Cheaters arrest
-
రూ.18 లక్షలు కడితే ఎంబీబీఎస్ సీటు
కోనేరు సెంటర్(మచిలీపట్నం): ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామంటూ నమ్మబలికి, రూ.లక్షలు దండుకున్న ముగ్గురు ఘరానా మోసగాళ్లను కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13వ తేదీన బీహార్‌లో వారిని అదుపులోకి తీసుకుని, ఆదివారం మచిలీపట్నం తీసుకొచ్చారు. జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబు ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బీహార్‌లోని నోవాడా జిల్లా అప్పర్ గ్రామానికి చెందిన ఓంకార్ కుమార్, రాకేష్ కుమార్ అన్నదమ్ములు. రణధీర్ కుమార్ వీరికి స్నేహితుడు. వ్యసనాలకు బానిసలైన ముగ్గురు ఆన్లైన్ మోసాలకు తెరలేపారు. మచిలీపట్నం మాచవరానికి చెందిన కట్టా మోహన్‌రావుకు నాలుగు నెలల క్రితం ముగ్గురు ఫోన్ చేశారు. మీ కుమారుడికి కోల్‌కతాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సిద్ధంగా ఉందని, రూ.18 లక్షలు కడితే చాలంటూ నమ్మించారు. తన కుమారుడిని ఎలాగైనా డాక్టర్ చదివించాలనే ఉద్దేశంతో మోహన్‌రావు ఆగష్టు 17న రూ.45,000 వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. 21న మరో రూ.4,50,000, 26న రూ.4,50,000 బదిలీ చేశాడు. 30వ తేదీన మళ్లీ రూ.5 లక్షలు పంపించాడు. మొత్తం రూ.14,45,000 వారి ఖాతాలో జమ చేశాడు. సెప్టెంబరు 9న తన కుమారుడిని కాలేజీలో చేర్పించేందుకు కోల్‌కతాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. అక్కడి యాజమాన్యంతో మాట్లాడగా, తమ కళాశాలలో సీట్లు లేవని, మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పారు. మోహన్‌రావు సెప్టెంబరు 11న చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు యువకులు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. డిసెంబర్ 13న బీహార్‌లోని ఓర్మిలీఘంజ్ బస్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు యువకులు మచిలీపట్నంతో పాటు చిత్తూరు జిల్లాలోనూ ఇదే తరహాలో మరికొందరిని మోసగించి, రూ.లక్షలు దోచుకున్నట్లు తేలిందని ఏఎస్పీ చెప్పారు. -
అమ్మాయిలకు వల.. ఆపై బ్లాక్మెయిల్
కర్నూలు: ఫేస్బుక్ ఆసరాగా అమ్మాయిలకు గాలం వేసి బ్లాక్మెయిల్ చేస్తూ నగదు, నగలు కొల్లగొడుతున్న ఓ మాయ గాడిని పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 36 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని ఎస్పీ గోపీనాథ్ జట్టి ఎదుట హాజరుపరిచారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాలకు చెందిన రాజకుమార్ అలియాస్ తేజర్ష అలియాస్ తేజ డిగ్రీ వరకు చదువుకొని వెలుగోడులో కొంతకాలం ఆర్ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. తర్వాత దొర్నిపాడు అమ్మిరెడ్డి నగర్లో ఆర్ఎంపీగా పనిచేస్తూ తన బట్టతలకు విగ్గు పెట్టుకుని తీసుకున్న కలర్ ఫొటోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి తాను డాక్టర్‌నని పరిచయం చేసుకుని ఆకర్షణీయమైన మెసేజ్‌లు పెట్టేవాడు. వాటికి కామెంట్ చేసిన అమ్మాయిల ఫోన్ నంబర్లు తెలుసుకుని చాటింగ్ చేస్తూ తన ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వారి ఫ్యామిలీ ఫొటోలు తెప్పించుకుని మార్ఫింగ్ చేసి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు లాక్కునేవాడు. పొరుగు రాష్ట్రాల అమ్మాయిలూ బాధితులే.. రాజకుమార్ మాయలో పడి మోసపాయిన వారిలో నంద్యాల, నల్లగొండ, కావలి, మదనపల్లె, కంబం, హైదరాబాదు, బెంగుళూరు, కర్నూలు, పత్తికొండతో పాటు మరికొన్ని ప్రాంతాల అమ్మాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 36 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు దండుకున్నాడు. మాయగాడిని ఇలా పట్టుకున్నారు.. ఇతడి చేతిలో మోసపోయిన పత్తికొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా బాధిత యువతి మెయిల్ నుంచే ఓ అందమైన అమ్మాయి ఫొటోను రాజకుమార్ మెయిల్‌కు పంపి దాని ద్వారా అతని సెల్‌ఫోన్ నంబర్ కనుక్కుని నేరాన్ని ఛేదించారు. డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో పత్తికొండ రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ మారుతీశంకర్, తన సిబ్బందితో కలసి ఫేస్బుక్ ద్వారా రాజకుమార్ పేరు, అడ్రస్ తెలుసుకుని పక్కా సమాచారంతో వల పన్ని పత్తికొండ పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిలను ఆకర్షించేలా కొటేషన్లు.. రాజకుమార్ నాలుగేళ్ల క్రితం నంద్యాలలో రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో కొన్ని నెలల పాటు మంచం పట్టాడు. ఈ సమయంలో కాలక్షేపం కోసం సెల్ఫోన్లో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి బట్ట తలకు విగ్గు పెట్టుకుని ఉన్న ఫొటోను అప్లోడ్ చేసి అమ్మాయిలను ఆకర్షించేలా కొటేషన్లు పెట్టేవాడు. ఫోన్ నంబర్లు తెలుసుకొని తన ఆసుపత్రిలో ఉద్యోగాల పేరుతో వల వేసి లాడ్జీలకు పిలిపించి, నగ్న ఫొటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలు లాక్కునేవాడు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇతడిపై కేసులు నమోదయ్యాయి. గతంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన ఓ వివాహిత నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. వారిచ్చిన ఫిర్యాదులో భాగంగా 2016 ఫిబ్రవరి 4న కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అప్పుడు కూడా ఈ కేసును ఎస్ఐ మారుతి శంకరే ఛేదించారు. మాయగాడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగలు, నగదు రికవరీ చేసినందుకు డోన్ డీఎస్పీ ఖాదర్ బాషా, పత్తికొండ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ మారుతీశంకర్, ఏఎస్ఐలు జమీర్, ఆనంద్, పీసీలు మహేష్, చిన్నశివయ్య తదితరులను ఎస్పీ అభినందించారు. జైలు జీవితం గడిపినా మారని వైనం.. రాజకుమార్ ఈ తరహా నేరాలకు పాల్పడి రెండుసార్లు జైలు జీవితం గడిపినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా అదే తరహా నేరానికి పాల్పడి మరోసారి పత్తికొండ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో కావలి, నెల్లూరు, కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో అమ్మాయిలను మోసం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. -
నిరుద్యోగులను మోసం చేసిన నలుగురి అరెస్ట్
ఒంగోలు: ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఒక సంస్థకు చెందిన ముఠాను ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక భాగ్యనగర్ 4వ లైనులోని 10వ క్రాస్ రోడ్డులో ఈ నెల 1వ తేదీన ఈ ముఠాకు చెందినవారు లైట్లైన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి నిరుద్యోగులను ఆకర్షించే విధంగా ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. ఈ ప్రకటనలు చూసిన దాదాపు వెయ్యి మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతపరచటానికి ఉద్యోగులు అవసరమని నమ్మించడంతో పలువురు వారిని ఆశ్రయించారు. ఒక్కో దరఖాస్తుకు తొలుత రూ.100 చొప్పున వసూలు చేశారు. దరఖాస్తు రుసుం పేరుతో లక్ష రూపాయలకు పైగా ఇప్పటికే దండుకున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలించిన అనంతరం ఉద్యోగం కేటాయిస్తామని నిరుద్యోగులకు చెప్పారు. అయితే ఒక్కొక్కరు రూ.2,500 చొప్పున డిపాజిట్ చేయాలన్నారు. వీరి మాటలను నమ్మిన 500 మందికిపైగా నిరుద్యోగులు 13లక్షల 50 వేల రూపాయల వరకు చెల్లించినట్లు సమాచారం. డబ్బులు కట్టించుకున్నా ఉద్యోగం చూపించకపోవడంతో కొంతమంది నిరుద్యోగులు ఒంగోలు వన్‌టౌన్ సిఐ కె.వి.సుభాషిణికి సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో కార్యాలయంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన సూత్రధారి జగదీశ్వరరావు అనే వ్యక్తి సికింద్రాబాద్ కేంద్ర కార్యాలయంగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కార్యాలయాలు ప్రారంభించి నిరుద్యోగులను ఇదే తరహాలో మోసం చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో తేలింది. వరంగల్‌లో మరో కార్యాలయం కూడా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బాధితుడు రాయపాటి పవన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.