చెన్నైకే చెల్లింది
ఐపీఎల్ అంటే ‘ఫైనల్లో చెన్నైతో తలపడేందుకు మిగతా ఏడు జట్లు లీగ్‌లో పోటీ పడుతుంటాయి’.... ఈ పాపులర్ డైలాగ్‌లో ఎంత వాస్తవం ఉందో మరోసారి కనిపించింది. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, విజయంపై ఎలాంటి ఆశలు లేని స్థితిలో నిలిచినా... అక్కడి నుంచే ఆటను మలుపు తిప్పి గెలుపు బొమ్మను జేబులో వేసుకోవడం చెన్నైకి చెల్లినంతగా మరెవరికీ సాధ్యం కాదేమో. వాట్సన్ విఫలం, రాయుడు డకౌట్, లెక్క లేనన్ని సార్లు జట్టును గెలిపించిన రైనా వల్ల కాలేదు, ధోని, బ్రేవో కూడా చేతులెత్తేశారు... కానీ సన్‌రైజర్స్‌తో క్వాలిఫయిర్‌లో ఆ జట్టుకు కొత్త హీరో దొరికాడు. లీగ్‌లో నాలుగు మ్యాచ్‌లే ఆడిన డు ప్లెసిస్ అసలు పోరులో నిలిచాడు... ఓటమి అంచుల్లోంచి చెన్నైని తప్పించి ‘చోకర్’ ముద్ర పడకుండా జట్టును గెలిపించిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా నిలిచాడంటే అది కూడా చెన్నై మహత్యమేనేమో!
చెన్నై విజయానికి చివరి 3 ఓవర్లలో 43 పరుగులు కావాలి. సన్‌రైజర్స్ కెప్టెన్ తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం మ్యాచ్ దిశను మార్చేసింది. బ్రాత్‌వైట్ వేసిన 18వ ఓవర్లో 20 పరుగులు రాబట్టిన ఆ జట్టు, కౌల్ వేసిన 19వ ఓవర్లో మరో 17 పరుగులు తీసింది. చివరి ఓవర్ భువీ వేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. ధోని తరహాలో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి డు ప్లెసిస్ సూపర్ కింగ్స్‌ను ఏడోసారి ఫైనల్ చేర్చాడు. బ్యాటింగ్ వైఫల్యంతో 139 పరుగులకే పరిమితమైన హైదరాబాద్ తమ బలమైన బౌలింగ్‌తో ఒక దశలో గెలుపునకు చేరువగా వచ్చినా చివరకు చతికిలపడింది. బ్యాటింగ్‌లో ఒకే ఓవర్లో 20 పరుగులు బాది సన్ ఆశలు నిలిపిన బ్రాత్‌వైట్, ఆ తర్వాత అన్నే పరుగులు బౌలింగ్‌లో ఇవ్వగా... బౌలింగ్‌లో 50 పరుగులు సమర్పించి విలన్‌గా మారబోయిన శార్దుల్ ఠాకూర్ చివరి క్షణాల్లో మూడు ఫోర్లతో జట్టు రాత మార్చాడు. మ్యాచ్ ఓడినా ఫైనల్ చేరేందుకు రెండో క్వాలిఫయర్ రూపంలో సన్‌రైజర్స్‌కు మరో అవకాశం మిగిలే ఉంది.
ముంబై: ఎందుకో, ఏమో కాని ధోని నాయకత్వం వహించే జట్టులో ఓ ప్రత్యేకత కనిపిస్తుంటుంది. అప్పటిదాక ఎలా ఆడినా, తన సారథ్యంలో ఆటగాళ్లు విశేషంగా రాణిస్తుంటారు. మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇక్కడ జరిగిన ఐపీఎల్ మొదటి క్వాలిఫయర్ మ్యాచే దీనికి ఉదాహరణ. ప్రత్యర్థి బౌలర్ల దెబ్బకు స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని పరిస్థితుల్లో పడిన చెన్నై సూపర్‌కింగ్స్... అసాధారణ రీతిలో పుంజుకుని ఏకంగా మ్యాచ్‌నే గుంజేసుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఓపెనర్ డు ప్లెసిస్ (42 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ, అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు శార్దుల్ ఠాకూర్ (5 బంతుల్లో 15 నాటౌట్; 3 ఫోర్లు) మెరుపు దాడితో ఆ జట్టు ఐదు బంతులుండగానే ఛేదనను పూర్తి చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. కార్లోస్ బ్రాత్‌వైట్ (29 బంతుల్లో 43 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ విలియమ్సన్ (15 బంతుల్లో 24; 4 ఫోర్లు) రాణించాడు. చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి లక్ష్యాన్ని అందుకుంది.
ఆరంభం నుంచే తడబ్యాటు...
సన్‌రైజర్స్ జట్టులో జోరు మీదున్నది ఇద్దరే బ్యాట్స్‌మెన్. వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (0) దీపక్ చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డయ్యాడు. అయితే, విలియమ్సన్ వరుసగా మూడు ఫోర్లు కొట్టి ఓవర్‌ను ఘనంగా ముగించాడు. మరో ఎండ్‌లో ఇన్‌గిడిని కాచుకుంటూ రెండు బౌండరీలు బాదిన శ్రీవత్స్ గోస్వామి (12) అతడికే వికెట్ ఇచ్చుకున్నాడు. తర్వాత మూడు బంతులకే ఇంకో పెద్ద దెబ్బ. లెగ్ సైడ్ వెళ్తున్న శార్దుల్ బంతిని వెంటాడిన విలియమ్సన్ మూల్యం చెల్లించుకున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 47/3. రెండు ఓవర్లు ఎదురొడ్డిన షకీబ్ (12) సైతం కెప్టెన్ తరహాలోనే అవుటయ్యాడు. యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో 24; 3 ఫోర్లు), మనీశ్ పాండే (8) వికెట్ పడకూడదన్నట్లు ఆడారు. వీరి భాగస్వామ్యంలో 29 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా లేకపోవడంతో రన్‌రేట్ 6కు పడిపోయింది. ఇంతలో పాండే... జడేజాకు రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో జట్టు సగం వికెట్లు కోల్పోయింది. వేగం పెంచే యత్నంలో ఉన్న పఠాన్‌ను బ్రేవో తన బౌలింగ్‌లోనే చక్కటి క్యాచ్ పట్టి పెవిలియన్ చేర్చాడు. 15 ఓవర్లకు 88/6తో ఉన్న హైదరాబాద్... స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేకపోవడంతో కనీస స్కోరైనా చేస్తుందా? అనిపించింది. కానీ, బ్రాత్‌వైట్, భువనేశ్వర్ (7) నిలిచారు. శార్దుల్ వేసిన 18వ ఓవర్లో ఇన్నింగ్స్ తొలి సిక్స్ బాది జట్టు స్కోరును 100 దాటించిన బ్రాత్‌వైట్ మరుసటి బంతినీ అదే విధంగా బాది ఊపు తెచ్చాడు. ఇన్‌గిడి కట్టడి చేసినా... 20వ ఓవర్లో శార్దుల్ మరోసారి బలయ్యాడు. బ్రాత్‌వైట్ రెండు సిక్స్‌లు, ఫోర్ సహా 20 పరుగులు పిండుకోవడంతో సన్‌రైజర్స్‌కు పోరాడగల స్కోరు దక్కింది.
చివర్లో టాప్ గేర్‌లోకి...
సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను తలపిస్తూ మొదలైంది. ఓపెనర్ వాట్సన్ (0)... భువనేశ్వర్‌ను ఆడేందుకు తీవ్రంగా ఇబ్బందిపడి ఐదో బంతికే క్యాచ్ ఇచ్చాడు. బౌండరీలతో పరిస్థితిని తేలిక చేస్తున్న రైనా (13 బంతుల్లో 22; 4 ఫోర్లు)ను, మ్యాచ్‌కే హైలైట్ అనదగ్గ యార్కర్‌తో రాయుడు (0)ని వరుస బంతుల్లో బౌల్డ్ చేసిన కౌల్ దెబ్బతీశాడు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జట్టు 33/3తో నిలిచింది. ఓవైపు డు ప్లెసిస్ పాతుకుపోయినా... ధోని (9), బ్రేవో (7), జడేజా (3) బంతులు మింగడం తప్ప స్కోరు చేయలేకపోయారు. అయితే, చహర్ (10) తోడుగా ఏడో వికెట్‌కు డు ప్లెసిస్ 30 పరుగులు జోడించి సూపర్ కింగ్స్‌ను పోటీలోకి తెచ్చాడు. ఐదు ఓవర్లలో 48 పరుగులు చేయాల్సిన స్థితిలో హర్భజన్ (2) బంతులను వృథా చేయడంతో మ్యాచ్ మళ్లీ సన్‌రైజర్స్ వైపు మొగ్గింది. అయితే, బ్రాత్‌వైట్ వేసిన 18వ ఓవర్లో డు ప్లెసిస్ మూడు ఫోర్లు, సిక్స్ సహా 20 పరుగులు రాబట్టడం, భజ్జీ రనౌట్‌తో క్రీజులోకి వచ్చిన శార్దుల్... కౌల్ వేసిన 19వ ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు చేయడంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా భువీ వేసిన తొలి బంతినే సిక్స్ బాది డు ప్లెసిస్ తన శ్రమకు సరైన ముగింపు ఇచ్చుకున్నాడు.
►7 చెన్నై ఐపీఎల్ ఫైనల్ చేరడం ఇది ఏడో సారి. రెండు సార్లు టైటిల్ గెలిచిన ఆ జట్టు నాలుగు ఫైనల్స్‌లో ఓడింది.
► 8 ధోనికి ఇది ఎనిమిదో ఫైనల్. చెన్నైతో పాటు 2017లో అతను ఆడిన పుణే సూపర్ జెయింట్ ఫైనల్ చేరింది. ఏ ఆటగాడికైనా ఇదే అత్యధికం.