అమ్మాయిలకు వల.. ఆపై బ్లాక్‌మెయిల్‌ | facebook cheater arrest In Kurnool | Sakshi
Sakshi News home page

అమ్మాయిలకు వల.. ఆపై బ్లాక్‌మెయిల్‌

Published Thu, Oct 11 2018 12:33 PM | Last Updated on Thu, Oct 11 2018 12:33 PM

facebook cheater arrest In Kurnool - Sakshi

కర్నూలు: ఫేస్‌బుక్‌ ఆసరాగా అమ్మాయిలకు గాలం వేసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ నగదు, నగలు కొల్లగొడుతున్న ఓ మాయ గాడిని పత్తికొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 36 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు, 5 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకుని ఎస్పీ గోపీనాథ్‌ జట్టి ఎదుట హాజరుపరిచారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని పగిడ్యాలకు చెందిన రాజకుమార్‌ అలియాస్‌ తేజర్ష అలియాస్‌ తేజ డిగ్రీ వరకు చదువుకొని వెలుగోడులో కొంతకాలం ఆర్‌ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు. తర్వాత దొర్నిపాడు అమ్మిరెడ్డి నగర్‌లో ఆర్‌ఎంపీగా పనిచేస్తూ తన బట్టతలకు విగ్గు పెట్టుకుని తీసుకున్న కలర్‌ ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసి తాను డాక్టర్‌నని పరిచయం చేసుకుని ఆకర్షణీయమైన మెసేజ్‌లు పెట్టేవాడు. వాటికి కామెంట్‌ చేసిన అమ్మాయిల ఫోన్‌ నంబర్లు తెలుసుకుని చాటింగ్‌ చేస్తూ తన ఆసుపత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వారి ఫ్యామిలీ ఫొటోలు తెప్పించుకుని మార్ఫింగ్‌ చేసి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్లు లాక్కునేవాడు. 

పొరుగు రాష్ట్రాల అమ్మాయిలూ బాధితులే.. 
రాజకుమార్‌ మాయలో పడి మోసపాయిన వారిలో నంద్యాల, నల్లగొండ, కావలి, మదనపల్లె, కంబం, హైదరాబాదు, బెంగుళూరు, కర్నూలు, పత్తికొండతో పాటు మరికొన్ని ప్రాంతాల అమ్మాయిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి సుమారు 36 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు దండుకున్నాడు.  

మాయగాడిని ఇలా పట్టుకున్నారు.. 
ఇతడి చేతిలో మోసపోయిన పత్తికొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణలో భాగంగా బాధిత యువతి మెయిల్‌ నుంచే ఓ అందమైన అమ్మాయి ఫొటోను రాజకుమార్‌ మెయిల్‌కు పంపి దాని ద్వారా అతని సెల్‌ఫోన్‌ నంబర్‌ కనుక్కుని నేరాన్ని ఛేదించారు. డోన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా ఆధ్వర్యంలో పత్తికొండ రూరల్‌ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ మారుతీశంకర్, తన సిబ్బందితో కలసి ఫేస్‌బుక్‌ ద్వారా రాజకుమార్‌ పేరు, అడ్రస్‌ తెలుసుకుని పక్కా సమాచారంతో వల పన్ని పత్తికొండ పట్టణం లోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు.  

అమ్మాయిలను ఆకర్షించేలా కొటేషన్లు.. 
రాజకుమార్‌ నాలుగేళ్ల క్రితం నంద్యాలలో రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరగడంతో కొన్ని నెలల పాటు మంచం పట్టాడు. ఈ సమయంలో కాలక్షేపం కోసం సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసి బట్ట తలకు విగ్గు పెట్టుకుని ఉన్న ఫొటోను అప్‌లోడ్‌ చేసి అమ్మాయిలను ఆకర్షించేలా కొటేషన్లు పెట్టేవాడు. ఫోన్‌ నంబర్లు తెలుసుకొని తన ఆసుపత్రిలో ఉద్యోగాల పేరుతో వల వేసి లాడ్జీలకు పిలిపించి, నగ్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ నగదు, బంగారు ఆభరణాలు లాక్కునేవాడు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఇతడిపై కేసులు నమోదయ్యాయి. గతంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి, గుంటూరుకు చెందిన ఓ వివాహిత నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు లాక్కున్నాడు. వారిచ్చిన ఫిర్యాదులో భాగంగా 2016 ఫిబ్రవరి 4న కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేసి కటకటాలకు పంపారు. అప్పుడు కూడా ఈ కేసును ఎస్‌ఐ మారుతి శంకరే ఛేదించారు.  మాయగాడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగలు, నగదు రికవరీ చేసినందుకు డోన్‌ డీఎస్పీ ఖాదర్‌ బాషా, పత్తికొండ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ మారుతీశంకర్, ఏఎస్‌ఐలు జమీర్, ఆనంద్, పీసీలు మహేష్, చిన్నశివయ్య తదితరులను ఎస్పీ అభినందించారు.

జైలు జీవితం గడిపినా మారని వైనం.. 
రాజకుమార్‌ ఈ తరహా నేరాలకు పాల్పడి రెండుసార్లు జైలు జీవితం గడిపినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా అదే తరహా నేరానికి పాల్పడి మరోసారి పత్తికొండ పోలీసులకు పట్టుబడ్డాడు. గతంలో కావలి, నెల్లూరు, కర్నూలు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇదే తరహాలో అమ్మాయిలను మోసం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement