Chemical company
-
'కార్మిక కుటుంబాల్లో.. తీరని శోకం!' ఈ ప్రమాదాలు ఇంకెన్నాళ్లు?
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో ఉన్న బొల్లారం, బొంతపల్లి, ఖాజీపల్లి, హత్నూర, బొంతపల్లి, పటాన్చెరు, పాశమైలారం ప్రాంతాల్లో 5 వేల వరకు వివిధ రకాల పరిశ్రమలున్నాయి. అందులో ఎక్కువగా రసాయన పరిశ్రమలు అధికం. ఇటీవల కొన్ని వాటిల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. అమాయకులైన కార్మికులు మృత్యువాత పడ్డారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇలా పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు, యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించటం లేదు. రెండేళ్లలో జరిగిన ప్రమాద వివరాలు.. ► పటాన్చెరు పారిశ్రామిక వాడలో 28 ప్రమాదాలు జరిగి 12 మంది మృతిచెందారు. 70 మంది క్షతగాత్రులయ్యారు. ► బొల్లారం పారిశ్రామికవాడలో 13 ప్రమాదాల్లో ఆరుగురు కార్మికులు మరణించగా 40 మంది గాయపడ్డారు. ► బొంతపల్లిలో ఐదు ప్రమాదాలు చోటుచేసుకొని ఇద్దరు చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ► గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఐదు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మంది కార్మికులు గాయపడ్డారు. ► హత్నూర పారిశ్రామికవాడలో ఐదు ప్రమా దాలు జరగగా ఇద్దరు మరణించారు. 20 మంది కార్మికులు గాయపడ్డారు. పరిశ్రమల్లో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కార్మిక కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్నాయి. ఇందులో పనిచేస్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న ఘటనలు.. వారి ప్రాణాలను హరించి వేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి పొట్ట చేత పట్టుకొని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతానికి వలసొచ్చి నివసిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కార్మిక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజా ఘటనలు.. ► ఇటీవల బొల్లారంలోని అమరా ల్యాబ్స్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది గాయపడగా ఒక కార్మికుడు మృతిచెందాడు. ► తాజాగా హైగ్రోస్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారని తోటి కార్మికులు చెప్పారు. ► ఏడాది కాలంలో ఖైతాన్, వింధ్యా కెమికల్స్, మైలాన్, లీఫార్మా, శ్రీకర ల్యాబ్స్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు మరికొంత మంది కార్మికులు మృతిచెందారు. ఎందుకీ ప్రమాదాలు? రసాయన పరిశ్రమల్లో ఎక్కువగా మండే స్వభావం గల రసాయనాలను వినియోగిస్తుంటారు. రియాక్టర్లో రసాయనాలను కలిపే సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా రియాక్టర్ పేలి ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రమ్ముల్లో నుంచి రసాయనాలను వేరు చేసే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండేందుకు యాజమాన్యం నైపుణ్యం ఉన్న ఉద్యోగులతో పనులు చేయించాల్సి ఉంటుంది. రియాక్టర్లలో ఒత్తిడి నియంత్రణకు నూతన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఏర్పాటు చేయటంతో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ విషయంలో అవి నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమల శాఖ అధికారులు సైతం ప్రమాదాల నివారణ కోసం దృష్టి సారించటం లేదనే ఆరోపణలున్నాయి. నిబంధనలు పాటించని పరిశ్రమలపై చర్యలు! నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై యాజమాన్యాలకు అవగహన కల్పిస్తున్నాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వంటి సంస్థలకు నోటీసులు అందిస్తున్నాం. – శ్రీనివాస్‌రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇవి చదవండి: రాజీపడుతున్నట్లు నమ్మించి.. మద్యం తాగించి.. యువకుడిని దారుణంగా.. -
జాబ్‌లో చేరగానే లక్షల జీతం కావాలని ఆశ.. ఇంటర్వ్యూలకు సెలక్ట్ అయినా...
‘ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ కెమికల్ కంపెనీ విద్యార్థులకు రూ.16వేల జీతంతో ఉద్యోగాలు ప్రకటించగా.. కరీంనగర్‌కు చెందిన విద్యార్థులకు టాస్క్ ప్రతినిధులు, కళాశాలల వారు సమాచారమందించారు. ఇందులో చాలా మంది ఇంటర్వ్యూలకు హాజరవగా నలుగురు కూడా రిపోర్టు చేయలేదు. డిగ్రీ పూర్తి చేసినవారికి రూ.16 వేల జీతమిచ్చినా ఉద్యోగాల్లో చేరడం లేదు.’ ‘ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ విద్యార్థినికి ఒక కంపెనీల్లో ఉద్యోగం వచ్చింది. ఇంటర్వ్యూకు పంపించిన తల్లిదండ్రులు వివిధ కారణాలు చెప్పి ఉద్యోగానికి పంపించలేదు. దీంతో కంపెనీవారు సదరు ఉద్యోగం వేరే వారికి కేటాయించారు. అయితే ఇన్ని రోజులు స్కిల్స్ నేర్చుకొని ఉద్యోగం సాధించిన విద్యార్థిని ఇంటివద్దే ఉండిపోయింది. ఇలాగే చాలా మంది ఏళ్ల తరబడి శిక్షణ పొంది పలు ఇంటర్వూ్యలకు హాజరవడం లేదు. మరికొందరు ఉద్యోగం వచ్చినా వెళ్లడం లేదు’. కరీంనగర్: విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుదిద్ది ఉద్యోగాలు సాధించే దిశగా తయారు చేయాలని ప్రభుత్వం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ని రూపొందించింది. ఇందులో భాగంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌తో పాటు వివిధ కోర్సుల విద్యార్థులను, కళాశాలలను టాస్క్‌లో నమోదు చేయించి ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. నమోదైన ప్రతీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. కాగా శిక్షణ తీసుకున్న విద్యార్థులు అందివచి్చన ఉద్యోగ అవకాశాలను వదులుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల అనాసక్తి అని తెలుస్తోంది. ఉద్యోగాలపై అనాసక్తి... కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 62 కళాశాలలు టాస్క్‌లో నమోదు చేసుకున్నాయి. వీటిలో గతేడాది దాదాపు 2 లక్షల మంది నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 4,300 మంది నమోదు చేసుకున్నారు. టాస్క్ ప్రతినిధులు విడతల వారీగా కమ్యూనికేషనల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, రెజ్యుమ్ సెట్టింగ్, ప్రజేంటేషన్ స్కిల్స్, అపిటిట్యూడ్, టీం వర్క్, గ్రూప్ డిస్కషన్, ప్రోగ్రామింగ్ టెక్నిక్స్‌తో పాటు విద్యార్థుల కోర్సులను బట్టి అవసరమయ్యే వివిధ రకాల నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. కంపెనీలకు, విద్యార్థులకు అనుసంధానం చేస్తూ కార్పొరేట్ కంపెనీలు కోరుకునే స్కిల్స్‌లో పటిష్టంగా శిక్షణ ఇస్తున్నారు. కానీ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంటర్వూ్యల వరకు వెళ్లడం లేదు. టాస్క్ ప్రతినిధులు, కళాశాలల వారు సమాచారం అందించినా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా డిగ్రీ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నట్లు సమాచారం. జీతభత్యాలు లెక్కించి ఏమీ మిగలవని చెప్పి తల్లిదండ్రులే ఇంటి వద్దే ఆపేస్తుండగా, డిగ్రీతోనే లక్షల ప్యాకేజీ ఊహించుకున్న విద్యార్థులు కంపెనీలు అందిస్తున్న అవకాశాలను వదులుకుంటున్నారు. లక్షల్లో ప్యాకేజీలని ఊహలు డిగ్రీ, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు కంపెనీలు ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా కంపెనీలు మొదట్లో తక్కువ వేతనాలు ప్రకటిస్తుండగా, జీతాలు రూ.లక్షల్లో ఊహించుకుంటున్న విద్యార్థులు అటువైపు వెళ్లడంలేదు. పోటీ పడి స్కిల్స్ నేర్చుకుంటున్న విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంపై ఆసక్తి చూపడం లేదు. తద్వారా రూ.కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని విద్యారంగ నిపుణులు భావిస్తున్నారు. యువతరానికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా కల్పించాలనే ప్రభుత్వ తపన వృథా అవుతుందని బాధపడుతున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు వారి పంతా మార్చుకొని వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఉద్యోగాల్లో చేరితేనే ఉజ్వల భవిష్యత్తు టాస్క్‌లో నమోదైన విద్యార్థులకు ఎప్పటికప్పుడు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలకు కావాలి్సన మెలకువలు నేర్పిస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న పలువురు ఇంటర్వూ్యలకు దూరం కాగా మరికొందరు ఉద్యోగాల్లో ఎంపికైనా జాయిన్ కావడం లేదు. తల్లిదండ్రులు పంపించకపోవడమూ ఒక కారణమే. డిగ్రీ త ర్వాత వేతనాలు మొదట్లో కొన్ని సంస్థల్లో తక్కువగా ఉండి తర్వాత పెరుగుతాయి. ఉద్యోగం చేస్తూ పోతే అనుభవం పెరిగిన కొద్ది వేతనాలు పెంచుతారు. ఉద్యోగం చేస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. – గంగాప్రసాద్, టాస్క్ రీజనల్ కోఆరి్డనేటర్ -
సుమారు రూ. 15 వేల కోట్లు..! అబుదాబీ కంపెనీతో జతకట్టిన రిలయన్స్..! ఎందుకంటే..!
అబుదాబి ప్రభుత్వ యాజమాన్యంలోని కెమికల్స్ డెరివేటివ్స్ కంపెనీ (TA'ZIZ)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ జత కట్టింది. అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజక్టులో భాగంగా ఇరు కంపెనీలు కలిసి పనిచేయనున్నాయి. యూఎఈలో పెట్రోకెమికల్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పడానికి సంయుక్తంగా 2 బిలియన్ల డాలర్ల(సుమారు రూ. 15 వేల కోట్ల)ను పెట్టుబడి పెట్టనున్నాయి. పశ్చిమ అబుదాబిలోని రువైస్‌లో రసాయన ప్రాజెక్టు సౌకర్యాన్ని అభివృద్ధి చేయడానికి అబుదాబి రాష్ట్ర ఇంధన దిగ్గజం (ADNOC) రాష్ట్ర హోల్డింగ్ కంపెనీ (ADQ) ఇటీవల ఏర్పరిచిన TA'ZIZ జాయింట్ వెంచర్లో రిలయన్స్ చేరనుంది. ఈ కొత్త ‘TA'ZIZ EDC & PVC’ జాయింట్ వెంచర్‌తో 2 బిలియన్ కంటే ఎక్కువ పెట్టుబడితో క్లోర్-ఆల్కలీ, ఇథిలీన్ డైక్లోరైడ్ , పాలీ వినైల్ క్లోరైడ్ ఉత్పత్తి సౌకర్యాన్ని నిర్మించి, నిర్వహించనున్నాయి. యూఎఈ ఆర్థిక వ్యవస్థను బలోపేతం, పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి TA'ZIZ మిషన్ మద్దతునివ్వనుంది.రెగ్యులేటరీ అనుమతులకు లోబడి జాయింట్ వెంచర్ నిబంధనలపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ADNOC మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈవో, యూఎఈ ఇండస్ట్రీస్ మినిష్టర్ డాక్టర్ సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ , రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అధినేతల సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఈ జాయింట్ వెంచర్ ప్రారంభంపై ముఖేష్ అంబానీ మాట్లాడుతూ...భారత్, యూఎఈ మధ్య దీర్ఘకాల, విలువైన సంబంధాలను మరింత సుస్థిరం చేస్తోందని అన్నారు. చదవండి: 120 సెకండ్లలో హాట్‌కేకుల్లా అమ్ముడైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇవే...! -
భువనగిరిలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, భువనగిరి అర్బన్ : కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన భువనగిరి పట్టణ శివారులోని పారిశ్రామిక వాడలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక పారిశ్రామిక వాడలోని మహాసాయి ఫైర్ కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పెయింటింగ్, నెయిల్ పాలీష్, వార్నిష్‌లలో ఉపయోగించే లిక్విడ్‌ను తయారు చేస్తారు. రోజు మాదిరిగా ఆదివారం రాత్రి లిక్విడ్‌ను తయారు చేసే ప్రక్రియను కొనసాగించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటాక 2.15 గంటల సమయంలో కంపెనీలో లిక్విడ్ కోసం ఉపయోగించే రామెటిరియల్లో ఇథైన్, టోలిన్, మిథైల్ పంపింగ్ చేస్తున్న క్రమంలో మోటారు యంత్రంలో ఏర్పడిన విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ క్రమంలో నిప్పు రవ్వలు లేచి మంటలుగా వ్యాపించాయి. సమీపంలో ఉన్న ప్లాస్టిక్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఘటన సమాచారం అందుకున్న భువనగిరి ఫైర్ స్టేషన్ సిబ్బంది అగ్ని ప్రమాదం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో యాదగిరిగుట్ట, చౌటుప్పల్, రామన్నపేట నుంచి అగ్ని మాపక యంత్రాలను రప్పించారు. నాలుగు ఫైర్ ఇంజన్లతో 22 మంది సిబ్బంది కలిసి ఉదయం 7.30 గంటల వరకు మంటలను ఆర్పే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటలను అర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రూ.9 నుంచి రూ.10 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలు పారిశ్రామిక వాడలో పక్కపక్కనే పరిశ్రమలు ఉండడంతో కెమికల్ కంపెనీలో అగ్ని ప్రమాద ప్రభావం సమీపంలోని పరిశ్రమలపై పడింది. కంపెనీలో కెమికల్, ప్లాస్టిక్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఈ క్రమంలో మంటల పక్కనే ఉన్న మ్యాట్రిసెస్ కంపెనీలోకి వ్యాపించాయి. దీంతో మ్యాట్రిస్ కంపెనీ రేకులు, మ్యాట్రిసెస్‌లో వాడే కాయర్, ఫోం పూర్తిగా దగ్ధమైంది. దీంతో కొన్ని రూ.లక్షల వరకు ఆ కంపెనీలో నష్టం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని ఉమ్మడి జిల్లా అ గ్నిమాపక అధికారి వై.నారాయణ, భువనగిరి అర్డీ ఓ వెంకటేశ్వర్లు, ఏఓ మందడి ఉపేందర్‌రెడ్డి, భు వనగిరి అగ్నిమాపక కేంద్రం అధికారి అశోక్, చౌ టుప్పల్ ఫైర్‌స్టేషన్ అధికారి శ్రీశైలం, యాదగిరి గుట్ట సీఐ అంజనేయులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
రసాయన ప్లాంట్లకు అనుమతులేవీ?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెమికల్ కంపెనీలదో కొత్త సమస్య. వాటికి ఆర్డర్లున్నాయి. విస్తరణ చేపడితే వాటిని పూర్తి చేయొచ్చు. విస్తరణకు తగ్గ నిధులూ ఉన్నాయి. కాకపోతే కొత్త ప్లాంట్ల కోసం అనుమతులే రావటం లేదు. ఎక్కువ కాలుష్యం విడుదలవుతుంది కనక వాటికి ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించడానికి గానీ, అవి కోరుకున్న ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు గానీ అనుమతులు రావటం లేదు. ముచ్చర్లలో ఫార్మా సిటీని ప్రతిపాదించిన ప్రభుత్వం... అక్కడే వాటిని అనుమతించాలనుకుంటోంది. కాకపోతే... ఇంకా ఆ ఫార్మా సిటీకే అనుమతులు రాలేదు. ఫలితం... విస్తరణకు నోచుకోని పలు కంపెనీలు ఇతర రాష్ట్రాలకూ వలసపోతున్నాయి. రసాయనాలు, మాలిక్యూల్స్ ఎక్కువగా హైదరాబాద్‌తో పాటూ బెంగళూరు, పుణె నగరాల్లో తయారవుతుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాలిక్యూల్స్, రసాయనాల అభివృద్ధి కంపెనీలు 200 వరకూ ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న కంపెనీలకు పెద్ద మొత్తంలో అంటే 25 కిలోల కంటే ఎక్కువ మాలిక్యూల్స్‌కు ఆర్డర్ వస్తే అభివృద్ధి చేసే స్థాయిలో పరిశోధన కేంద్రాలు, లేబొరేటరీలు లేవు. పోనీ, సొంతంగానైనా రీసెర్చ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుందామంటే ప్రభుత్వం అనుమతివ్వటం లేదని బాలానగర్‌కు చెందిన హెటిరోసైక్లిక్స్ సీఈఓ డాక్టర్ జి.జగత్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. వచ్చిన ఆర్డర్‌ను పోనివ్వకుండా ఈ సంస్థలు బల్క్ డ్రగ్ తయారీ కంపెనీల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ‘‘ఇక్కడేమవుతుందంటే.. మాలిక్యూల్స్ అభివృద్ధి కోసం మా టెక్నాలజీని బల్క్ డ్రగ్ తయారీ సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడవి పెద్ద మొత్తంలో మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసిస్తాయి. టెక్నాలజీ లీక్ కావటంతో తర్వాత బల్క్ డ్రగ్ కంపెనీలే సొంతంగా మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసి తక్కువ ధరకు విక్రయించేస్తున్నాయి’’ అని జగత్‌రెడ్డి వివరించారు. మరికొన్ని కంపెనీలు మార్కెట్‌ను వదులుకోలేక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీకి తరలిపోయినట్లు తెలియవచ్చింది. ఫార్మాసిటీలోనే అనుమతులిస్తాం.. కొత్తగా రసాయనాలు, మాలిక్యూల్స్ అభివృద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు, ప్రస్తుతమున్న సంస్థల విస్తరణకు కూడా అనుమతించకపోవటానికి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం ఆయా ప్లాంట్ల తాలూకు కాలుష్యమే. అందుకే వాటిని ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మా సిటీలోనే ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాకపోతే ఇపుడు ముచ్చర్లలో ఏర్పాటు చేస్తామన్నా అనుమతులు దొరకటం లేదని పలు కంపెనీల ప్రతినిధులు వాపోయారు. ‘‘14 వేల ఎకరాల్లో రానున్న ఈ సిటీలో 2,500 ఎకరాలను రసాయన ప్లాంట్లు, ఆర్అండ్డీ కంపెనీలకు కేటాయించాం. కాకపోతే ఫార్మా సిటీ ఏర్పాటుకు ఇంకా కేంద్ర పర్యావరణ విభాగం అనుమతులివ్వాల్సి ఉంది. మరో 3–4 నెలల్లో అనుమతులు రావచ్చని అంచనా వేస్తున్నాం’’ అని టీఎస్ఐఐసీ ఎండీ ఈవీఎన్ రెడ్డి చెప్పారు. రూ.1,000 కోట్ల పెట్టుబడులొస్తాయా? ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రసాయనాలు, మాలిక్యూల్స్ తయారీ కంపెనీల్లో వందకు పైగా సంస్థలు సొంత ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని, ఒక్కో కంపెనీ కనీసం రూ.10 కోట్లతో మొత్తంగా రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ముందుకొచ్చిందని సమాచారం. ఆయా ప్లాంట్ల ఏర్పాటుతో కొత్తగా మరో 2,000–3,000 ఉద్యోగాలొచ్చే అవకాశముందని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆ ప్లాంట్ల తాలూకు కాలుష్యం గురించి ఆయన వద్ద ప్రస్తావించగా ‘‘ఫార్మా, బయో పరిశోధనలతో పోలిస్తే రసాయన పరిశోధనలతో వెలువడే కాలుష్యం 1% కంటే తక్కువే. రసాయన పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరమైతే ఉంది కదా? అనుమతులతో పాటు స్థలం, మౌలిక వసతుల వంటివి ఏర్పాటు చేయాలి కదా?’’ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు వ్యాఖ్యానించారు. కాలుష్య నివారణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రసాయనాలు, మాలిక్యూల్స్ పరిశోధనలో ఎక్కువగా నీరు కలుషితం కావటంతో పాటు , సేంద్రీయ కాలుష్యం జరుగుతుంది. 2 వేల లీటర్ల నీటి వినియోగంలో 10% వరకు రసాయన కాలుష్యం జరుగుతుంది. ఆ నీటి శుద్ధికి అయ్యే ఖర్చును భరించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు కూడా మరో ప్రతినిధి చెప్పారు. ఏటా 8వేల కోట్లకు పైనే ఎగుమతి ఒక్కో ఔషధ పరిశోధన కోసం 100 – 200 కిలోల వరకు మాలిక్యూల్స్ అవసరమవుతాయి. అయితే మాలిక్యూల్స్ అభివృద్ధి అనేది తేలికైన వ్యవహారం కాదు. సమయం, సాంకేతికత రెండూ సవాలే. 5 గ్రాముల మాలిక్యూల్ అభివృద్ధికి ఎంతలేదన్నా 20 రోజుల సమయం, రూ.25 వేల నుంచి 50 వేల వరకూ ఖర్చవుతుంది. ఇక్కడి నుంచి దేశీయ కంపెనీలతో పాటూ అమెరికా, యూకే, రష్యా, కెనడా, స్విట్జర్లాండ్, జపాన్ వంటి విదేశీ కంపెనీలు గ్రాములు, కిలోల చొప్పున వీటిని కొనుగోలు చేస్తుంటాయి. ‘‘మన దేశంతో పోలిస్తే విదేశాల్లో రసాయనాల అభివృద్ధి ఖర్చు ఎక్కువ. అంటే ముడిపదార్థాలు, కార్మికుల పనిగంటలు, ఇతరత్రా ఖర్చులు కలిపితే సగానికంటే తక్కువ వ్యయంతోనే మన దగ్గరి నుంచి దిగుమతి చేసుకునే వీలుంటుంది. అందుకే చాలా విదేశీ ఔషధ తయారీ సంస్థలు రసాయనాలను మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటాయని డాక్టర్ జగత్‌రెడ్డి తెలియజేశారు. విదేశీ కంపెనీల ఔషధ తయారీ, క్లినికల్ ట్రయల్స్‌లో 82–90% మాలిక్యూల్స్, రసాయనాల సరఫరా భారత్ నుంచే జరుగుతుంది. ఏటా రూ.8 వేల కోట్ల విలువైన మాలిక్యూల్స్ విదేశాలకు ఎగుమతవుతుందని చెప్పారు. -
కెమికల్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు
-
నాచారం కెమికల్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ కెమికల్ కంపెనీలో అంటుకున్న మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. రెలీమ్యాక్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ ల్యాబ్‌లో మంటలు చెలరేగడంతో అక్కడి స్థానికుల అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దాంతో హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.