ఒంగోలు: ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఒక సంస్థకు చెందిన ముఠాను ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. స్థానిక భాగ్యనగర్ 4వ లైనులోని 10వ క్రాస్ రోడ్డులో ఈ నెల 1వ తేదీన ఈ ముఠాకు చెందినవారు లైట్‌లైన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పేరుతో కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి నిరుద్యోగులను ఆకర్షించే విధంగా ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. ఈ ప్రకటనలు చూసిన దాదాపు వెయ్యి మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విస్తృతపరచటానికి ఉద్యోగులు అవసరమని నమ్మించడంతో పలువురు వారిని ఆశ్రయించారు. ఒక్కో దరఖాస్తుకు తొలుత రూ.100 చొప్పున వసూలు చేశారు. దరఖాస్తు రుసుం పేరుతో లక్ష రూపాయలకు పైగా ఇప్పటికే దండుకున్నారు.
ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలించిన అనంతరం ఉద్యోగం కేటాయిస్తామని నిరుద్యోగులకు చెప్పారు. అయితే ఒక్కొక్కరు రూ.2,500 చొప్పున డిపాజిట్ చేయాలన్నారు. వీరి మాటలను నమ్మిన 500 మందికిపైగా నిరుద్యోగులు 13లక్షల 50 వేల రూపాయల వరకు చెల్లించినట్లు సమాచారం. డబ్బులు కట్టించుకున్నా ఉద్యోగం చూపించకపోవడంతో కొంతమంది నిరుద్యోగులు ఒంగోలు వన్‌టౌన్ సిఐ కె.వి.సుభాషిణికి సమాచారం అందించారు. ఆయన తన సిబ్బందితో కార్యాలయంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన సూత్రధారి జగదీశ్వరరావు అనే వ్యక్తి సికింద్రాబాద్ కేంద్ర కార్యాలయంగా ఏర్పాటు చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా కార్యాలయాలు ప్రారంభించి నిరుద్యోగులను ఇదే తరహాలో మోసం చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమికంగా జరిపిన దర్యాప్తులో తేలింది. వరంగల్‌లో మరో కార్యాలయం కూడా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బాధితుడు రాయపాటి పవన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిరుద్యోగులను మోసం చేసిన నలుగురి అరెస్ట్
Published Thu, Mar 19 2015 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement