రొయ్యయ్యో..
వ్యాపారుల మాయాజాలంతో రొయ్యల రైతులు విలవిల్లాడుతున్నారు. నాణ్యతలేని సీడ్తో దిగుబడులు సగానికి పడిపోయి..సాగు ఖర్చులు రెట్టింపై ఒకవైపు తల్లడిల్లుతుంటే ధరలు పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రోజూ కేజీకి రూ.10 నుంచి రూ.20 ధర తగ్గిస్తూనే ఉన్నారు.
టంగుటూరు: రొయ్యల వ్యాపారులు కూడబలుక్కొని ధరలను అమాంతం తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నాణ్యతలేని సీడ్ కారణంగా దిగుబడులు సగానికి పడిపోయాయి. సీడ్, ఫీడ్, కెమికల్స్ ధరలు, విద్యుత్ చార్జీలు పెరగడంతో సాగు వ్యయం పెరిగిపోయింది. దీనికితోడు ధరల తగ్గుదల రైతులకు ఆశనిపాతంలా మారింది.
యాంటీబయోటిక్స్ సాకుతో ధరల తగ్గుదల:
యాంటీబయోటిక్స్ అధిక మోతాదులో వాడారన్న కారణంగా మూడు నెలల క్రితం అమెరికాకు ఎగుమతైన రొయ్యల కంటైనర్లు కొన్ని తిరస్కరణకు గురై వెనక్కు వచ్చాయి. ఇదే సాకుగా చెప్పి వ్యాపారులు ధరలు తగ్గించడం ప్రారంభించారు. మూడు నెలల క్రితం వరకు రైతులకు గిట్టుబాటుగా ఉన్న ధరలపై వ్యాపారులు సిండికేటై కొర్రీలేశారు. అప్పటి వరకు కేజీ 30 కౌంట్ రూ.500 వరకూ ఉన్న ధరను క్రమంగా తగ్గించుకుంటూ మంగళవారానికి రూ.430కు చేర్చారు.ఇటీవలి కాలంలో రోజుకి రూ.10 నుంచి రూ.20 తగ్గిస్తూనే ఉన్నారు.
మంగళవారం నాటి రొయ్యల ధరలు:
30 కౌంట్ రూ.430, అలాగే 40 కౌంట్ రూ.360, 50 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ.300, 70 కౌంట్ రూ.280, 80 కౌంట్ రూ.260, 90 కౌంట్ రూ.230, 100 కౌంట్ రూ.210 ధరలు ఉన్నాయి.
30, 40 కౌంట్లకు లేని గిరాకీ:
సాధారణంగా రొయ్యలనగానే 30 కౌంట్కు ఇచ్చే ధరనే ప్రామాణికంగా భావిస్తారు. 30 కౌంట్కే అధిక ధర చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం 30, 40 కౌంట్లకు గిరాకీ లేదు. ఈ రెండు కౌంట్లకు రోజుకు రూ.10 నుంచి రూ.20 ధర తగ్గించేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ రెండు రకాల కౌంట్ల రొయ్యలను అడిగే వ్యాపారులే కరువయ్యారు. 30 కౌంట్ వరకూ రొయ్యలు పెంచితే అధిక ధరలతో పాటు దిగుబడయ్యే సరుకూ పెరుగుతుందని రైతులు ఆశిస్తారు. అందుకే కష్టమైనా..నష్టమైనా మధ్యలో రొయ్యలు దెబ్బతింటే తప్ప రైతులంతా 30 కౌంట్ వరకూ రొయ్యలు పెంచేందుకే ప్రయత్నిస్తారు. ప్రస్తుతం 30 కౌంట్ వరకూ రొయ్యలు పెంచిన రైతులు సరుకు అడిగే వారు లేక కొనుగోలుకు ముందుకొచ్చినా ధరలు దారుణంగా తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు.
ధరలు ఇవ్వరు..పొరుగు రాష్ట్రాల వ్యాపారులను దరిచేరనివ్వరు:
రాష్ట్రంలోని తీర ప్రాంతంలో విస్తారంగా సాగు చేస్తున్నారు. మండలంలోని తీర ప్రాంతంలోనే సుమారు 5 వేల హెక్టార్లలో రొయ్యల సాగు ఉంది. ఇక్కడి దిగుబడులను విశాఖపట్నం కేంద్రంగా కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తూ ధరలను వారి ఇష్టానుసారం కొనుగోలు చేస్తున్నారు. వీరిచ్చే ధరల కన్నా కేజీ రూ.20 పైగా అధికంగా ఇచ్చి కొనుగోలు చేసేందుకు మహారాష్ట్ర, కేరళ, ఒడిసా వ్యాపారులు ముందుకొస్తున్నా వారిని ఇక్కడి వ్యాపారులు రానివ్వరు. ధరలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో వ్యాపారులదే ఇష్టారాజ్యంగా ఉంది. రొయ్యల ఎగుమతులపై సుంకం రూపేణా ఏడాదికి కోట్లాది రూపాయలు గడిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను వ్యాపారులకు వదిలి..రైతులను గాలికొదిలేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హేచరీల దోపిడీ..
హేచరీల్లో ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని సీడ్ ను అధిక ధరలకు రైతులకు అంటగడుతూ కోట్లు గడిస్తున్నాయి. మత్స్యశాఖాధికారులు వాటిపై కన్నెత్తి చూడటం లేదు. చెరువులో వేసిన సీడ్ సగానికిపైగా ప్రాథమిక దశలోనే చనిపోతూ సర్వేవల్ 60 శాతానికి పడిపోతోంది. నాణ్యతలేని సీడ్ రైతులకు సరఫరా చేస్తున్న హేచరీలు తమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నాయి. వ్యాపారులు, అధికారులు, హేచరీల యాజమాన్యాలు రైతులను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నా ఎవరికీ పట్టడం లేదు.