అమెరికాలో కాల్పులు, 9 మంది మృతి
చార్లెస్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. సౌత్ కరోలినా రాష్ట్రంలోని చార్లెస్టన్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక మెథడిస్ట్ చర్చిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం) 110 కాల్ హౌన్ స్ట్రీట్ లో ఉన్న చర్చిలోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు చార్లెస్టన్ పోలీసులు వెల్లడించారు. 8 మంది చర్చిలోనే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.
మరోవైపు దుండగుడిని పట్టుకునేందుకు చార్లెస్టన్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దుండగుడి వయసు సుమారు 20 ఏళ్లు ఉంటుందని, తెల్లరంగులో ఉన్నాడని ట్విటర్ లో పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో హెలికాప్టర్ ద్వారా భద్రతను సమీక్షిస్తున్నారు. అమెరికాలో పురాతమైన చర్చిలలో ఒకటైన చార్లెస్టన్ చర్చ్ పై దాడి జరగడం పట్ల నగర మేయర్ జోయ్ రిలే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ... సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్ ఈ దాడిని ఖండించారు.