cheap air travel
-
విమాన టికెట్లకూ ఈఎంఐలు!
కార్లు, టీవీలు, వాషింగ్ మిషన్లు.. ఇలా ఇళ్లలో వాడుకునే వస్తువులను వాయిదాల పద్ధతిలో కొనుక్కోవడం ఇంతవరకు మనకు తెలుసు. కానీ విమాన టికెట్లను కూడా ఇలా వాయిదాల పద్ధతిలో కొనుక్కోవచ్చని మీకు తెలుసా? చవక విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తాజాగా ఈ ఆఫర్ ప్రకటించింది. 'బుక్ నౌ, పే లేటర్' అనే పథకాన్ని గురువారం నాడు స్పైస్ జెట్ ప్రారంభించింది. దీని కింద ప్రయాణికులు టికెట్లు తీసుకుని, ఆ చార్జీలను 3, 6, 9 లేదా 12 నెలల్లో సులభ వాయిదాలలో తిరిగి చెల్లించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా కొనేవాళ్ల కంటే ఇలా వాయిదాల్లో కొనేవాళ్లకు 12 - 14 శాతం వడ్డీ అదనంగా పడుతుంది. కానీ, క్రెడిట్ కార్డుల మీద వసూలుచేసే 36 శాతం వడ్డీతో పోలిస్తే ఇది తక్కువేనని స్పైస్‌జెట్ అంటోంది. ఒకవేళ టికెట్ రద్దు చేసుకుంటే మాత్రం.. అప్పటికే బిల్లింగ్ అయిన వడ్డీ ఖర్చులను మాత్రం వినియోగదారులే భరించాలి. -
రూ. 3 వేలతో మలేషియా ప్రయాణం!
చవక ధరలకే విమానయానాన్ని అందిస్తున్న ఎయిర్ ఏషియా తన బిగ్‌సేల్‌లో మరో కొత్త స్కీము ప్రకటించింది. రూ. 3వేలకే విదేశీ ప్రయాణాన్ని అదికూడా పన్నులన్నీ కలుపుకొని అందిస్తామని చెప్పింది. ఈనెల 28వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి ఆగస్టు 31లోగా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో 30 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు. కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు రూ. 2,999కే టికెట్ ఇస్తున్నారు. అలాగే కొచ్చి నుంచి హాంకాంగ్, పెనాంగ్, సింగపూర్ ప్రాంతాలకు రూ. 4,019కే టికెట్ ఉంది. కొచ్చి నుంచి మెల్బోర్న్, పెర్త్, సిడ్నీ లాంటి ఆస్ట్రేలియా నగరాలకు మాత్రం టికెట్ ధరను రూ. 5,739గా నిర్ణయించారు. వివిధ భారతీయ నగరాల నుంచి అంతర్జాతీయ నగరాలకు కూడా ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తోంది. -
బెంగళూరు - విశాఖ విమాన టికెట్ రూ. 999!
చవక ధరలకే విమానయానాన్ని అందించే ఎయిర్ ఏషియా ఇండియా మరో సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. బెంగళూరు- విశాఖపట్నం మధ్య ప్రయాణాన్ని కేవలం 999 రూపాయలకే అందిస్తోంది. ఇంకా మాట్లాడితే.. బెంగళూరు - కొచ్చి మధ్య ప్రయాణాన్ని అన్ని పన్నులతో కలుపుకొని కేవలం 799 రూపాయలకే ఇచ్చేస్తోంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. ఈనెల 28వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంది. 2016 ఫిబ్రవరి 15 నుంచి 2016 ఆగస్టు 31వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. బెంగళూరు-పుణె, బెంగళూరు-గోవా, బెంగళూరు-విశాఖ ఈ మూడు మార్గాల్లోనూ టికెట్ ధరను 999 రూపాయాలుగానే ఎయిర్ ఏషియా ఇండియా నిర్ణయించింది. ఇక ఇదే ఆఫర్లో బెంగళూరు-జైపూర్ మార్గంలో రూ. 1599కి, బెంగళూరు-చండీగఢ్ మార్గంలోరూ. 1799, బెంగళూరు-న్యూఢిల్లీ మార్గంలో రూ. 1999కి టికెట్లు ఇస్తోంది. ఇటీవలి కాలంలో చాలా వరకు విమానయాన సంస్థలు ఇలాంటి చౌక ఆఫర్లను ప్రవేశపెట్టాయి. స్వదేశీ ప్రయాణాల విభాగంలో ఇటీవల ఎయిర్ ఇండియా రూ. 1777కే టికెట్ ఇస్తామంటూ ఓ ప్రకటనతో ముందుకొచ్చింది. జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, గో ఎయిర్, ఇండిగో లాంటి సంస్థలు కూడా ఆఫర్లను ప్రకటించాయి. -
జెట్ ఎయిర్వేస్ డిస్కౌంట్ ఆఫర్
అంతర్జాతీయ రూట్లలో 35% వరకూ.. న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సంస్థ అంతర్జాతీయ రూట్లలో బేస్ చార్జీల్లో 5 నుంచి 35% వరకూ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ తగ్గింపు తమ భాగస్వామి ఎతిహాద్ నెట్‌వర్క్‌కు కూడా వర్తిస్తుందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. ఈ ఆఫర్‌కు బుకింగ్స్ బుధవారం నుంచే ప్రారంభమయ్యాయని, వారం వరకూ ఉంటాయని పేర్కొంది, ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్లతో ఈ నెల 25 నుంచి డిసెంబర్ 12 వరకూ ప్రయాణించాల్సి ఉంటుందని వివరించింది. ప్రీమియర్, ఎకానమీ క్లాస్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. తామందిస్తున్న ఈ డిస్కౌంట్ ఆఫర్ న్యూయార్క్, సావో పోలో, టొరంటో, కువైట్, కఠ్మాండు, బ్యాంకాక్, సింగపూర్, తదితర విమాన సర్వీసులకు వర్తిస్తాయని పేర్కొంది. స్పైస్‌జెట్ రూ.3,799 కనిష్ట ధర నుంచి అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేసిన ఒక్క రోజు తర్వాత జెట్ డిస్కౌంట్ ప్రకటన వెలువడింది. -
పైసా కూడా కట్టకుండానే విమానంలో రిజర్వేషన్
విమానయాన రంగంలో పోటీ సరికొత్త ఆఫర్లకు తెరతీస్తోంది. ఇప్పటివరకు వెయ్యి రూపాయల లోపే స్వదేశీ విమానయానం అందిస్తున్నట్లు పలు సంస్థలు ప్రకటించాయి. ఇప్పుడు తాజాగా అసలు పైసా కూడా చెల్లించకుండానే తమ విమానాల్లో సీట్లు బుక్ చేసుకోవచ్చంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ సరికొత్త ఆఫర్ తెచ్చింది. ఈ ఆఫర్లో భాగంగా ఇండిగో విమానం దేంట్లోనైనా కస్టమర్లు సీటు బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా ఆరు గంటల పాటు బ్లాక్ చేసి ఉంచుకోవచ్చు. అప్పటివరకు టికెట్ ధర కూడా ఏమీ మారదు. ఆరు గంటల్లోగా చెల్లింపు చేస్తే సరేసరి.. లేకపోతే ఆ బుకింగ్ రద్దవుతుంది. ఇందుకోసం ముందుగా ఇండిగో వెబ్సైట్లో రిజిస్టర్ కావాలి. తర్వాత కావల్సిన విమానాన్ని ఎంచుకుని, 'పే లేటర్' అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు వినియోగదారులకు ఒక పీఎన్ఆర్ నెంబర్ వస్తుంది. ముందు వెనుకలు అన్నీ చూసుకున్న తర్వాత ఆరు గంటల్లోగా చెల్లింపు చేయాలి. లేనిపక్షంలో రిజర్వేషన్ రద్దవుతుంది. అయితే, 72 గంటల తర్వాత చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ విషయాన్ని ఇండిగో తన ట్విట్టర్ పేజీలోను, ఫేస్బుక్ పేజీలోను పోస్ట్ చేసింది. -
మరో ఆఫర్.. 908కే విమాన టికెట్!
దేశంలో విమానయాన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వెల్లువెత్తిస్తున్నాయి. ఎయిర్ ఏషియా ఇండియా 690 రూపాయలకు విమానయానం అంటూ ఈ యుద్ధాన్ని ప్రారంభించింది. దాన్నుంచి దాదాపు ప్రతి విమానయాన సంస్థ ఇలాంటి ఆఫర్లతోనే ముందుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా జెట్ ఎయిర్వేస్ సంస్థ మరో ఆఫర్ ప్రకటించింది. దేశంలోని పలు మార్గాల్లో ఎకానమీ క్లాస్ టికెట్లను మొత్తం అన్ని పన్నులు కలుపుకొని 908 రూపాయలకే అందిస్తోంది. అక్టోబర్ 5వ తేదీ వరకు ఈ ఆఫర్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. జనవరి 15 తర్వాత చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్లో భాగంగా కొచ్చి-బెంగళూరు మార్గంలో టికెట్ 908 రూపాయలు, బెంగళూరు-కొచ్చి అయితే రూ. 1162 అవుతుంది. బెంగళూరు-చెన్నై టికెట్ రూ. 1162 కాగా, చెన్నై-బెంగళూరు రూ. 1017. గోవా-బెంగళూరు టికెట్ రూ. 916 అయితే బెంగళూరు-గోవా మాత్రం రూ. 1162 ఉంది. బెంగళూరు నుంచి చండీగఢ్, జైపూర్‌లకు మాత్రం రూ. 2390గా టికెట్ ధర నిర్ణయించారు. ప్రధానంగా ఎయిర్ ఏషియా ఇండియా విమానాల ఆఫర్లున్న మార్గాల్లో మాత్రమే జెట్ ఎయిర్వేస్ కూడా తన ఆఫర్లను ప్రకటించడం గమనార్హం. ఎయిర్ ఏషియా ఆఫర్లు కూడా అక్టోబర్ 5 వరకు ఉంటాయి. ఇందులో బుక్ చేసుకున్నవారు జనవరి 15 నుంచి జూన్ 30 వరకు ప్రయాణాలు చేయొచ్చు. -
499కే విమాన టికెట్.. షరతులు వర్తిస్తాయి!
విమాన ప్రయాణికుల మీద విమానయాన సంస్థలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. చవక విమానయానాన్ని అందించే స్పైస్ జెట్ సంస్థ వచ్చే ఏడాది ప్రయాణాలకు సంబంధించిన టికెట్లను 499 రూపాయలకే అందిస్తామంటూ ముందుకొచ్చింది. సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం జనవరి 16 నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు (రెండు రోజులూ కలిపి) చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది. అయితే.. ఈ ధరలలో ఇంధన సర్‌ఛార్జి కలిసి ఉన్నా, ఇతర పన్నులు, ఫీజులను మాత్రం ఆ రోజుకు ఎంత ఉంటే అంత చొప్పున ప్రయాణికులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవలం భారతదేశంలో చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. ఈ ఆఫర్ కింద బుక్ చేసుకునే టికెట్లను రద్దు చేసుకోడానికి మాత్రం వీల్లేదు. ఒకవేళ రద్దు చేసినా ఆ సొమ్ము తిరిగి ఇవ్వరు, అలాగే ప్రయాణ తేదీ కూడా మార్చరు. మరోవైపు బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా కూడా మరో ఆఫర్ ప్రకటించింది. అన్ని పన్నులు కలిపి వివిధ మార్గాల్లో ప్రయాణాలకు రూ. 1290కే టికెట్ అందిస్తోంది. ఈ టికెట్లను సెప్టెంబర్ ఏడో తేదీ వరకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 11వ తేదీ వరకు చేసే ప్రయాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుంది.