశ్రయంలోనే శాశ్వత విశ్రాంతి తీసుకున్నాడు!! -
చైనాను హెచ్చరించేలా భారత్ ఫ్రాన్స్ విన్యాసాలు!
పణజీ: గోవా సమీపలోని సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌లు నౌకా విన్యాసాలను శుక్రవారం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌కు చెందిన విమాన వాహక నౌక చార్లెస్ డీ గాల్లె కేంద్రంగా ఈ విన్యాసాలు సాగుతున్నాయి. చైనాను హెచ్చరించేలా ఈ విన్యాసాలు ఉన్నాయని భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని ఫ్రాన్స్ కొట్టిపారేసింది. దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దేశాల భాగాలను తమవిగా చైనా చెప్పుకోవడం ఉద్రిక్తతలకు దారితీయడం తెలిసిందే. ఫ్రెంచ్ ఫ్లీట్‌కు సారథ్యం వహిస్తున్న రియర్ అడ్మిరల్ ఒలివియర్ లెబాస్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ వాణిజ్యం పరంగా వ్యూహాత్మకమైన ఈ ప్రాంతంలో మేం మరింత స్థిరత్వం తీసుకురాగలమని అనుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నుంచి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కలిపి 12 (ఒక్కో దేశం నుంచి ఆరు) పాల్గొంటున్నాయి. -
ఎయిర్‌పోర్టులో భారీ చోరీ.. పోలీసులు షాక్!
పారిస్: ఎయిర్‌పోర్టులో 3 లక్షల యూరోలు (భారత కరెన్సీలో దాదాపు రూ. 2.25 కోట్లు) డబ్బున్న రెండు సంచులతో ఓ వ్యక్తి ఉడాయించాడు. ఈ ఘటన ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రధాన విమానాశ్రమంలో చోటుచేసుకుంది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈ చోరీతో ఇంకా షాక్‌లోనే ఉన్నారు. దాదాపు యాభై ఏళ్లున్న ఓ వ్యక్తి పారిస్ లోని చార్లెస్ డి గాల్లే ఎయిర్‌పోర్టుకు గత శుక్రవారం వచ్చాడు. అయితే ఎయిర్‌పోర్టులో అటూఇటూ తిరుగుతున్న ఆ గుర్తుతెలియని వ్యక్తి లూమిస్ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీ గదుల వద్దకు వెళ్లగా.. రూమ్ ఓపెన్ చేసి ఉన్నట్లు గమనించాడు. క్షణాల్లో ఆ గదిలోకి వెళ్లిన ఆ వ్యక్తి కంపెనీ అక్కడ ఉంచిన రెండు సంచుల డబ్బును గుర్తించి.. చాకచక్యంగా వాటితో పరారయ్యాడు. లే పారిసియన్ అనే స్థానిక పత్రికలో పర్ఫెక్ట్ క్రైమ్ అంటూ కథనం రావడంతో విషయం వెలుగుచూసింది. ఆ సయంలో కంపెనీ రూము ఎందుకు తెరిచారో తెలియదు కానీ, ఆగంతకుడు మాత్రం ఎంతో అదృష్టవంతుడు.. అతడు రెండు వారాల ముందే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాడంటూ ఆ కథనం సారాంశం. భారీ చోరీ ఎలా జరిగింది, లూమిస్ కంపెనీ సిబ్బంది హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ పారిస్ పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించినా నిందితుడి ఆచూకీ తెలియట్లేదని సమాచారం. యాభై ఏళ్ల వ్యక్తి ఎయిర్‌పోర్టులో సులువుగా 3 లక్షల యూరోలు కొట్టేశాడంటే పోలీసులకు ఇప్పటికీ నమ్మశక్యంగా లేదట.