chartered planes
-
తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!
తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, విదేశాలకు వెళ్తున్న వారిని తాలిబన్లు అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన దాదాపు నాలుగు చార్టర్డ్ విమానాలను తాలిబన్లు కొన్ని రోజులుగా నిలిపివేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఆయా విమానాల్లో ప్రయాణించేందుకు సన్నద్ధమైన వందలాది మంది ప్రయాణికులు ప్రస్తుతం తాలిబన్ల వద్దే బందీలుగా ఉన్నట్లు అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు, విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైఖేల్ మెక్‌కౌల్ చెప్పారు. అయితే, నాలుగు విమానాలను తాలిబన్లు ఎందుకు కదలనివ్వడం లేదన్నది ఇంకా తెలియరాలేదు. మజర్–ఏ–షరీఫ్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్గాన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. నాలుగు విమానాల్లో ఉన్న ప్రయాణికులంతా అఫ్గాన్ పౌరులేనని, వారిలో చాలా మందికి పాస్‌పోర్టులు, వీసాలు, ఇతర ధ్రువపత్రాలు లేవని తెలిపారు. అందుకే దేశం విడిచి వెళ్లలేకపోతున్నారని వెల్లడించారు. అమెరికా వాదన మరోలా ఉంది. ప్రయాణికుల్లో తమ దేశ పౌరులు కూడా ఉన్నారని రిపబ్లికన్ నాయకుడు మైఖేల్ మెక్‌కౌల్ స్పష్టం చేశారు. వారు విమానాల్లోనే కూర్చొని, తాలిబన్ల చెరలో బందీలుగా ఉన్నారని చెప్పారు. బందీలను విడిచిపెట్టడానికి డిమాండ్లు చేయాలని తాలిబన్లు యోచిస్తున్నారని ఆరోపించారు. డబ్బు లేదా తాలిబన్ కొత్త ప్రభుత్వానికి చట్టబద్ధత అనేవే ఈ డిమాండ్లు కావొచ్చని చెప్పారు. సమస్యను పరిష్కరించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. నిజానికి ప్రయాణికులెవరూ తాలిబన్ల వద్ద బందీలుగా లేరని స్థానికులు తెలియజేశారు. -
ఎలక్షన్ వేళ లోహవిహంగాలకు కలెక్షన్లే కలెక్షన్లు
ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ... పాద యాత్రలు కొద్ది మంది నేతలే చేస్తారు. మిగిలిన నేతలు ఆకాశమార్గం పడతారు. విమానాలపై ప్రయాణాలు చేస్తారు. అందుకే ఈ ఎన్నికల సీజన్ లో దేశంలోని 130 చార్టర్డ్ విమాన సంస్థలు భారీగా బిజినెస్ చేసుకుంటున్నాయి. ఎన్నిక ఎన్నికకీ ఎన్నికల వ్యయం పెరుగుతోంది. దీనితో విమాన ప్రయాణాల ఖర్చులు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల పుణ్యమా అని గత రెండేళ్లుగా నష్టాల్లో ఉన్న చార్టర్డ్ విమాన సేవల రంగం ఒక్కసారిగా పుంజుకుని లాభాల బాటలో పయనిస్తోంది. ఒక అంచనా ప్రకారం బిజినెస్ లో దాదాపు 40 శాతం వరకూ పెరుగుదల ఉంది. వ్యాపార వర్గాల కథనం మేరకు ఒక్కో ప్రధాన రాజకీయ పార్టీ దాదాపు 350 నుంచి 400 కోట్ల రూపాయల మేరకు ఎన్నికల వేళ విమాన లేదా హెలికాప్టర్ యానానికి ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటివరకూ లోహవిహంగాల్లో అత్యధిక సమయం ప్రయాణించిన ఘనత నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలకే దక్కుతుంది. ఇద్దరూ రోజూ మూడు నాలుగు సభల్లో మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి దేశమంతా చుట్టి వచ్చేందుకు విమానాలు తప్పనిసరవుతున్నాయి. ఇంతగా విమానాలను వాడుతున్నా వారు 200 నియోజకవర్గాలకు మించి వెళ్లడం కష్టం. విమానాలు లేకపోతే నలభై యాభై నియోజకవర్గాలను మాత్రమే టచ్ చేయగలుగుతారు. చార్టర్డ్ విమానయాన రంగం నిఫుణుల కథనాల మేరకు దాదాపు 520 హెలికాప్టర్లు, విమానాలు అద్దెకు దొరుకుతున్నాయి. మామూలు సింగిల్ ఇంజన్ విమానాలు గంటకు 75000 నుంచి లక్ష రూపాయల వరకూ చార్జి చేస్తున్నాయి. అయితే ముఖ్య నేతలు డబుల్ ఇంజన్ ఉన్న నాలుగు సీటర్లను కోరుకుంటున్నారు. ఇవి గంటకు 2.5 నుంచి 3 లక్షల వరకూ అద్దెని వసూలు చేస్తాయి. ఒక్క విమాన సంస్థలే కాదు ఎయిర్ పోర్టులు లాండింగ్, టేకాఫ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విమానాల మరమ్మత్తులు, మెయింటెనెన్సు కూడా భారీ ఆదాయాన్నిస్తోంది. కాబట్టి ఒక్క విమాన కంపెనీలే కాక వివిధ అనుబంధ పరిశ్రమలు, వాణిజ్యాలు కూడా ఎన్నికల సీజన్ నుంచి భారీ లాభాలు పొందుతున్నాయి. ఎన్నికల వేళ ఇనుప రెక్కల పక్షులు మరింత లాభాలను పొందుతాయన్నదే పరిశ్రమ వర్గాల అంచనా. దీని వల్ల నష్టాల్లో ఉన్న పరిశ్రమలు లాభాల మేఘాల మీద పరుగులు తీస్తాయని వారంటున్నారు.