30 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
సుల్తానాబాద్ : పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రైస్ మిల్లుకు తరలిస్తున్నారని వచ్చిన పక్కా సమాచారంతో సుల్తానాబాద్ పోలీసులు గురువారం తెల్లవారు జామున ఓ లారీని వెంబడించారు. కరీంనగర్‌కు వచ్చిన లారీ రైస్ మిల్లులు బియ్యం అన్లోడ్ చేస్తుండగా పట్టుకున్నారు. ఎస్సై జీవన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాల సరిహద్దుల్లో ఉన్న దేవునిపల్లి, నిట్టూరు నుంచి లారీలో పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తమైన పోలీసులు అనుమానం వచ్చిన లారీని వెంబడించారు. అది కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో ఉన్న శ్రీమన్నారాయణ అలియాస్ రామలింగేశ్వర ఎంఆర్ఎం రైస్‌మిల్‌కు చేరుకుంది. అక్కడ బియ్యం అన్లోడ్ చేస్తుండగా తనిఖీ చేశారు. అందులో ఉన్నవి రేషన్ బియ్యమే అని తేలడంతో లారీలో ఉన్న మోటం దుర్గయ్య, వారణాసి వీరస్వామి, కుమార్‌ను విచారణ చేశారు. రేషన్ బియ్యం తెచ్చినట్లు వారు అంగీకరించారు. దీంతో రైస్‌మిల్లును కూడా తనిఖీ చేశారు. లారీతోపాటు, మిల్లులో ఉన్న 30 టన్నుల బియ్యం ఉన్నట్లు గుర్తించి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. సివిల్సప్లై ఏజీపీవో కాశీవిశ్వనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పరిశీలన చేపట్టింది. బృందంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం డీటీసీఎస్‌లు కిష్టయ్య, అంజయ్య, శ్రీనివాస్, మల్లికార్జున్‌రెడ్డి, ఎఫ్ఐలు తిరుపతి, వరప్రసాద్, రమేశ్ ఉన్నారు. మెుత్తం 300 క్వింటాళ్లపైనే ఉన్నట్టు నిర్ధారించారు. ఈమేరకు నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని తెలిపారు. దుర్గయ్య, వీరస్వామి, కుమారును పోలీసులు ఠాణాకు తరలించారు.