చెన్నై సూపర్ కింగ్...
సాక్షి క్రీడావిభాగం
రవిచంద్రన్ అశ్విన్ మంచినీళ్ల ప్రాయంలా వరుస పెట్టి వికెట్లు తీయడం కొత్త కాదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సింహస్వప్నంలా మారి కొత్త కొత్త రికార్డులు సృష్టించడం కూడా అతనికి ఇప్పుడు వాకింగ్‌కు వెళ్లినంత సాధారణంగా మారిపోయింది. తాజాగా వచ్చిన ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా అతని అబ్బురపరిచే గణాంకాలకు లభించిన మరో గౌరవం. కానీ అశ్విన్ అంటే సాధారణ బౌలర్ మాత్రమే కాదు. అతడు ఒక జీనియస్. అతని ఖాతాలో వచ్చి పడిన ప్రతీ వికెట్ వెనక ఒక కథ ఉంటుంది. సాధారణంగా టీమ్ సమావేశాల్లో, కోచ్ చెప్పే సూచనలతో అమలు చేసే వ్యూహాలకు అశ్విన్ తన సొంత ఇంజనీరింగ్ బుర్రను జోడిస్తాడు. ఒక మంచి బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయాలంటే ఎంతగా శ్రమించాలో అంతగా హోంవర్క్ చేసి మైదానంలోకి అడుగు పెడతాడు. తాను వేసే ప్రతీ బంతి తన ఆఖరి బంతి అన్నంత కసితో బౌలింగ్ చేస్తాడు. గత ఏడాది సంగక్కరను నాలుగు ఇన్నింగ్స్‌లలో నాలుగు సార్లు అవుట్ చేయడం అయినా... ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రూట్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చే బలహీనతను గుర్తించి దానికి తగినట్లుగా బంతిని సంధించడం అయినా... వారిని అవుట్ చేయడంలో అతను చెప్పిన విశ్లేషణ అబ్బురపరుస్తుంది. అవసరానికి, పరిస్థితులకు తగినట్లుగా అతను తనను తాను మలచుకున్న తీరు అశ్విన్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ముందు బ్యాట్స్‌మన్‌గా మొదలు పెట్టి, ఆ తర్వాత కాస్త మీడియం పేస్ బంతులు వేయగలిగిన బౌలర్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్‌స్పిన్నర్‌లలో ఒకడిగా ఎదిగాడు. తన మార్క్‌నుంచి రనప్ మొదలు పెట్టడం నుంచి మ్యాచ్ ముగిసే వరకు తాను ప్రతీ బంతి ఎలా వేశాడో మైండ్‌లో ఫిక్స్ చేసుకోగలిగిన అశ్విన్, వేలాది గంటల నెట్ ప్రాక్టీస్‌కంటే విలువైన పాఠాలు మ్యాచ్‌నుంచే నేర్చుకుంటాడు. స్కూల్ స్థాయి క్రికెట్‌లోనే తనకు ఫలానా విధంగా ఫీల్డింగ్ కావాలంటూ కోచ్‌తో వాదన పెట్టుకున్న అశ్విన్‌కు తన తెలివితేటలపై అపార నమ్మకం ఉంది. జిమ్‌లో ఎన్ని గంటలు గడిపినా సహచరులతో పోలిస్తే మైదానంలో చురుగ్గా మారలేనని గుర్తించిన అతను, ఆటకు అవసరం కాబట్టి వికెట్ల మధ్య పరుగెత్తడంలో ప్రత్యేక కోచ్‌ను పెట్టుకొని మరీ సాధన చేశాడు. ఒక దశలో వరుసగా ఆరు టెస్టుల్లో అతడికి అవకాశం దక్కని సమయంలోనూ నేను అత్యుత్తమ బౌలర్‌గా ఎదుగుతాను అంటూ తన యాక్షన్‌ను మార్చుకొని మరీ సంచలనాలకు శ్రీకారం చుట్టడం అశ్విన్‌కే సాధ్యమైంది. బౌలింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న సమయంలోనూ నాకెందుకీ బ్యాటింగ్ తలనొప్పి అన్నట్లుగా అతను దూరం జరిగిపోలేదు. బ్యాటింగ్‌ను కూడా అంతే ప్రేమించాడు. అదే స్థాయిలో కష్టపడి ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా కూడా అవతలి జట్టుకు చెమటలు పట్టిస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించిన ప్రతీ సూక్ష్మమైన అంశంపై అతనికి పట్టుంది. తాను మ్యాచ్ ఆడని సమయంలో టీవీలో చాలా ఎక్కువగా క్రికెట్ చూస్తాడు. అది జింబాబ్వే ఆడుతున్న సిరీస్ అయినా సరే. ఏదో సరదా కోసమో, పేపర్లో ఫొటో కోసమో కాకుండా ఆటపై ఇష్టంతో ఇటీవలే చెన్నైలో అతను టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు. అక్కడ కూడా అంతర్జాతీయ మ్యాచ్ ఆడినంత సీరియస్‌గా తన దూస్రాలతో బ్యాట్స్‌మెన్‌ను అవుట్ చేయడమే లక్ష్యంగా శ్రమించాడు. నా ఆట తప్ప నేనేమీ పట్టించుకోను అంటూ చెప్పుకునే టైపు క్రికెటర్ కాదు అతను. అతను పత్రికలు చదువుతాడు.
నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు వెల్లడిస్తాడు. అది పిచ్‌పై వచ్చిన విమర్శలపై అయినా, చకింగ్ గురించైనా, లేదంటే హర్భజన్‌తో పోలిక అయినా సరే. తాజాగా ముంబై టెస్టులో తన కెప్టెన్‌పై అండర్సన్ చేసిన వ్యాఖ్యలపై అతనితోనే నేరుగా తలపడటం అశ్విన్ ముక్కుసూటితనాన్ని చూపిస్తుంది. మీడియా సమావేశంలో కూడా డొంకతిరుగుడు లేకుండా స్పష్టంగా జవాబివ్వడంలో అశ్విన్ తర్వాతే ఎవరైనా. ట్విట్టర్‌ను ఏదో నామ్‌కే వాస్తేగా వాడకుండా దానిని సమర్థంగా వినియోగించే భారత క్రికెటర్ అశ్విన్ ఒక్కడే. ఎంతటి కీర్తి కనకాదులు వచ్చిన తర్వాత కూడా ఇతర తమిళనాడు క్రికెటర్ల తరహాలో హై క్లాస్ ఏరియాలోకి మారకుండా అతను తన పాత లొకాలిటీలో, అదే ఇంట్లో ఇప్పటికీ ఉంటున్నాడు. అసంఖ్యాకమైన చెన్నైయిన్‌లలాగే రజినీకాంత్, కమల్‌హాసన్‌లతో పాటు ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడే ఈ స్టార్ ఆటగాడు భారత క్రికెట్‌పై వేసిన ముద్ర ప్రత్యేకం.