రసాయన ఆయుధాల నాశనానికి ఏడాది పడుతుంది: బషర్ అల్-అసద్
సిరియా అధ్యక్షుడు అసద్ వెల్లడి
డమాస్కస్: సిరియాలో రసాయన ఆయుధాలను నాశనం చేయడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ స్పష్టంచేశారు. సిరియా ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని, విదేశాల మద్దతుతోనే అల్కాయిదా చొరబాటు శక్తులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయని చెప్పారు. 80కిపైగా దేశాలకు చెందిన అల్కాయిదా గెరిల్లాలు ఇందులో పాలుపంచుకుంటున్నాయని ఆరోపించారు. అంతేతప్ప ఇక్కడ జరుగుతున్నది అంతర్యుద్ధం కానేకాదని చెప్పారు. అమెరికా వార్తా చానల్ ‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈవిషయాలు వెల్లడించారు. రసాయన ఆయుధాలను నాశనం చేయడమనేది ఆషామాషీ వ్యవహారం కాదని, సాంకేతికంగా ఇదో పెద్ద సంక్లిష్ట ప్రక్రియ అని అసద్ పేర్కొన్నారు. దీనికి కనీసం 100 కోట్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుందన్నారు.