‘టైమంతా కెమిస్ట్రీకే సరిపోయింది’
సాక్షి, హైదరాబాద్: ‘కెమిస్ట్రీలో సమస్యాపూరక ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం, వాటికే ఎక్కువ సమయం పట్టింది.. ఫిజిక్స్‌లో అన్వయ సంబంధ అంశాలపై ప్రశ్నలు వచ్చాయి... బయాలజీలో తికమక పెట్టేలా ప్రశ్నలు ఉన్నాయి. వీటిన్నిటితో వాటికే ఎక్కువ సమయం అయిపోయింది..’. ఇది శనివారం నిర్వహించిన ఎంసెట్-2కు హాజరైన విద్యార్థుల మనోగతం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఎంసెట్-2 పరీక్షకు 90.76 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ప్రశ్నల విషయంలో చూస్తే.. సిలబస్ ప్రకారమే ప్రశ్నలు వచ్చాయని, తెలుగు అకాడమీ పుస్తకాల్లోని ప్రశ్నలనే ఇచ్చారని సబ్జెక్టు నిఫుణలు వెల్లడించారు. ప్రశ్నల్లో తప్పులేమీ లేవని పేర్కొన్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రతిభావంతులైన విద్యార్థులే వేగంగా జవాబులను గుర్తించి రాయగలిగేలా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక పరీక్ష ప్రాథమిక కీని శనివారం సాయంత్రం ఎంసెట్ కమిటీ విడుదల చేసింది. దానిని ఎంసెట్-2 వెబ్సైట్లో (med.tseamcet.in) అందుబాటులో ఉంచింది. ఈ కీపై ఈనెల 12వ మధాహ్నం 2 గంటల వరకు అభ్యంతరాలను మెయిల్ ద్వారా (keyobjectionstseamcet2016@gmail.com) స్వీకరిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. ఇక ర్యాంకులను ఈనెల 14న ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదని, ఎలాంటి తప్పులు దొర్లలేదని పేర్కొన్నారు. పరీక్షకు ‘ఆర్’ సెట్ కోడ్ కలిగిన ప్రశ్నాపత్రాన్ని ఉదయం 6 గటలకు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు.