హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కెమికల్ కంపెనీలదో కొత్త సమస్య. వాటికి ఆర్డర్లున్నాయి. విస్తరణ చేపడితే వాటిని పూర్తి చేయొచ్చు. విస్తరణకు తగ్గ నిధులూ ఉన్నాయి. కాకపోతే కొత్త ప్లాంట్ల కోసం అనుమతులే రావటం లేదు. ఎక్కువ కాలుష్యం విడుదలవుతుంది కనక వాటికి ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించడానికి గానీ, అవి కోరుకున్న ఇతర ప్రాంతాల్లో ఏర్పాటుకు గానీ అనుమతులు రావటం లేదు. ముచ్చర్లలో ఫార్మా సిటీని ప్రతిపాదించిన ప్రభుత్వం... అక్కడే వాటిని అనుమతించాలనుకుంటోంది. కాకపోతే... ఇంకా ఆ ఫార్మా సిటీకే అనుమతులు రాలేదు. ఫలితం... విస్తరణకు నోచుకోని పలు కంపెనీలు ఇతర రాష్ట్రాలకూ వలసపోతున్నాయి.
రసాయనాలు, మాలిక్యూల్స్ ఎక్కువగా హైదరాబాద్‌తో పాటూ బెంగళూరు, పుణె నగరాల్లో తయారవుతుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో మాలిక్యూల్స్, రసాయనాల అభివృద్ధి కంపెనీలు 200 వరకూ ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా బాలానగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే ప్రస్తుతమున్న కంపెనీలకు పెద్ద మొత్తంలో అంటే 25 కిలోల కంటే ఎక్కువ మాలిక్యూల్స్‌కు ఆర్డర్ వస్తే అభివృద్ధి చేసే స్థాయిలో పరిశోధన కేంద్రాలు, లేబొరేటరీలు లేవు. పోనీ, సొంతంగానైనా రీసెర్చ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుందామంటే ప్రభుత్వం అనుమతివ్వటం లేదని బాలానగర్‌కు చెందిన హెటిరోసైక్లిక్స్ సీఈఓ డాక్టర్ జి.జగత్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.
వచ్చిన ఆర్డర్‌ను పోనివ్వకుండా ఈ సంస్థలు బల్క్ డ్రగ్ తయారీ కంపెనీల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. ‘‘ఇక్కడేమవుతుందంటే.. మాలిక్యూల్స్ అభివృద్ధి కోసం మా టెక్నాలజీని బల్క్ డ్రగ్ తయారీ సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడవి పెద్ద మొత్తంలో మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసిస్తాయి. టెక్నాలజీ లీక్ కావటంతో తర్వాత బల్క్ డ్రగ్ కంపెనీలే సొంతంగా మాలిక్యూల్స్‌ను అభివృద్ధి చేసి తక్కువ ధరకు విక్రయించేస్తున్నాయి’’ అని జగత్‌రెడ్డి వివరించారు. మరికొన్ని కంపెనీలు మార్కెట్‌ను వదులుకోలేక ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీకి తరలిపోయినట్లు తెలియవచ్చింది.
ఫార్మాసిటీలోనే అనుమతులిస్తాం..
కొత్తగా రసాయనాలు, మాలిక్యూల్స్ అభివృద్ధి ప్లాంట్ల ఏర్పాటుకు, ప్రస్తుతమున్న సంస్థల విస్తరణకు కూడా అనుమతించకపోవటానికి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం ఆయా ప్లాంట్ల తాలూకు కాలుష్యమే. అందుకే వాటిని ముచ్చర్లలో ప్రతిపాదిత ఫార్మా సిటీలోనే ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాకపోతే ఇపుడు ముచ్చర్లలో ఏర్పాటు చేస్తామన్నా అనుమతులు దొరకటం లేదని పలు కంపెనీల ప్రతినిధులు వాపోయారు. ‘‘14 వేల ఎకరాల్లో రానున్న ఈ సిటీలో 2,500 ఎకరాలను రసాయన ప్లాంట్లు, ఆర్‌అండ్‌డీ కంపెనీలకు కేటాయించాం. కాకపోతే ఫార్మా సిటీ ఏర్పాటుకు ఇంకా కేంద్ర పర్యావరణ విభాగం అనుమతులివ్వాల్సి ఉంది. మరో 3–4 నెలల్లో అనుమతులు రావచ్చని అంచనా వేస్తున్నాం’’ అని టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీఎన్ రెడ్డి చెప్పారు.
రూ.1,000 కోట్ల పెట్టుబడులొస్తాయా?
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రసాయనాలు, మాలిక్యూల్స్ తయారీ కంపెనీల్లో వందకు పైగా సంస్థలు సొంత ప్లాంట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయని, ఒక్కో కంపెనీ కనీసం రూ.10 కోట్లతో మొత్తంగా రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడులకు ముందుకొచ్చిందని సమాచారం. ఆయా ప్లాంట్ల ఏర్పాటుతో కొత్తగా మరో 2,000–3,000 ఉద్యోగాలొచ్చే అవకాశముందని ఓ కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఆ ప్లాంట్ల తాలూకు కాలుష్యం గురించి ఆయన వద్ద ప్రస్తావించగా ‘‘ఫార్మా, బయో పరిశోధనలతో పోలిస్తే రసాయన పరిశోధనలతో వెలువడే కాలుష్యం 1% కంటే తక్కువే.
రసాయన పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరమైతే ఉంది కదా? అనుమతులతో పాటు స్థలం, మౌలిక వసతుల వంటివి ఏర్పాటు చేయాలి కదా?’’ అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు వ్యాఖ్యానించారు. కాలుష్య నివారణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రసాయనాలు, మాలిక్యూల్స్ పరిశోధనలో ఎక్కువగా నీరు కలుషితం కావటంతో పాటు , సేంద్రీయ కాలుష్యం జరుగుతుంది. 2 వేల లీటర్ల నీటి వినియోగంలో 10% వరకు రసాయన కాలుష్యం జరుగుతుంది. ఆ నీటి శుద్ధికి అయ్యే ఖర్చును భరించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు కూడా మరో ప్రతినిధి చెప్పారు.
ఏటా 8వేల కోట్లకు పైనే ఎగుమతి
ఒక్కో ఔషధ పరిశోధన కోసం 100 – 200 కిలోల వరకు మాలిక్యూల్స్ అవసరమవుతాయి. అయితే మాలిక్యూల్స్ అభివృద్ధి అనేది తేలికైన వ్యవహారం కాదు. సమయం, సాంకేతికత రెండూ సవాలే. 5 గ్రాముల మాలిక్యూల్ అభివృద్ధికి ఎంతలేదన్నా 20 రోజుల సమయం, రూ.25 వేల నుంచి 50 వేల వరకూ ఖర్చవుతుంది. ఇక్కడి నుంచి దేశీయ కంపెనీలతో పాటూ అమెరికా, యూకే, రష్యా, కెనడా, స్విట్జర్లాండ్, జపాన్ వంటి విదేశీ కంపెనీలు గ్రాములు, కిలోల చొప్పున వీటిని కొనుగోలు చేస్తుంటాయి.
‘‘మన దేశంతో పోలిస్తే విదేశాల్లో రసాయనాల అభివృద్ధి ఖర్చు ఎక్కువ. అంటే ముడిపదార్థాలు, కార్మికుల పనిగంటలు, ఇతరత్రా ఖర్చులు కలిపితే సగానికంటే తక్కువ వ్యయంతోనే మన దగ్గరి నుంచి దిగుమతి చేసుకునే వీలుంటుంది. అందుకే చాలా విదేశీ ఔషధ తయారీ సంస్థలు రసాయనాలను మన దేశం నుంచి దిగుమతి చేసుకుంటాయని డాక్టర్ జగత్‌రెడ్డి తెలియజేశారు. విదేశీ కంపెనీల ఔషధ తయారీ, క్లినికల్ ట్రయల్స్‌లో 82–90% మాలిక్యూల్స్, రసాయనాల సరఫరా భారత్ నుంచే జరుగుతుంది. ఏటా రూ.8 వేల కోట్ల విలువైన మాలిక్యూల్స్ విదేశాలకు ఎగుమతవుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment