ఎస్టీల్లో కలపాలా.. వద్దా!
♦ వాల్మికిబోయ, కైతిలంబాడాలను ఎస్టీలో చేర్చే అంశంపై
♦ కేంద్ర బృందం అభిప్రాయసేకరణ
♦ కలెక్టరేట్లో వివిధ వర్గాలతో
♦ సమావేశమైన కమిషన్ చైర్మన్ ఎస్.చెల్లప్ప
♦ నతులు స్వీకరించిన బృందం సభ్యులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వాల్మికిబోయ, కైతిలంబాడాలను ఎస్టీల్లో చేర్చే అంశంపై కేంద్రం నియమించిన చెల్లప్ప బృందం గురువారం కలెక్టరేట్లో సమావేశమైంది. కుల సంఘాల ప్రతినిధుల నుంచి బృందం సభ్యులు అభిప్రాయాలు తీసుకున్నారు. వాల్మికిబోయలు తమ ఆర్థిక, సామాజిక పరిస్థితిని వివరిస్తూ బీసీ-ఏ కేటగిరీలో చేర్చడంతో తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్టీ జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ అంశంపై గిరిజన సంఘ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్థికంగా దయనీయ స్థితిలో ఉంటేనే మార్పు చేయాలని, ప్రస్తుతం వాల్మికి బోయల పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. కమిషన్ చైర్మన్ చెల్లప్ప, సభ్యు లు హెచ్.కె.వాగు, వీరమల్లు సమావేశానికి వచ్చిన సంఘ ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 32 ప్రజా విచారణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి విద్య తదితరులు పాల్గొన్నారు.