checkpoint
-
పోలీసుల్ని చితక్కొట్టిన మందుబాబులు..
సాక్షి, చెన్నై(తమిళనాడు): మద్యం మత్తులో ఉన్న యువకులు తమను చెక్‌పోస్టులో ఆపిన పోలీసులపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు పరుగులుతీయాల్సి వచ్చింది. సేలంలో రెండు రోజుల క్రితం ఒక మందుబాబు తమ మీద తిరగ బడడంతో పోలీసులు లాఠీకి పనిచెప్పారు. దీంతో అతను మరణించాడు. ఈ కేసులో ఎస్ఐ అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే దిండుగల్ జిల్లా వత్తలగుండు చెక్‌పోస్టు వద్దకు శుక్రవారం రాత్రి ఆరుగురు యువకులు వచ్చారు. ఒక బైకులో ముగ్గురు చొప్పు న ఉండడంతో ఎస్ఐ ధీరన్, హెడ్‌కానిస్టేబుల్ మేఘనాథన్, మరో కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న యువకులు తమనే అడ్డుకుంటారా అని ఆగ్రహంతో ఊగిపోయారు. మమ్మల్ని (మందుబాబుల్ని) చంపేస్తారా అంటూ కర్రలు, కొబ్బరి మట్టలతో చితక్కొట్టారు. గాయపడిన పోలీసులు పరుగులు తీసి ఆస్పత్రిలో చేరారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు చెక్‌పోస్టులోని సీసీ పుటేజీ ఆధారంగా మందు బాబుల కోసం గాలించారు. శనివారం ఉదయాన్నే వత్తలగుండుకు చెందిన రంజిత్, కాళిదాసు, మూర్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సేలం చెక్ పోస్టులో హిందూ మున్నని నాయకుడు చెల్ల పాండియన్ పోలీసుల మీద వీరంగం ప్రదర్శించాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆయన మీద కేసు నమోదైంది. అతన్ని హిందూ మున్నని నుంచి తొలగిస్తూ ఆ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: పీఏతో మంత్రి రాసలీలలు.. ఫొటోలు లీక్ -
ఆ వార్తలు అవాస్తవం: కృష్ణబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పాయింట్లను రేపటి నుంచి ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి, కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు స్పష్టం చేశారు. కోవిడ్ 19 మార్గదర్శకాల ప్రకారం సరిహద్దు చెక్‌పాయింట్లలన్నీ లాక్డౌన్ ముగిసేవరకూ కొనసాగుతాయన్నారు. పలు టీవీ చానల్స్‌లో చెక్పాయింట్లు ఎత్తివేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారంతా కచ్చితంగా ‘స్పందన’ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందేనని తెలిపారు. ఇందుకు తగ్గట్టుగా ప్రయాణాలు నిర్వహించుకోవాలని కృష్ణబాబు సూచించారు. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాల (మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ) నుంచి వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా ఏడు రోజులపాటు ప్రభుత్వ క్వారంటైన్లో ఉండాలని కృష్ణబాబు పేర్కొన్నారు. అలాగే తెలంగాణకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక బస్సులు నడుపుతామని తెలిపారు. (16 రోజులు.. రూ. 29.44 కోట్లు ) కాగా లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ (సోమవారం) నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. (వైద్య బలగాలు సంసిద్ధం!) -
6 లక్షల నగదు పట్టివేత
కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: నిమ్మాడ కూడలి వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద ఎస్ఐ జి.నారాయణస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం తనిఖీలు జరిపి 6 లక్షల నగదు పట్టుకున్నారు. టెక్కలి సమీపంలోని బొప్పాయిపురం వద్ద ఉన్న ఎన్ఆర్ఎల్ పెట్రోలు బంకుకు చెందిన గుమస్తా ప్రసాద్ పట్నాయక్ కారులో తీసుకువెళ్తుండగా నగదు పట్టుకున్నారు. ఎన్ఆర్ఎల్ పెట్రోలు బంకు ఇటీవల బీపీసీఎల్ బంకుగా మారినందున దీనికి సంబంధించిన స్థలం పొందూరులో రిజిస్ట్రేషన్ కోసం అక్కడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకువెళ్తున్నామని గుమస్తా చెప్పారు. అందు కు సంబంధించిన ఆధారాలను కొద్దిసేపటికి తీసుకువచ్చి చూపించారు. వీటిని పరిశీలించిన ఉప తహశీల్దార్ ప్రసాదరావు, ఎస్ఐ నారాయణస్వామి, ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు, ఆర్ఐ మురళి, వీఆర్వో పి.భూషణరావు ఆధారాల కాపీలను కలెక్టర్‌కు పంపించారు. అయితే ఆధారాలను వెంటబెట్టుకుని రానందున *6 లక్షల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వాహనాల తనిఖీల్లో *82 వేలు స్వాధీనం పోలాకి: మండలంలో వనవిష్ణుపురం చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు నరసన్నపేటకి చెందిన తంగుడు నాగగౌరిశెట్టి నుంచి *82 వేలు స్వాధీనం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నాగగౌరిశెట్టి మోటారుసైకిల్‌పై *82 వేలతో వెళ్తూ పోలీసులకు పట్టుబ ట్టాడు. ఎటువంటి రశీదులు లేకుండా ఈ మొత్తా న్ని తీసుకువెళ్తుండడంతో ఎస్సై వి.సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ జి.సత్యనారాయణ సమక్షంలో దాన్ని తహశీల్దార్ చంద్రకళకు అప్పగించారు. శెట్టి మాట్లాడుతూ తాను పిన్నింటిపేట, నిమ్మాడ గ్రామాల్లోని సిమెంట్ దుకాణాల వద్ద ఖాతాదారుల నుంచి సొమ్మును వసూలు చేసి ఇంటికి తీసుకు వెళ్తున్నట్టు తెలిపారు. -
వరుస దాడులు.. ఆగేనా దందాలు!
కుక్క తోక వంకర.. అన్నట్లు ఎన్నిసార్లు దాడులు జరిగినా ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని ఉమ్మడి తనిఖీ కేంద్రం సిబ్బంది తీరు మారడం లేదు. దాడులు జరిగితే మాకేంటి.. అన్నట్లు అక్రమ వసూళ్లు, ప్రైవేట్ వ్యక్తుల దందా ఏమాత్రం ఆగడంలేదు. ఏడాదిలో మూడోసారి.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి.. ఏసీబీ దాడి చేసినప్పుడు కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల రూపాయల అక్రమ వసూళ్లు సాగాయంటేనే ఇక్కడ అవినీతి ఎంతగా వ్యవస్థీకృతమైపోయిందో అర్థమవుతుంది. దాడులు జరుగుతున్నా.. అనంతర చర్యలు కఠినంగా లేకపోవడం వల్లే అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడటం లేదన్నది సుస్పష్టం. తాజాగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోమారు ఏసీబీ దాడి చేసి, కేసులు నమోదు చేసినా.. ఈ దందా ఆగుతుందన్న నమ్మకం మాత్రం లేదు. ఇచ్ఛాపురం, న్యూస్‌లైన్: ఏడాదిలో మూడోసారి.. వారం రోజుల వ్యవధిలో రెండోసారి పురుషోత్తపురంలోని ఉమ్మడి తనిఖీ ప్రాంగణం(చెక్‌పోస్టు)పై ఏసీబీ అధికారులు దాడి చేసి రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 13 మందిపై కేసులు నమోదు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో ఏసీబీ డీఎస్పీ సీతాపతి నేతృత్వంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల అధికారులు చెక్‌పోస్టు వద్దకు చేరుకున్నా రు. దూరం నుంచే చెక్‌పోస్టు పరిసరాలను అరగంటకు పైగా పరిశీలించారు. అనంతరం చెక్‌పోస్టు ఆవరణ వెనుక నుంచి కార్యాలయంలోకి ప్రవేశించారు. అధికారులను గమనించిన పలువురు ప్రవేటు వ్యక్తులు బయటకు జారుకోగా ఆరుగురు మాత్రం దొరికిపోయారు. కౌంటర్ల వద్ద తిష్ఠ అనంతరం అధికారులు వివిధ విభాగాల కౌంటర్ల వద్ద కూర్చొని అక్కడి వసూళ్లను గమనించారు. ఇదే మీ తెలియని లారీల సిబ్బంది ఎప్పటిలాగే అదనపు మొత్తాలు చెల్లించి తమ పత్రాలపై తనిఖీ ముద్రలు చేయించుకుని వెళ్లసాగారు. కొందరు డబ్బులు తీసుకొని తొందరగా తమ పత్రాలపై ముద్రలు వేయాలని కౌంటర్ల వద్ద ఉన్న అధికారులను కోరారు. చెక్‌పోస్టు వెలుపల ఉన్న ఎక్సైజ్ కౌంటర్ సిబ్బంది ఏసీబీ అధికారులను గమనించి కౌంటర్ వదిలి పారిపోగా లారీల సిబ్బంది పది రూపాయలు పెట్టి, పత్రాలపై తామే రబ్బర్ స్టాంప్ ముద్రలు వేసుకొని వెళ్లిపోయారు. సమీపంలోనే ఉన్న మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది బయటకు వెళ్లక ముందే ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్ల వద్ద డ్రైవర్ల రచ్చ కౌంటర్లలో ఏసీబీ సిబ్బంది కూర్చోవడంతో లారీల పత్రాల తనిఖీలు నెమ్మదించాయి. కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. చెక్‌పోస్టు అవరణలో ట్రాఫిక్ కూడా స్తంభించింది. దీంతో సహనం కోల్పోయిన కొందరు డ్రైవర్లు అరవడం ప్రారంభించారు. తొందరగా తనిఖీ చేయాలని కేకలు వేస్తూ కాసేపు గందరగోళం సృష్టించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని వారించారు. 5 గంటలపాటు తనిఖీలు అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభమైన తనిఖీలు ఆదివారం ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. ఈ 5 గంటల వ్యవధిలో రూ.1,25 లక్షల అక్రమ వసూళ్ల మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు ప్రైవేటు వ్యక్తులు, ఏడుగురు సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సీతాపతి విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు. కార్యాలయంలో ఉన్న ఆరుగురు ప్రైవేటు వ్యక్తులతోపాటు ఒక ఏఎంవీఐ, ఇద్దరు ఏసీటీవోలు, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సూపర్వైజర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు సీఐలు అజాద్, రామకృష్ణ, రమేష్ పాల్గొన్నారు. వరుస దాడులతో కలకలం ఒకే ఏడాదిలో మూడుసార్లు ఈ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి చేయడం కలకలం రేపింది. సాధారణంగా అంతర్ రాష్ట్ర చెక్పోస్టులపై ఏడాదికోసారే దాడి జరిపి తనిఖీలు నిర్వహిస్తారు. ఒకసారి దాడి చేస్తే.. మళ్లీ ఏడాది వరకు అటువైపు చూడరు. మధ్యలో విజిలెన్స్ దాడులు మాత్రమే జరుగుతుంటాయి. ఈసారి దీనికి భిన్నంగా మూడుసార్లు దాడి చేశారు. జూన్‌లో ఒకసారి దాడి చేసిన అధికారులు, ఈ నెల 21(శనివారం) అర్ధరాత్రి.. తిరిగి ఈ శనివారం అర్ధరాత్రి మరోసారి దాడి చేశారు. గత వారం జరిపిన తనిఖీలో రూ.2.15 లక్షల అనధికార సొమ్ము స్వాధీనం చేసుకొని, 20 మందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఇక దాడులు జరగవన్న ధీమాతో ఉన్న చెక్‌పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఈ దశలోనే తాజా దాడి జరిగింది. దాడులెన్ని జరిగినా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనంత వరకు ఈ అక్రమ వసూళ్లకు బ్రేక్ పడదని పలువురు అభిప్రాయపడుతున్నారు.